నేటి “మన” పాలకుల దృష్టిలో మనుషుల ప్రాణా లకు, దేశ సంపదకు విలువ లేదు. ఎన్ని ప్రాణాలు పోయినా, ఎన్ని కోట్ల జనసంపద కూలి పోయినా ఖాతరు చేయరు. ప్రమాదాల, విపత్తుల సందర్భాలలో మానవత్వం లేని పక్షపాత రాజకీయ ప్రకటనలు చేస్తారు. ఈ ప్రకటనలలో ఓటు బ్యాంకుల నిలువరింపు, కొత్త ఓట్లను పొందే ప్రయత్నం తప్ప మనిషితత్వం ఉండదు. నిజాయితీతో, నిబద్దతతో, పేదల కోసం, శ్రామికుల కోసం జీవితాలను అర్పించిన వామపక్షీయులను అర్థంచేసుకోలేని, ఓడరేవులు సముద్ర తీరాన ఉంటాయని తెలియని, వారసత్వ వీర యువ “నాయకులు” నేటి ప్రజా సంక్షేమ పరికల్పకులు. అధికారం కోసం రాజకీయ రంగులు మార్చిన ఆధునిక మతతాత్విక మాటల వీరులకు సొంత గుత్తేదారులు ఉంటారు. వారితో వారం లోపే చీలి గుంటలు పడని రోడ్లను వేయించుకోలేరు. కడుతుండగానే కూలని వంతె నలను నిర్మించుకోలేరు. రోడ్లలో నడుములు విరిగి, బండ్లు వాటుపడి కాళ్లుచేతులు విరగ్గొట్టుకునే, ప్రాణాలు పోగొట్టుకునే కడగొట్టు మనుషులు వీళ్ళ సంపన్నులు కాదు కదా? ఆ సంపద నష్టం లోనే వీళ్ల ప్రయోజనాలు ఉన్నాయి. వీళ్లు తిరగటానికి హెలికాప్టర్లు ఉన్నాయి. ఎన్నికల రోడ్ షోలలో నేలపై తిరగవలసి వస్తే స్పీడ్ బ్రేకర్లను కూడా తీయించు కుంటారు. వాళ్లు పోగానే ఈ స్పీడ్ బ్రేకర్లను మరలా అశాస్త్రీయంగానే అడ్డుకడతారు. స్పీడ్ బ్రేకర్ల నిర్మాణంలో సాంకేతిక మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, స్పీడ్ బ్రేకర్లు వాహనాలకు నష్టాన్ని, మనుషులకు భౌతిక/మూగ శరీర గాయాలను చేయరాదని కోర్టులు పలుమార్లు ఆదేశించాయి.
స్పీడ్ బ్రేకర్లను అధికారులే కాదు, అపార్టుమెంట్ల ముందర ఎవరు పడితే వారు వేసు కుంటారు. వీరికి స్పీడ్ బ్రేకర్ల నిర్మాణ నియమాలు తెలియవు. అధికారులు పట్టించుకోరు. పట్టించు కుంటే మామూళ్లు తగ్గు తాయి. అతి వేగంగా దూసుకుపోయే వాసి తక్కువ ప్రైవేటు వాహనాలు, మోటరు సైకిళ్లు, తామే అమ్మిస్తున్న తమ గుత్తేదారుల (తమ పార్టీ వాళ్ల) సారా తాగి నడిపి బసులను కూల్చి వందల ప్రాణాలు తీసే డ్రైవర్ల తప్పులు తమ వాళ్లయిన బసుల యజమానుల పాపాలే. రోడ్లను ఆక్రమిం చిన, వాటిపై అడ్డంకులు కల్పించిన మామూళ్ల వాళ్లూ సర్కారు “సేవకులే”.
ప్రైవేటు పరిశ్రమలలో యంత్రాలు పాతవి. చెడిపోయినవాటిని బాగు చేయించకుండా నడుపుతుంటారు. ప్రమాద నిరోధక పద్దతులు, శ్రామిక భద్రత ఏర్పాట్లు ఉండవు. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో పాలక జోస్యం, స్వీయ సౌజన్య పక్షపాత (పాలకులు చెప్పినట్లు చేసే) అధికారుల నియామకాలు నిత్యసత్యాలు. వీళ్లు పాలకుల, తమ సొంత ఆర్థిక ప్రయోజ నాలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆ ప్రభుత్వ రంగ సంస్థ మునిగినా వీరికి లెక్కలేదు. కార్మికుల జీతభత్యాలు, సౌకర్యాలు, పని పరిస్థితులు, బాగోగుల గురించి పట్టించుకోరు. ఈ పరిశ్రమ లను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మి సొమ్ముచేసుకునే ప్రభుత్వ జాతీయ సంపద ద్రవ్యీకరణ విధానంలో అమ్మడానికి అనుకూ లించే సంపదవృద్ధి మౌలిక సౌకర్యాలను కల్పిస్తారు. ప్రమాద నిరోధక చర్యలను, సిబ్బంది భద్రతను పట్టించుకోరు. ఫలితంగా ప్రైవేటు పరిశ్రమలలో శ్రామికుల చావులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ఆస్తి ప్రాణ నష్టాలు రెండూ తప్పవు.
‘స్వయంభువు శంకరుడు’ నేటి “మన” ప్రభుత్వ నేత. ఈయనకు కొందరు హతులే కనబడతారు. తన పాత్ర గల మనుష్య హననా లలో సహజంగానే హతులు మనుషులుగా కనిపించరు. అందుకే 2002 గుజరాత్, 2013 ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్, బీహార్ లోని ముజఫర్ పుర్, ఢిల్లీలోని ద్వారకానగర్ లలో “ఇతరుల (ముస్లింల)”పై జరిగిన వందల సామూహిక లైంగికదాడులు , దారుణ మారణ కాండలలో వేల మరణాలు ఆయనకు కారు కింద పడే కుక్కల చావులు. ఈయన సర్కార్ అశ్రద్ధ వల్ల 2015 మణిపుర్ ఆకస్మిక దాడిలో 18 మంది, తానే కావాలని కల్పించిన జమ్ము కశ్మీర్ లోని 2016 ఉరి దాడిలో 19 మంది, 2016 పఠాన్ కోట దాడిలో ఏడుగురు, 14 ఫిబ్రవరి 2019 పుల్వమా ఉగ్రదాడిలో నలభై మంది భారత సైనికులు మరణించారు. పుల్వమా ఘోరకలి ఆ యేటి ఎన్నికల్లో ఆయన్ను గెలిపించింది. 2018 సుంజువాన్ దాడిలో చనిపోయిన సైనికుల సంఖ్యను బయట పెట్టలేదు. 22 ఏప్రిల్2025న పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోయారు. అందులో ఒక క్రైస్తవ పర్యాటకుడు, పలువురిని కాపాడిన ఒక స్థానిక ముస్లిం ఉన్నారు. ఎక్కడా గుర్తుకురాని సింధూర్ ఇక్కడే గుర్తుకు వచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తోందని ప్రధాని, రక్షణ మంత్రితో పాటు సైనిక ప్రధాన అధికారి కూడా అంటున్నారు. పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామం టున్నారు. ఒక దేశం ఎంత యుద్ధ వినాశ నానికి గురయినా శిధిలదేశంగా మారవచ్చు. భౌగోళికంగా మాయ మవదు.
ఇలాంటి అర్థరహిత అవా క్కులను రాజకీయ లబ్ధి కోసం పాలకులు అంటే వారికి సైన్యాధికారులు వంతపాడి పాకిస్తాన్ పాలకుల, సైనిక ముఖ్యుల కోప స్పందనలను కొనితెచ్చు కోవాలా? మన దేశ సరిహద్దుల్లో చిరిగిన సైనిక గుడారాలు, నాసి రకం హెల్మెట్లు, బూట్లు, సైనిక, వాహనాల భద్రతా రాహిత్యంవల్ల వందల సంఖ్యలో సైనికులు చనిపో యారు. తాత్కాలిక సైనికులు అగ్నివీర్ లు అసమగ్ర శిక్షణతో ఎక్కువగా అమర వీరుల వుతున్నారు. వీరి మరణానంతర సౌకర్యా లలోనూ తేడాలున్నాయి. కూలుతున్న సైనిక విమానాలలో రాలుతున్న వైమానిక వీరులెం దరో? ప్రభుత్వ హత్యలను అరికట్ట డానికి ఘనత వహించిన మన విశ్వగురువులు ఆలోచించరు. హతుల పట్ల “మన” ప్రభుత్వ నేతల వివక్షను వివరించడానికే ఈ ప్రస్తావనలు. మన సైనికుల పట్ల, ప్రజల పట్ల ప్రేమ, గౌరవం లేక కాదు. వారి ప్రాణాల విలువ తెలియక కాదు. దేవుళ్ల సన్నిధిలో చనిపోతున్నవారు, వ్యయ మయిన వ్యవసాయంతో బతకలేక బతుకులు చాలిస్తున్న రైతులు, వీధుల్లోనే కాక నక్షత్రాల హోటళ్లలోనూ వడ్డిస్తున్న క్యాన్సర్ ఉత్పాదక ఆహారాలతో అకాలంలో అంతమ వుతున్నవారు లెక్కలేనంత మంది. దేశమంతా వ్యాపించిన నారాయణ, ఇతర ప్రైవేటు సంస్థలలో విద్యార్థుల యాజమాన్య చావులు ఎక్కువ. ఇండ్లలో ఎవరి దృష్టికీరాని నమోదుకాని చావులెన్నో? మంత్రు లు, పార్లమెంటు సభ్యులు అయిన ఈ విద్యా సంస్థల అధిపతులు చేయించే చట్టాలు, చదువుల విధానాలు హంతకులకే అనుకూలం.
ఇన్ని జరిగినా, ప్రమాదరహిత మౌలిత సదుపాయాల వ్యవస్థల నిర్మాణం వైపు పాలకుల అడుగు పడదు. నష్టనివారణ కింద అరకొరగా పరిహారాలు ప్రకటిస్తారు. పరిహారాల ఖర్చును నిర్లక్ష్యాల కారకులయిన ప్రైవేటు యజ మానులు, పాలకులు, వారి రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు, గుత్తేదారులు భరించాలి. కాని ప్రభుత్వం భరిస్తుంది. అంటే ప్రజల మీదకు ఈ ఖర్చును తోస్తుంది. ఔదార్య పాలకులమన్న పేరుపొంది ప్రజాభిమానాన్ని చూరగొనే ప్రవచన ప్రచారాలు చేసుకుంటారు.ప్రభుత్వ అధినేత నుండి అయోధ్య పుణ్య నగరిలో అడుక్కుని బతికేవాని వరకు అందరూ భారతీయులే, సమాన ప్రజలే. వారందరి ప్రాణాలు సమానమే. అయినా ఎందుకు ఈ వివక్ష? అయోధ్యలో పోలీసులు భిక్షకులను నియంత్రిస్తారు. కేంద్రం అయోధ్య భిక్షకులను విచిత్ర క్లుప్తపద పథకం స్మైల్ (సపోర్ట్ ఫార్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫార్ లైవ్లిహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్)లో చేర్చింది. అయినా మోడీ ప్రతిష్టించిన బాలరాముడు వారిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. ఉద్ధరించడం లేదు. అందుకే ప్రభుత్వాలు హత్యలను ఆపడం లేదు.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 9490204545



