Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాయదుర్గం భూమి మాదే

రాయదుర్గం భూమి మాదే

- Advertisement -

హైకోర్టులో ఎస్‌బీఐ పిటిషన్‌
​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాయదుర్గం పన్మక్త గ్రామంలోని సర్వే నెం.83/1లో 5 ఎకరాల భూమి తమదేనని స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌‌బీఐ) పేర్కొంది. వేలం, విక్రయాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. సదరు భూమిని 2010లో అప్పటి ఎస్‌బీహెచ్‌కు ప్రభుత్వం కేటాయించిందనీ, ఇందుకోసం రూ.13.33 కోట్లు బ్యాంక్‌ చెల్లించిందని కోర్టుకు తెలిపింది. భూకేటాయింపు రద్దుపై ఇప్పటికే న్యాయపోరాటం కొనసాగుతోందనీ, తమ వివరణపై నిర్ణయం తీసుకోకముందే టీజీఐఐసీ వేలం నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొంది. వేలం ద్వారా జరిగిన విక్రయాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని కోరగా, పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది.

రేవంత్‌రెడ్డి పిటిషన్‌లపై తీర్పు రిజర్వ్‌
​హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా నమోదైన ఐదు క్రిమినల్‌ కేసులను కొట్టేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఎన్నికల ప్రచారంలో అనుమతి లేకుండా రోడ్‌షో నిర్వహించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, సమావేశాల్లో శబ్ద కాలుష్యం కలిగించారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. జస్టిస్‌ కె.సుజన వాదనలు పూర్తిచేసి తీర్పును రిజర్వ్‌ చేశారు.

తెలుగు విద్యార్థి కేసులో కేంద్రానికి నోటీసులు
​ఫిన్‌లాండ్‌లో చదువుతున్న తెలంగాణ విద్యార్థి మణిదీప్‌ అదృశ్యమైన ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ఫిన్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మే 6 నుంచి కుమారుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఆరు దశాబ్దాల జాప్యాన్ని సమర్థించలేం: హైకోర్టు
​రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నెం.22లోని 3.14 ఎకరాల భూమిపై హక్కులు కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. 1950లో తమ పూర్వీకులకు పట్టా మంజూరైందని పిటిషనర్లు వాదించినప్పటికీ, ఆ హక్కుల కోసం ఆరు దశాబ్దాలపాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. 2019లో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మినారాయణ, అసాధారణ జాప్యానికి సహేతుకమైన కారణాలు చూపలేదని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వ భూములపై హక్కులు కోరలేరని ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను తిరస్కరించారు.

పాఠశాలకు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించండి : 
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
​సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ బాలికల పాఠశాల తరలింపుకు అనువైన ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాఠశాలను ఆర్యవాటిక ప్రభుత్వ పాఠశాలకు మార్చాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. ప్రతిపాదిత స్థలం 3.7 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

తెలంగాణ వారికే న్యాయమూర్తుల పదవులివ్వాలి : 
హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిరసన
​తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో స్థానిక మూలాలున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలీజియం తెలంగాణకు చెందిన అభ్యర్థులను మాత్రమే సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, సీనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -