1.621 శాతం పెంచుతూ
సర్కార్ నిర్ణయం
70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం
ప్రభుత్వంపై నెలకు రూ.9.35 కోట్ల భారం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యుత్ శాఖ పరిధిలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతీ సంవత్సరం ఇచ్చే కరువు భత్యం (డీఏ)1.621 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని విద్యుత్ సౌధ జెన్ కో ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం జరిగిన ఇంధన శాఖ అధికారల సమావేశం పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలుల్లోకి రానుంది. దీంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651 శాతం నుంచి 19.272 శాతానికి చేరింది. విద్యుత్ రంగ సంస్థల్లో పని చేస్తున్న 70,804 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారు. అయితే ప్రభుత్వంపై నెలకు దాదాపు రూ. 9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. మార్కెట్లో ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
విద్యుత్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలి
డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రాబోయో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యుత్ అధికారులు సన్నద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం విద్యుత్ సౌధలో విద్యుత్ రంగ సమస్యలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్ కోలు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సంసిద్ధంగా ఉండాలని అధికారులకు సూంచించారు. క్షేత్రస్థాయి అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, తక్షణమే రంగంలోకి దిగి లోపాలను సరిచేయాలన్నారు. రానున్న పదేండ్లను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగ సంస్థల్లో మౌలిక సదుపాయాల కోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై ఆయన అధికారులుకు పలు సూచనలు చేశారు. ఈ ఏడాది మార్చి 27న పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు చేరిందన్నారు. అయినా సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో సిబ్బంది పని చేశారని భట్టి తెలిపారు. రాష్ట్రంలో 2035-36 నాటికి పీక్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పారు. ఈ ఏడాది నమోదైన పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు దాదాపు రెట్టింపుగా ఉంటుందని అన్నారు. 2035-36 నాటికి వార్షిక విద్యుత్ అవసరాలు 1,52,626 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయన్నారు. విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పని చేయాని సూచించారు. సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్ కో సీఎండీ హరీష్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్, ట్రాన్స్మిషన్ డైరెక్టర్ సంపత్ కుమార్, ట్రాన్స్ కో ప్రాజెక్ట్స్ డైరెక్టర్ లతా వినోద్ ఇతర విద్యుత్ సంస్థల అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



