12 మంది బీడీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులపై వేటు
పోలీసులకు ప్రిన్సిపాల్ ఫిర్యాదు
సుల్తాన్‌బజార్ పోలీస్టేషన్‌లో కేసు
వతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని దంత వైద్య కళాశాల హాస్టల్‌లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. 12 మంది బీడీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులపై కళాశాల యాజమాన్యం ఆరు నెలల సస్పెన్షన్ విధించింది. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సర్జీత్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీసులు తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటన వివరాలను వెల్లడించారు. ఆరు నెలలుగా డెంటల్ హాస్టల్‌లో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం బీడీఎస్ విద్యార్థులను ర్యాగింగ్‌కు గురిచేస్తున్నట్టు తెలిపారు. జూనియర్లతో వ్యక్తిగత పనులు చేయించడం, శిక్షల పేరుతో వేధించడం వంటి చర్యలకు పాల్పడినట్టు విచారణలో తేలిందన్నారు. ఇన్ని రోజులుగా ర్యాగింగ్ జరుగుతున్నా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ర్యాగింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ హౌస్ సర్జన్‌పై సీనియర్ విద్యార్థులు దాడి చేయడంతో విషయం బయటకు వచ్చిందని డీసీపీ తెలిపారు. అనంతరం కళాశాల యాజమాన్యం అంతర్గత విచారణ నిర్వహించి బాధ్యులైన 12 మంది విద్యార్థులను ఆరు నెలలపాటు సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. ర్యాగింగ్ చట్టరీత్యా తీవ్రమైన నేరమని చెప్పారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే జైలు శిక్షతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకున్న వెంటనే కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులను కోరారు.
ఉస్మానియాలో ర్యాగింగ్‌కు తావు లేదు :
ప్రిన్సిపాల్ డాక్టర్ నర్జీవ్ సింగ్ యాదవ్
ఉస్మానియా దంత వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రిన్సిపాల్ డాక్టర్ సర్జీత్ సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీనియర్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులను కిందకు పంపించి స్విగ్గీ ఆర్డర్లు తీసుకురావడం, కూలర్లలో నీళ్లు నింపించడం, గోడ కుర్చీ వేయించడం వంటి వేధింపులకు పాల్పడినట్టు గుర్తించామని తెలిపారు. ఈ విషయమై ముందుగానే సంబంధిత విద్యార్థులను హెచ్చరించినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడంతో పాటు తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి జరిగిన విషయాన్ని వివరించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ర్యాగింగ్ కారణంగా అనేక మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కొన్నిసార్లు ప్రాణం కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత, ప్రశాంతమైన విద్యా వాతావరణాన్ని కాపాడేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
ఉస్మానియా దంత వైద్య కళాశాలలో ర్యాగింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



