పోలీస్ శాఖలో 20వేల పోస్టులకు నోటిఫికేషన్స్ వెయ్యాలి
డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్
నిరుద్యోగుల అక్రమ అరెస్టులకు ఖండన
ఎస్వీకే వద్ద నిరసన ర్యాలీ
నవతెలంగాణ – ముషీరాబాద్
ఉద్యోగాలు అడిగితే నిర్బంధం ప్రయోగించడం సరికాదని, తక్షణం రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగులపై పోలీసుల నిర్బంధాలను ఖండిస్తూ బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు గత ప్రభుత్వ నోటిఫికేషన్లతో కలిపి 55 వేల ఉద్యోగాలే భర్తీ చేశారని తెలిపారు. ఇంకా 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కావడం లేదని, స్పష్టమైన ఉద్యోగ ప్రణాళిక లేకపోవడంతో నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశ నెలకొందని తెలిపారు.
వెంటనే స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేయడంతోపాటు అన్ని శాఖల్లోనూ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో 20 వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గత, ప్రస్తుత డీజీపీలు పలుమార్లు ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టుల భర్తీకే పరిమితమవుతోందని అన్నారు. నాలుగేండ్లుగా పోలీసు నియామకాలు లేకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ ఎదురుచూస్తున్నారని అన్నారు. దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వం అరెస్టులపై చూపుతున్న శ్రద్ధను ఉద్యోగాల భర్తీపై చూపాలని, తక్షణమే పోలీసు శాఖతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల తరఫున డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావీద్, గడ్డం వెంకటేష్, కృష్ణానాయక్, మల్లం మహేష్, నవీన్, జి. కార్తీక్, పి. జగన్, ఎం.కిరణ్, నాయకులు ఎన్. మధు, నరేష్ పటేల్, శివశంకర్, రాఘవేంద్ర, సాగర్, దామెర హస్మీ, అరవింద్, అనిల్, శ్రీనివాస్, జంగయ్య, జి.మహేష్, అంజనేయులు, దేవేందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.



