Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రజాసమస్యలపై కలిసి పనిచేద్దాం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ

ప్రజాసమస్యలపై కలిసి పనిచేద్దాం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ

- Advertisement -
  • ఎంబీ భవన్‌‌లో సీపీఐ(ఎం) నేతలతో మాజీ మావోయిస్టుల భేటీ

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజాసమస్యలపై కలిసి పనిచేద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ అన్నారు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. సమస్యలపై జరిగే పోరాటాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ(మాకినేని బసవపునయ్య) భవన్‌‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీతోపాటు ఆ పార్టీ ప్రతినిధులతో మాజీ మావోయిస్టులు దేవ్‌‌జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక్క, సంజీవ్‌, బండి ప్రకాశ్‌ భేటీ అయ్యారు.

తాజా రాజకీయ పరిణామాల గురించి సుమారు రెండు గంటలకుపైగా చర్చించారు. అనంతరం మీడియాతో జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. దేశంలో మావోయిస్టులను ఏరివేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌‌ను నిరంకుశంగా చేపట్టిందని విమర్శించారు. నరమేధాన్ని కొనసాగించిందని చెప్పారు. సీపీఐ(ఎం), ఇతర వామపక్ష‍ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారని అన్నారు.

మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చిన వారు ప్రజాఉద్యమాల్లో నిలబడి ముందుకు రావాలని కోరారు. వారి మీద ఉండే ఆంక్ష‍లను ఎత్తేయాలని సూచించారు. ఇంకా మిగిలిపోయిన మావోయిస్టులపై నిర్బంధాన్ని కొనసాగించొద్దని డిమాండ్‌ ‌చేశారు. సామరస్యంగా సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలు పెరుగుతున్నాయనీ, పెట్టుబడిదారులు పెద్దఎత్తున దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వాటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ముందుకొస్తున్నాయని చెప్పారు.

సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, మతోన్మాదానికి, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కలిసొచ్చే వారిని సీపీఐ(ఎం) ఆహ్వానిస్తుందని చెప్పారు. ఆపరేషన్‌ ‌కగార్‌ ‌సందర్భంగా వామపక్ష‍ాలు, కాంగ్రెస్‌, ప్రజాస్వామికవాదులు ఆ నిర్బంధాన్ని వ్యతిరేకించాయని గుర్తు చేశారు. ఆ పార్టీలను కలవడంలో భాగంగానే వారు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేద్దామని అన్నారు. ఇందులో రాజకీయ అంశాలకు ప్రాధాన్యత లేదని వివరించారు.

మర్యాదపూర్వకంగానే కలిశాం : దేవ్‌‌జీ

ఆపరేషన్‌ కగార్‌‌ను ఆపా‌లనీ, కర్రెగుట్టలో నిర్బంధం తొలగించాలనీ, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని వామపక్ష‍ పార్టీలు, శాంతి చర్చల కమిటీ, ప్రజాసంఘాలు కోరాయని మాజీ మావోయిస్టు దేవ్‌‌జీ అన్నారు. పలు ఉద్యమాలను కూడా నడిపారని వివరించారు. తాము ప్రజా జీవితంలోకి వచ్చాక ఆపరేషన్‌ ‌కగార్‌‌ను ఆపాలన్న రాజకీయ పార్టీల నాయకులను అందరినీ కలవాలనే కార్యక్రమం తీసుకున్నామని చెప్పారు. ఇటీవల సీపీఐ కార్యాలయానికి వెళ్లామనీ, ఇప్పుడు సీపీఐ(ఎం) కార్యాలయానికి వచ్చామని అన్నారు. రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే రాజకీయ పార్టీ స్థాపించడం గురించి మాట్లాడ్డం ఇది సందర్భం కాదన్నారు. ఏ పార్టీలో చేరడం లేదనీ. ఈ విషయాలు చర్చించుకోవడానికి ఇది సరైన సందర్భం కాదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌‌రావు, టి సాగర్‌, ఎండీ అబ్బాస్‌, సీనియర్‌ ‌నాయకులు జి రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ ‌శ్రీరాం నాయక్‌, టి స్కైలాబ్‌‌బాబు, మల్లు నాగార్జునరెడ్డి, పి ఆశయ్య, ఉడుత రవీందర్‌, నాయకులు ధర్మానాయక్‌, కోట రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -