నోటిఫికేషన్ లేకుండా సిబ్బంది నియామకం.!
పాత టెండర్ రూ.20 లక్షలు బకాయిలు అంతేనా.!
నవతెలంగాణ-అచ్చంపేట
శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన అచ్చంపేట మండల పరిధిలోని ఉమామహేశ్వరం దేవస్థానంలో అంతా గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం పేపర్ లో టెండర్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి సిబ్బందిని నియమించుకోవలసి ఉంటుంది. కానీ పాలకవర్గం, అధికారులు ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించుకుంటున్నారని ఆరోపణలు బహిర్గతంగా వినిపిస్తున్నాయి. దేవాలయంలో రెగ్యులర్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు.? ఔట్సోర్సింగ్ విధానంపై ఎంతమంది ఏఏ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ప్రతినెల సిబ్బంది వేతనాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో వివరాలు వెల్లడించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పవిత్రమైన ఉమామహేశ్వర దేవస్థానంలో అవినీతికి తావు లేకుండా భక్తులకు వసతులు, సౌకర్యాలు, దేవాలయం అభివృద్ధికి భక్తులు ఇస్తున్న నిధులు ఖర్చు చేయాలని ప్రజలు, భక్తులు సూచిస్తున్నారు.
గతంలో కొబ్బెర కాయల వేలం పాట పాడిన వ్యక్తి నుంచి రూ.20 లక్షల బకాయిలు వసూలు చేయడంలో పాలకవర్గం, దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఉమామహేశ్వరం దేవస్థానంలో రోజువారీగా వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా లెక్కలు రిజిస్టర్ లలో నమోదు చేస్తున్నారనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి.
ఉమామహేశ్వరం దేవస్థానం నుంచి రెండు బస్సులను కొనుగోలు చేసినట్లు కార్యనిర్వహణ కార్యదర్శి ఈవో శ్రీనివాసరావు చెపుతున్నారు. కానీ ఆ బస్సులు పర్వతాలు అనే వ్యక్తిపై ఆర్టిఓ శాఖలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ప్రతినెల దేవాలయం నుంచి ఫైనాన్స్ వారికి ఇఎంఐ చెల్లిస్తున్నారు. దీనికి ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. దేవస్థానంలో భక్తులను కొండపైకి తీసుకుపోవలసిన బస్సులు హైదరాబాదులో ఎందుకు తిరుగుతున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. బస్సుల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని, ఒక వ్యక్తి హైదరాబాదులోని కమిషనర్, దేవాదాయ శాఖకు, సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఉమామహేశ్వరంలో జరుగుతున్న గందరగోళ పరిస్థితుల గురించి ఏ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొందని కొందరి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పేరు, ఫోన్ నెంబరు ఉమామహేశ్వరం ప్రాంగణంలో రాసి పెట్టాలని కొందరు భక్తులు కోరుతున్నారు.



