Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిలువెల్లా నిర్లక్ష్యం

నిలువెల్లా నిర్లక్ష్యం

- Advertisement -

కరెంటు షాక్‌‌లతో పిట్టల్లా రాలుతున్న జనం
పట్టించుకోని ప్రభుత్వం
‘తొలకరి’కే ఛిద్రమైన విద్యుత్‌ ‌సరఫరా వ్యవస్థ
డిస్కంల తప్పిదాలను ప్రకృతిపైకి నెట్టేసే యత్నం

ఎస్ఎస్ఆర్ శాస్ర్తి
కారు మీద విరిగిపడిన చెట్ల కొమ్మల్ని తొలగిద్దామని వెళ్లి అల్వాల్‌‌లో తండ్రి సందీప్‌ (44), కుమార్తె రితిక (16) కరెంటు షాక్‌ ‌కొట్టి చనిపోయారు. వారు విరిగింది చెట్ల కొమ్మలే అనుకున్నారు. కానీ వాటితో పాటు వీధిలోని కరెంటు లైన్‌ ‌వైర్లు కూడా తెగిపడ్డాయి. సహజంగా విద్యుత్‌ వైర్లు తెగగానే సప్లయ్‌ ‌దగ్గర ఫ్యూజ్‌ ఎగిరిపోయి, పవర్‌ ‌కట్‌ ‌కావాలి. కానీ అలా జరగలేదు. బండ్లగూడలో చిన్న వర్షానికి కరెంటు లైన్‌ ‌వైర్లు తెగి నీళ్లలో పడ్డాయి. ఆటోలో వెళ్తున్న డ్రైవర్‌ ‌జాఫర్‌ (30), విద్యార్థి అబూ (15) షాక్‌ ‌కొట్టి అక్కడికక్కడే రోడ్డుపై చనిపోయారు. ఇక్కడా వైర్లు తెగగానే ఫ్యూజ్‌‌లు పోయి విద్యుత్‌ ‌సరఫరా ఆగిపోలేదు. తాజాగా అల్వాల్‌‌లో కే సూర్యనారాయణ (40) అనే కూలీ చెట్ల కొమ్మలు కొడుతూ కరెంటుషాక్‌ ‌కొట్టి కిందపడి మరణించాడు. రాష్ర్ట రాజధాని ‌హైదరాబాద్‌లో కేవలం పదిరోజుల్లో కరెంట్‌‌షాక్‌తో ఐదు నిండుప్రాణాలు పోయాయి. ఈ ఘటనలు, మరణాలకు బాధ్యులు ఎవరు? ఏ ఒక్క అధికారికానీ, ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ బాధ్యత స్వీకరించలేదు. పైపెచ్చు ‘కరెంట్‌‌షాక్‌ ‌కొట్టి ఛస్తే మీ ఖర్మ…మాకేం సంబంధం లేదు’ అన్నట్టే విద్యుత్‌ ‌పంపిణీ సంస్థల (డిస్కంలు) అధికారులు వ్యవహరించారు. ఘటనలు జరిగాక వారు పత్రికా కార్యాలయాకు పంపిన ప్రకటనల్లో పొరపాటు జరిగిందనీ, దానికి చింతిస్తున్నామని లేదు.

కేవలం ఆ మరణాలకు, తమకు ఎలాంటి సంబంధం లేదనీ, ప్రజలే అప్రమత్తంగా ఉండాలనే శ్రీరంగ నీతులు రాసుకొచ్చారు. ఈ దుర్ఘటనలపై విద్యుత్‌ శాఖ మంత్రి స్పందించలేదు. మృతుల కుటుంబాలను పరామర్శించలేదు. వారికి కనీస భరోసా ఇచ్చే ఏ ఒక్క చర్య చేపట్టలేదు. పోస్టుమార్టం చేసేసే హడావిడిగా అంత్యక్రియలు మాత్రం కానిచ్చేశారు. ఈ ఘటనలు రాష్ర్ట ప్రభుత్వం ప్రజలకు కల్పించే భద్రత, భరోసాను ప్రశ్నిస్తున్నాయి. సచివాలయంలో మంత్రులందరితో కలిసి సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మెట్రోరైల్‌‌పై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రతిపక్ష‍ాలపై రాజకీయ విమర్శలు చేశారు. కరెంట్‌ ‌షాక్‌‌ కొట్టి రోడ్లపై పిట్టల్లా మరణించిన ప్రజల గురించి మాత్రం కనీసం స్పందించలేదు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అనేదే ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ. మనుషుల ప్రాణాలకే విలువ ఇవ్వని విద్యుత్‌ ‌పంపిణీ సంస్థలు ఇక వందల సంఖ్యలో మరణిస్తున్న పశు మరణాలను పరిగణనలోకి తీసుకుంటాయా అంటే సందేహమే. గడచిన మూడేండ్లలో రాష్ర్టంలో జరిగిన ఈ తరహా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో ఏం జరిగిందో…ఇప్పుడూ అదే పునరావృతం అయ్యింది. ‘వ్యవస్థ అన్న తర్వాత ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం’ అనే ధోరణినే డిస్కంలు, ప్రభుత్వం అవలంబిస్తున్నాయి.

రాష్ర్టంలో ఏటా వందల సంఖ్యలో కరెంట్‌‌షాక్‌‌తో మనుషులు, ఫశువులు మరణిస్తున్నాయి. వీటి నియంత్రణకు ప్రభుత్వం, డిస్కంలు తీసుకుంటున్న చర్యలు దాదాపు శూన్యమనే చెప్పాలి. గ్రామాల్లో కరెంట్‌‌షాక్‌ ‌కొట్టి ఎవరైనా మరణిస్తే, డిపార్టుమెంట్‌ ‌పొరపాటు వల్లఈ ఘటన జరిగింది అని అంగీకరించే పరిస్థితులే లేవు. ఎంతో కొంత ఇచ్చేసి, తమ తప్పిదాలు బయటపడకుండా ప్రయివేటుగా రాజీ కుదుర్చుకుంటున్న సంఘటనలూ ఉంటున్నాయి. కేవలం తొలకరి చిరుజల్లులకే రాజధానిలో ఇలాంటి దుర్మరణాలు సంభవించడం ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపుతున్నాయి. రాష్ర్టంలో ఏటా సగటున 600 మందికి పైగా విద్యుద్ఘాతాలకు గురై మరణిస్తున్నారు. ఈ గణాంకాలు డిస్కంలు చెప్తున్నవే. ప్రాణాలు పోతున్న పశువుల సంఖ్య కూడా వందల్లోనే ఉంది. గడచిన రెండున్నరేండ్లలో (సెప్టెంబర్‌ ‌వరకు) రెండు డిస్కంల పరిధిలో దాదాపు 1420 మందికి పైగా మరణించారు. దాదాపు రెండువేలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. విద్యుత్‌ ‌మరణాలను సుమోటోటా స్వీకరించి విచారణ చేయాల్సిన తెలంగాణ విద్యుత్‌ ‌నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) ఆపని చేయట్లేదు. అడపాదడపా మానవహక్కుల న్యాయస్థానాలే సుమోటోగా స్వీకరిస్తున్నాయి. అయితే ఎక్కడా ఏ న్యాయస్థానంలోనూ ఈ మరణాలకు అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ శిక్ష‍లు విధించిన దాఖలాలే లేవు.

ప్రజల్లోని ఎమోషన్స్‌ను తాత్కాలికంగా తగ్గించే చర్యలుగానే ఈ కేసుల విచారణలు జరుగుతున్నాయి. కరెంట్‌‌షాక్‌ ‌మరణాలపై గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ సర్వే నిర్వహించి, నివేదికను టీజీఈఆర్సీకి సమర్పించింది. దానిపై కనీస అధ్యయనం కూడా జరగలేదు. కేవలం మృతులకు ఇచ్చే ఎక్స్‌‌గ్రేషియాను రూ.5 లక్ష‍ల నుంచి రూ.8 లక్ష‍లకు పెంచడం మాత్రమే జరిగింది. ఆ సర్వే ఉత్తర డిస్కం (టీజీఎన్పీడీసీఎల్‌) ‌పరిధిలోని మరణాలను విశ్లేషించింది. 82 కేసుల్లో బాధితులపై విద్యుత్‌ ‌సరఫరా అవుతున్న వైర్లు పడటం వల్ల జరిగాయి. 52 కేసులు వ్యవసాయ మోటార్లు, సర్వీస్‌ ‌వైర్లను రిపేరు చేసేటప్పుడు మరణాలు సంభవించాయి. మరో 14 కేసులు ట్రాన్స్‌‌పార్మర్ల వద్ద బాధితులు ఫ్యూజులు మార్చే క్రమంలో జరిగాయి. 10కేసులు కండక్టర్లు షాక్‌ ‌కొట్టడం వల్ల సంభవించాయి. 120 కేసుల్లో ఇండ్లలో సరైన కరెంటు వైరింగ్‌ ‌లేని కారణంగా మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ఇన్ని సమస్యల మధ్య రాష్ర్టంలోని విద్యుత్‌ ‌వ్యవస్థ ఉన్నది. వీటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నది.

వికలాంగులుగా చిన్నారులు
విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన వారికంటే ప్రమాదాల్లో గాయపడ్డవారి బాధలు వర్ణనాతీతం. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సరైన వైద్యం అందక శాశ్వత అంగవైకల్యం ఏర్పడుతుంది. ఇలాంటి బాధితుల్లో ఎక్కువ శాతం చిన్న పిల్లలు వుంటున్నారు. చేతులు, కాళ్లు కోల్పోయి జీవచ్ఛవాలుగా మారుతున్నారు. ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభ ఎవ్వరూ తీర్చలేనిది. విద్యుత్ ప్రమాదాలకు భాద్యుల మీద చర్యలు తీసుకుంటేనే, వ్యవస్థలో లోపాలు బహిర్గతమవుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఇందులో కూడా పెద్ద సమస్య ఉంది. అంత్యక్రియల వరకు ఎంతోకొంత బాధిత కుటుంబాలకు ఇచ్చేసి, ఆ తర్వాత సదరు వ్యక్తులు, పశువులు కరెంటు షాక్ వలన చనిపోలేదనీ, ఒకవేళ చనిపోయినా అది ప్రయివేటు వ్యవహారమని అధికారులు రికార్డుల్లో రాసేస్తున్న సంఘటనలు అనేకం ఉంటున్నాయి. ‘మా కరెంటు వైర్లు తెగితే, దాని కింద మనుషులు ఉండటం వారి తప్పే’ అనే పద్ధతిలో విద్యుత్‌ శాఖ వ్యవహరం ఉంటోందనే విమర్శలు ఎక్కువగా వినిపిప్తున్నాయి. అధికారులు ఈ తరహాలో రిపోర్టులు రాయడం వల్ల బాధిత కుటుంబాలకు కనీసం నష్టపరిహారం కూడా అందకుండా పోతుండటం గమనార్హం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -