అమెరికాకు లూలా హెచ్చరిక
పారిస్ : అక్టోబరులో జరిగే తమ దేశ అధ్యక్ష ఎన్నికలలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సుకు అమెరికా, బ్రెజిల్ అధ్యక్షులు ఇద్దరూ హాజరైన సమయంలోనే ఈ హెచ్చరిక వెలువడడం గమనార్హం. బోల్సనారో కుటుంబంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంబంధాలను కొనసాగించవచ్చునని, అందులో సమస్య ఏమీ లేదని ఆయన చెప్పారు. ‘బోల్సనారోను, ఆయన తండ్రిని, కుమారుడిని, మనుమడిని ట్రంప్ ఇష్టపడవచ్చు. దానితో సమస్యేమీ లేదు. అది ఆయన సమస్య. అయితే బ్రెజిల్ ఎన్నికలలో ట్రంప్ జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే బ్రెజిల్ ఎన్నికలు బ్రెజిల్ సమస్య. అమెరికా ఎన్నికలు వారికి సంబంధించినవి…నాకు కాదు’ అని అన్నారు. తాను అమెరికాను ఎంతగా గౌరవిస్తున్నానో అదే గౌరవాన్ని బ్రెజిల్‌కు కూడా కోరుకుంటున్నానని తెలిపారు. బ్రెజిల్‌కు 2003 నుంచి 2011 వరకూ అధ్యక్షుడిగా కొనసాగిన లూలా 2022లో తిరిగి ఎన్నికయ్యారు. బోల్సనారో కుటుంబ సభ్యుడు, సెనెటర్ ఫ్లావియో బోల్సనారో ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలలో ఆయన లిబరల్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ట్రంప్ బ్రెజిల్ వ్యవహారాలలో వేలు పెట్టడం ప్రారంభించారు. ఆ దేశ అధ్యక్ష ఎన్నికలలో మితవాద అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఎత్తుగడలు వేస్తున్నారు.
మా అధ్యక్ష ఎన్నికలలో మీ జోక్యం వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



