Thursday, June 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెలుగులోకి వస్తున్న ఒప్పంద వివరాలు

వెలుగులోకి వస్తున్న ఒప్పంద వివరాలు

- Advertisement -

అణ్వాయుధాలకు ఇరాన్‌ స్వస్తి…చమురు విక్రయానికి టెహ్రాన్‌కు అనుమతి
ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనం ఎత్తివేత
హార్ముజ్‌లో నౌకాయానానికి గ్రీన్‌సిగ్నల్‌


పారిస్‌/దుబాయి :
ఇరాన్‌-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్న దానిని బట్టి ఒప్పందం ప్రకారం ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండవు. చమురును విక్రయించేందుకు ఇరాన్‌ను అమెరికా అనుమతిస్తుంది. ఇటీవల సంతకాలు జరిగిన ఎంఓయులో ఏముందనే విషయం ఇప్పటి వరకూ బహిర్గతం కాలేదు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఏప్రిల్‌లో ప్రకటించిన కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగిస్తారు. శాశ్వత ఒప్పందం కోసం సంప్రదింపులు జరిపేందుకు ఈ కాలాన్ని ఇరు పక్షాలు ఉపయోగించుకుంటాయి. ఒప్పందం ప్రకారం ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుంది. అలాగే హార్ముజ్‌ జలసంధి మీదుగా చమురు ట్యాంకర్లు, ఇతర సముద్ర రవాణాను ఇరాన్‌ అనుమతిస్తుంది. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండరాదని ఒప్పందం స్పష్టంగా చెప్పిందని ట్రంప్‌ తెలిపారు. ఒప్పందపు పూర్తి పాఠాన్ని కొద్ది రోజులలో బహిర్గతం చేస్తారు. వాస్తవానికి అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోనని ఇరాన్‌ చాలా కాలంగా చెబుతూనే ఉంది. తన అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమేనని అంటోంది. తాత్కాలిక ఒప్పందంలో ఇజ్రాయిల్‌, లెబనాన్‌ ప్రస్తావన కూడా ఉన్నదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలిపారు. అయితే ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ వాదన మరోలా ఉంది. ఒప్పందానికి తాము కట్టుబడి ఉండబోమని ఆయన తేల్చి చెప్పారు. దక్షిణ లెబనాన్‌ నుంచి సేనల ఉపసంహరణ ప్రసక్తే లేదని అన్నారు. తాత్కాలిక ఒప్పందంలో కీలక అంశాల ప్రస్తావనే లేదు. ఇరాన్‌ అణు కార్యక్రమం భవిష్యత్తు వంటి వివాదాస్పద అంశాలను తదుపరి చర్చలలో ప్రస్తావిస్తారు.

ఇరాన్‌ పునర్నిర్మాణానికి ప్రయివేటు నిధి
9తాత్కాలిక ఒప్పందం ప్రకారం…యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్‌ పునర్మిర్మాణం కోసం 300 బిలియన్‌ డాలర్లతో ఓ ప్రైవేటు నిధిని ఏర్పాటు చేస్తారు. ఇందులో సగానికి పైగా మొత్తానికి ఇప్పటికే హామీ లభించిందని విశ్వసనీయ వర్గాలు రాయిటర్స్‌ వార్తా సంస్థకు తెలియజేశాయి. ఇరాన్‌ పునర్నిర్మాణ ప్యాకేజీలో పూర్తిగా ప్రైవేటు రంగానికి చెందిన నిధులే ఉంటాయి. ప్రభుత్వ సొమ్ము కానీ, గ్రాంట్లు కానీ ఉండవు. అమెరికా, గల్ఫ్‌ అరబ్‌ దేశాలు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా కంపెనీలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చాయి. ఇంధనం, లాజిస్టిక్‌, తయారీ, రవాణా రంగాలకు చెందిన కంపెనీల నుంచి హామీ లభించింది. యుద్ధం వలన జరిగిన నష్టానికి 400 బిలియన్‌ డాలర్ల పరిహారం అందజేయాలని అమెరికాను ఇరాన్‌ కోరింది. అయితే అందుకు అమెరికా నిరాకరించింది. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణం-అభివృద్ధి పేరిట నిధిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రాంతీయ దేశాలు వివిధ మార్గాలు…అంటే భద్రతా రుణాలు ఇవ్వడం, యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి నేరుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా దీనికి సాయం అందజేస్తాయి. మొబారక్‌ స్టీల్‌ కాంప్లెక్స్‌, రిఫైనరీలు, విమానాశ్రయాలు వంటి వాటికి ఆయా ప్రైవేటు కంపెనీలు ఆర్థికంగా చేయూత ఇస్తాయి. కాగా తుది ఒప్పందం కుదిరే వరకూ ఈ నిధి అమలులోకి రాదు. ఇరాన్‌ పునర్నిర్మాణం, అభివృద్ధికి సాయపడతామని దక్షిణ కొరియా, జపాన్‌, సింగపూర్‌, మలేసియా, అమెరికా కంపెనీలు కూడా హామీ ఇచ్చాయని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -