సమస్యలు లేకుండా
ఆర్టీసీ విలీన ప్రక్రియ జరగాలి
సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రాల శ్రీనివాసరావు
ఖమ్మంలో ఆర్టీసీ శ్రామిక మహిళా
రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలో ఆర్టీసీలో రీజనల్ మేనేజర్ స్థాయి అధికారి నుంచి కండక్టర్ స్థాయి ఉద్యోగుల వరకు 4,500 మంది పైగా మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మంలోని కొండబోలు వెంకయ్య చౌదరి మీటింగ్ హాల్‌లో డి.సరిత అధ్యక్షతన గురువారం ఆర్టీసీ శ్రామిక మహిళా సదస్సు జరిగింది. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుభూతితో వ్యవహరించాలని ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ సదస్సు పలు తీర్మానాలను ఆమోదించింది. ప్రతి డిపో, రీజియన్, జోనల్, హెడ్ ఆఫీస్ కేంద్రాలలో “లైంగిక వేధింపుల నిరోధక కమిటీ” ఏర్పాటు చేయాలని, సర్కులర్ లో పేర్కొన్న విధంగా సంస్థేతర మహిళలను కమిటీలో నియమించాలని, లైంగిక వేధింపులపై ఆ కమిటీ ఇచ్చే నివేదికపై తగు చర్యలు తీసుకోవాలని సదస్సులో తీర్మానించారు. ఆర్టీసీ శ్రామిక మహిళా రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ జె.పద్మావతి నోట్ ప్రవేశ పెడుతూ.. మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళా కండక్టర్లకు ప్రతి బస్టాండ్‌లోనూ ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు వాడకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
నెలకు మూడు రోజుల ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని, మహిళా కండక్టర్లకు ప్రత్యేక డ్యూటీ చార్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. రాత్రి 8 గంటల లోపు డ్యూటీ పూర్తయ్యే విధంగా డ్యూటీలను కేటాయించాలని కోరారు. తనిఖీ అధికారుల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా మహిళా కండక్టర్లపై చార్జి మెమోలు రాసి వేధిస్తున్నారని, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగులుగా ఉన్న తమ పట్ల తోటి మహిళా సూపర్‌వైజర్‌లే అర్థం చేసుకోపోవడం బాధాకరమని, కొంతమంది ద్వందార్థపు కామెంట్లు చేస్తున్నారని, చిన్న చిన్న విషయాలకే ఇంక్రిమెంట్ల కోతలు విధిస్తూ తమను ఆర్థికంగా కుంగదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు కండక్టర్లుగా ఒక వైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలతో వారు ఎదుర్కొనే సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. గతంలో ఖమ్మం రీజియన్‌లో మహిళలకు ప్రత్యేక డ్యూటీ చార్టులు వేయించడంలోనూ, ప్రతి డిపోలోనూ వారికి విశ్రాంతి గదుల ఏర్పాట్లు, సమస్యల పరిష్కారంలోనూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గుర్తింపు సంఘంగా ప్రత్యేక కృషిచేసి రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటానికి ప్రభుత్వం ఆమోదించినందున ఆ సమయంలో ఏపీలో మాదిరిగా సమస్యలు రాకుండా చూడాలని కోరారు. సమస్యలు లేని విలీనంతో పాటుగా, ఉద్యోగ భద్రత అంశం కూడా అత్యంత ప్రధానమైనదని అన్నారు.
అందుకనే సమస్యలు లేకుండా విలీనం కోసం, సంపూర్ణ ఉద్యోగ భద్రత కోసం కేటగిరీల వారీగా సదస్సులు నిర్వహించి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి ప్రారంభోపన్యాసం చేశారు. మహిళా కార్మికులకు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్ లు తెలంగాణలో అమలైతే మహిళలు రాత్రి సమయంలో కూడా పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని, కార్మిక హక్కులు హరించబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ, ఖమ్మం రీజియన్ కన్వీనింగ్ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక ఆర్టీసీ శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్‌గా జె.పద్మావతి ఎన్నికయ్యారు. పదిహేను మందితో నూతన రాష్ట్ర సమన్వయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, ఖమ్మం రీజియన్ ఆర్టీసీ శ్రామిక మహిళ కన్వీనర్ గా డి.సరిత తో పాటు తొమ్మిది మందితో నూతన కన్వీనింగ్ కమిటీని సదస్సు ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కార్యక్రమంలో ఖమ్మం రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు గుండు మాధవరావు, పిట్టల సుధాకర్, నాయకులు హెచ్చు బసవయ్య, పగిళ్లపల్లి నరసింహారావు, తోకల బాబు, ఓరుగంటి రాంబాబు, జి.బాబు, సురేష్, రామలక్ష్మి, పర్వీనా, సైదమ్మ, నూర్జహాన్, పద్మా, రమాదేవి, సుధారాణి, విజయలక్ష్మి, మల్లికాంబ, ఎండిఎం.బేగం, సీతమ్మ, రమ, లక్ష్మి, భాగ్యలక్ష్మి, జ్యోతి, మంజుల, శిరీష రాణి, మల్లికాంబ, లక్ష్మీ భవాని పాల్గొన్నారు.



