Thursday, June 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅబద్ధాలే వారి ఆయుధాలు

అబద్ధాలే వారి ఆయుధాలు

- Advertisement -

ఇటీవల ఒక వీడియోలో ముదిగొండ శివప్రసాద్ ‘‘తరాలుగా మనల్ని నమ్మించిన ఒక పెద్ద అబద్ధం’’ అంటూ కొన్ని విషయాలు చెప్పారు. దానిలో అనేక అబద్ధాలు చెప్పారు. వాటిని పరిశీలిద్దాం. మొదటి అబద్ధం: ఆ వీడియోలో శివప్రసాద్ ఆర్యులు, ద్రావిడుల రంగు భేదాలను గూర్చి వివరిస్తూ ‘‘రావణాసురుడు తెల్లటివాడు. మీరు రామాయణం చదివారుగా? రావణాసురుడు బ్రాహ్మణుడు. రామాయణంలో రాసుందిగా? తెల్లటి బ్రాహ్మణుడు రావణాసు రుడు’’ అని చెప్పారు. నేను గీతా ప్రెస్, గోరక్ పూర్ వారు ప్రచురిం చిన ‘వాల్మీకి రామా యణం’ అనే పౌరాణిక గాధను చదివాను. దానిలో రావణాసురుడు తెల్లటి వాడని ఎక్కడా లేదు. పైగా సుందరాకాండ, పదవ సర్గ, ఏడవ శ్లోకంలో హనుమంతుడు నిద్రపో తున్న రావణుడిని చూశాడనీ, రావణుడు “తస్మిన్ జీమూత సంకాశం’’ అనీ, అంటే ‘‘అతడు నల్లని మేఘం వలె ఉండెను’’ అనీ గీతా ప్రెస్ వారి అనువాదంలో స్పష్టంగా ఉన్నది. కాబట్టి రామాయణ గాధ ప్రకారం రావణుడు నల్లని వాడని తెలియడం లేదా?

ఆయన తెల్లని వాడు అనడం అబద్ధం కాదా?
ఇంతకీ శివప్రసాద్ అనేది ఏమిటంటే “తెల్లటి వాడు, బ్రాహ్మణుడు అయిన రావణుడు ఆర్యుడనీ, నల్లనివాడైన రాముడు ద్రావిడుడనీ అందువలన ద్రావిడులపై ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతం తప్పు’’ అనీ అంటారు. అసలు పౌరాణిక గాథల ప్రకారం చారిత్రక విషయాలను నిరూపిం చాలనుకోవడమే పెద్ద అసంబద్ధం. దాన్ని అబద్ధాలతో నిరూపిం చాలనుకోవడం మరింత అసంబద్ధం.
రెండవ అబద్ధం: ఆ వీడియోలోనే శివప్రసాద్ తమిళనాడు స్టాలిన్ ‘‘separate పాకిస్తాన్ కావాలని అడిగాడ’’ని అన్నారు. స్టాలిన్ ఎప్పుడూ, ఎక్కడా పాకిస్తాన్ లాగా ‘ప్రత్యేక తమిళనాడు దేశం’ కావాలని అడగలేదు. అడిగితే ఒక్క రుజువును చూపమని కోరుతున్నాను. ఆయన తమిళనాడుకు మరిన్ని నిధులు కావాలని మాత్రమే కోరాడు. మరో విషయం. ‘‘ఇప్పుడు తమిళనాడులో ఎవరైతే పొట్టి ముక్కువాళ్లు ఉన్నారో, వారు ఆఫ్రికా నుండి వచ్చారు’’ అనే విషయాన్ని, ప్రపంచంలోని చరిత్ర ప్రొఫెసర్లందరూ అంగీక రించిన విషయాన్ని శివప్రసాద్ అంగీకరించారు. కానీ, ‘‘ఆర్యులనేవాళ్లు ఎక్కడి వాళ్లోకాదు, వాళ్లు ఇక్కడి స్థానికులే’’ అనే మూడో అబద్ధాన్ని చెప్పారు. ఆర్యులు మధ్యాసియా నుంచి టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ల మీదుగా గుర్రాల మీద భారతదేశానికి వలస వచ్చారనే విషయాన్ని ప్రపంచంలోని చరిత్ర ప్రొఫెసర్లూ, archeology ప్రొఫెసర్లూ అందరూ అంగీకరించిన విషయాన్ని కాదని, వారు ఇక్కడి వారే అనేటటువంటి, చారిత్రకంగానూ, పురావస్తు పరిశోధనల్లోనూ ఎక్కడా రుజువు దొరకనటువంటి విషయాలను ప్రచారం చేయడం అబద్ధ ప్రచారంగాక మరేమవుతుంది?

ప్రొఫెసర్ రొమిల్లా థాపర్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన చరిత్ర ప్రొఫెసర్లలో ఒకరు. ‘‘ఆర్యుల వలస’’ సిద్ధాంతాన్ని, అంటే రుజువులతో కూడిన సిద్ధాంతాన్ని, ప్రపంచ ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు అందరిలాగే ఆమె కూడా అంగీకరించారు. అటువంటిది చరిత్ర distort అయిందనీ,ఈ దుర్మార్గానికి కారణం రొమిల్లా థాపర్ వంటి వారు రాసిన text book అనీ అన్నారు. రుజువులతో కూడిన చరిత్రను రాయడం ఆమె దోషమా?

మరో ముఖ్య విషయం: చరిత్ర, పురావస్తు శాఖలే కాదు; మత గ్రంథాలు కూడా ఆర్యుల వలస సిద్ధాంతాన్నే రుజువు చేస్తున్నాయి. రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం. ‘బౌద్ధాయన శ్రోత సూత్ర’ అనే హిందూమత గ్రంథమూ, రుగ్వేదానికి సమకాలీకమైన ఇరానియన్ మత గ్రంథం ‘అవేస్తా’ కూడా ఇదే సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయి.

‘బౌద్ధాయన శ్రోత సూత్ర’లో ఇలా ఉంది.
‘‘పురూరవుడు, ఊర్వశి లకు ఇరువురు సంతానం. వారు ఆయువు, అమవసువు. తల్లి ఊర్వశి వారిని బయటి ప్రాంతాలకు వెళ్లమన్నది. ఆయువు తన అనుచరులతో తూర్పుగా వెళ్లాడు. వారు కురు , పాంచాల ,కాశి, విదేహలను ఆక్రమించారు. అమవసువు పశ్చిమ ప్రాంతంలోనే ఆగిపోయాడు.‘‘ఇరానియన్ మత గ్రంధం ‘అవేస్తా’ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నది. దానిలో ఏమున్నదంటే ‘‘ఆర్యులు తూర్పు వైపున అనేక ప్రాంతాలకు వలస వెళ్లారు’’ అని ఉంది. ఆ గ్రంథం పదహారు ప్రాంతాలను పేర్కొన్నది. వాటిలో చివరి ప్రాంతంగా ‘హప్త హిందూ’ను చెప్పింది. ఇరానియన్ భాషలో ‘హప్త హిందూ’ అంటే ‘సప్త సింధు’ అని అర్థం. అంటే రుగ్వేద రచనా కాలం నాటికి ఆర్యులు పడమర నుండి వచ్చి సప్త సింధు ప్రాంతం చేరారని చరిత్ర గ్రంథాలు, మత గ్రంథాలు నిరూపిస్తున్నాయి కదా?

అలాంటి చరిత్రను distorted హిస్టరీ అంటారా? ‘‘ఈ ditorted history should be removed first’’ అంటారా?
‘‘ఇలా అభూతమైన, అసంబద్ధమైన, తర్కానికి నిలవని, పిచ్చి సిద్ధాంతాలు కలిపి ఈ జాతిని విధ్వంసం చేయడం కోసం కొన్ని వందల సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నవి’’ అని శివ ప్రసాద్ ముగించారు. ఏది తర్కానికి నిలవని సిద్ధాంతం? తర్కబద్ధమైన , అన్ని వాదనలకు నిలబడిన సిద్ధాంతాన్నే చరిత్ర ప్రొఫెసర్లు అంగీకరిస్తారు. వారు తర్కానికి నిలవని పుక్కిటి పురాణాలను అంగీకరించరు. అలాంటి సిద్ధాంతాలు ‘‘ఈ జాతిని విధ్వంసం చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు’’ అంటారా? అందువలన దేశభక్తులందరూ ఎవరి వాదన దేశ విచ్ఛిన్నకరమో, జాతి విధ్వంసదాయకమో అర్థం చే సిందిగా కోరుతున్నాను.

కె.ఎల్.కాంతారావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -