ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్నాం పేదల సొంతిటికల నెరవేరేదాకా ఉద్యమాన్ని ఆపం
వ్యవసాయ కూలీలకు కనీస వేతనం రూ.600 నిర్ణయించాలి
వారి కోసం
సమగ్ర చట్టం తేవాలి
రాష్ట్ర మహాసభలో
పోరాట కార్యాచరణ :
నవతెలంగాణ తో ఇంటర్వ్యూలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘పేదలకు భూములు పంచాలి..కూలి రేట్లు పెంచాలి.. ఉపాధి కల్పించాలి’ అనే నినాదం తో తమ సంఘం రాష్ట్రంలో సమరశీల పోరాటాలు నిర్వహి స్తున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య తెలిపారు. ‘ప్రభుత్వం ఎన్నిసార్లు గుడిసెలు కూల్చే యించినా..అరెస్టులు చేసి జైలు పాలు చేసినా… మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్నా.. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎక్కడ కూడా ఆపలేదు. ఆపబోం. ఎన్నిసార్లు గుడిసెలు కూలిస్తే అన్నిసార్లు వేస్తాం.పేదల సొంతింటి కల నెరవేర్చేదాకా, మిగులు భూములను పంచేదాకా పోరాటాన్ని ఆపబోం’అని నొక్కి చెప్పా రు. వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలననే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించ బోతున్నామనీ, వచ్చే రెండు, మూడు నెలలు ఊరూరు తిరిగి సర్వే చేసి పేదల పక్షాన పోరాటాలు చేస్తామని ప్రకటించారు. మహబూబ్ నగర్‌లో ఈ నెల 20, 21,22 తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ జరుగుతున్న నేపథ్యంలో నవతెలంగాణ కు ఆయన ఇంటర్వ్యూఇచ్చారు.ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…
ఎక్కువ కష్టం…తక్కువ వేతనం
దేశంలో నూటికి 60 శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. పేదరైతులు కూడా వ్యవసాయ కూలీల కిందనే లెక్క. కూలీలకు హక్కుల్లేవు. చట్టాల్లేవు. సమాజంలో అందరికంటే ఎక్కువ కష్టపడి తక్కువ వేతనం పొందుతున్నది వ్యవసాయ కూలీలే. వాళ్ల తిండి, బట్టలు, విద్య, వైద్యం, కనీస వేతనాల గురించిగానీ పాలకవర్గాలు పట్టించుకున్న పాపాన పోలేదు. సమాజంలో అత్యంత అనారోగ్యా నికి గురయ్యేవారు వీరే. అత్యంత రక్తహీనతకు గురయ్యేవారు వీరే. రోగమో, నొప్పో వస్తే ఆస్పత్రుల్లో చూపించుకునే స్థోమత లేక మందుగోలీలేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
కనీస కూలి రూ.600 కోసం పోరాటం
వ్యవసాయ కార్మిక సంఘాన్ని పుచ్చలపల్లి సుందరయ్య 1936లో స్థాపించారు. అప్పటి నుంచీ వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం నికరంగా పోరాడుతున్నది వ్యవసాయ కార్మిక సంఘమే. ‘భూమి పంచాలి..కూలి పెంచాలి…ఉపాధి చూపించాలి’ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. పెరుగుతున్న నిత్యావసర ధరలతో పోలిస్తే వ్యవసాయ కూలీల ఆదాయం సరిపోని పరిస్థితి. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంగానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుగానీ వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల జీవోలను సవరించలేదు. రెండేండ్లకోసం కూలిరేట్లు పెంచాలన్న జీవోను అటకెక్కించారు. రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవసాయ కూలీ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. కనీస వేతన జీవోను రూ.600 ఉండేలా చూడాలి. గతంలో వ్యవసాయ సీజన్ వస్తే లేబర్ ఆఫీసు వాళ్లు ఊర్లలో తిరిగి కూలి రేటు ఇంత ఉండాలని కరపత్రాలు పంచేవారు. ఇప్పుడదీ ఎక్కడా కనిపించడం లేదు.
కోనేరు రంగారావు కమిటీ సిఫారసులు బుట్టదాఖలు
25 ఎకరాల మాగాణీ, 50 ఎకరాల మెట్ట భూమికి సీలింగ్ పెట్టి అంతకంటే ఎక్కువ ఉంటే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని చట్టం ఉంది. అలా చూస్తే దేశంలో 6 కోట్ల ఎకరాల మిగులు భూమి ఉందని తేలింది. ఇప్పటి వరకూ పంచిన భూమి 2 కోట్ల ఎకరాలే. సీలింగ్ చట్టాన్ని 2013లో సవరిస్తూ పదెకరాల భూమి కంటే ఎక్కువ ఉంటే సీలింగ్ విధించాలని యూపీఏ ప్రభుత్వం ముసాయిదా రూపొందించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే చాలా భూమి పంచాం. తెలంగాణలలో పంచనీకి భూమిలేదని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ పంపారు. కోనేరు రంగారావు కమిటీ కోటీ 30 లక్షల మిగులు భూమి ఉందనీ, దాన్ని పేదలకు పంచాలని సిఫారసు చేసింది. అన్ని ప్రభుత్వాలూ ఆ సిఫారసును బుట్టదాఖలు చేశాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు పంచ డానికి అనుకూలంగా పది లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. పంచడానికి భూములు లేవని పాలకులు చెబుతున్నారు.
ఇండ్లులేని కుటుంబాలు 31 లక్షలు…ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటం
గత బీఆర్‌ఎస్ సర్కారు చేపట్టిన ఇంటింటి సర్వే ప్రకారం తెలంగాణలో సెంటు జాగా లేని కుటుంబాలు 31 లక్షలు. ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాలివ్వాలని మేం డిమాండ్ చేస్తే కేసీఆర్ ఏమో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిచ్చి తీరుతామని డాంభికాలకు పోయాడు. పదేండ్ల పాలనలో కట్టింది 2.94 లక్షల ఇండ్లే. పేదలకు పంచింది 1.50 లక్షల ఇండ్లే. ఇలాగైతే పేదలకు సొంతిల్లు కలగానే మిగులుతుంది. ఎన్నికల ప్రచారంలో ఇండ్లు లేని పేదలకు 120 గజాల భూమి ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్ హామి ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇప్పడేం చేస్తున్నది? స్థలమున్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కాంగ్రెస్ కమిటీలుగా మారాయి. గ్రామాల్లో అన్ని పార్టీలతో అఖిలపక్ష కమిటీ వేసి గ్రామసభ ద్వారా నిజమైన పేదలకు ఇండ్లను ఇవ్వాలి. దేవాదాయ, భూదాన, అసైన్డ్, సీలింగ్, చాలా భూములున్నాయి. వాటిలో స్థలమిచ్చి ఇండ్లు కట్టివ్వాలి. ఇండ్లులేని పేదలకు ఇండ్లు ఇవ్వాలి..భూమి పంచాలి అనే డిమాండ్‌తో ఉద్యమాలు చేస్తాం. మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వరంగల్, తదితర జిల్లాల్లో పేదలతో ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు వేసి పోరాటాలు చేస్తున్నాం. ప్రభుత్వం సూచనతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పదులసార్లు కూల్చినా… మహిళలను చిత్రహింసలకు గురిచేసి వేధిస్తున్నా…పదుల సంఖ్యలో నాయకులను జైళ్లల్లో పెట్టినా ఇండ్లు, ఇండ్ల స్థలాల పోరాటాన్ని ఆపడం లేదు. పేదలకు ఇండ్లు ఇచ్చేదాకా పోరాడుతాం.
వ్యవసాయ కార్మికులకు
ఒక సమగ్ర చట్టం తేవాలి
వ్యవసాయ కూలీలకు ఉపయోగప డుతున్న ఒక్క నరేగా చట్టాన్ని మోడీ సర్కారు రద్దు చేసింది. గతంలో కేంద్రం 90 శాతం నిధులిచ్చేది. దాని స్థానంలో మోడీ సర్కారు వీబీ గ్రామ్‌జీ పథకం తెచ్చింది. మొదట 40 శాతం నిధులు ఖర్చుపెడితే రాష్ర్టాలకు తన వాటా 60 శాతం నిధులను ఇస్తామని కేంద్రం మెలిక పెట్టి కూర్చున్నది. ఉపాధి పనికిపోగానే హాజరు తీసుకుంటారు. వచ్చేటప్పడు తీసుకుంటారు. చేసిన పనికి కొలతలేసి కూలి కట్టిస్తారు. మళ్లీ కూలోళ్లను రెండు సార్లు ఫొటోలు తీయడమెందుకు? వంద, రెండొందల మంది ఫొటోలను తీయడానికే రెండు, మూడు గంటలు పోతున్నది. రెండో సారి పది మంది గ్రూపుగా ఫొటోలు తీస్తున్నారు. కూలోళ్లు ఏమైనా దొంగలా? నేరాలు చేసొచ్చారా? ఫొటోలు ఏం అవసరం? ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. కూలోళ్లను పని నుంచి వెళ్లగొట్టే కుట్ర దీని వెనుక ఉంది. కేరళంలో ఉపాధి కూలీలకు, వ్యవసాయ కూలీలకు రోజువారీ కనీస వేతనం రూ.600 ఇస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలనీ, రూ.600 కూలి ఇవ్వాలని పోరాటాలు చేయబోతున్నాం.
వ్యవసాయ కార్మికులు సంపద, ఆహారధాన్యాల సృష్టికర్తలు. దేశ ఉత్పత్తి నిర్మాతలు. వారి కోసం సమగ్ర చట్టం కావాలని కోరుతున్నాం. వ్యవసాయ కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. పీఎఫ్ ప్రవేశపెట్టాలి. దేశంలో కేవలం పది మంది చేతుల్లో 58 శాతం సంపద పోగై ఉంది. 50 శాతం ప్రజల చేతుల్లో కేవలం 3 శాతం సంపదే ఉంది. సంపన్నులపై ఒక్క శాతం పన్ను విధించి పేదల కోసం కేటాయించాలి. మార్కెట్ సెస్సు మీద ఒక శాతం పన్ను వేయాలి. అలా పోగైన డబ్బులను పీఎఫ్ నిధిగా నిల్వ చేయాలి. రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్ ఇస్తున్నారు కదా? వ్యవసాయ కూలీలకు ఎందుకివ్వరు? రూ.5 వేల చొప్పున ఇంట్లో ఎంత మంది అర్హులుంటే అంతమందికి ఇవ్వాలి. రిటైర్డ్‌మెంట్ వయస్సు ప్రకారం వ్యవసాయ కూలీలకు ఫిక్స్‌డ్‌గా రూ.5 లక్షలు ఇచ్చేలా ప్లాన్ చేయాలి. ఇవన్ని అంశాలతో వ్యవసాయ కూలీల సంరక్షణ కోసం సమగ్ర చట్టం చేయాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోతున్నది. దీంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి పోతున్నది. ఇలాంటి తరుణంలో గ్రామీణ పేదలందరికీ సమీకరించి సంఘాన్ని బలోపేతం చేసి హక్కుల కోసం సమరశీల పోరాటాలను చేస్తాం. రాష్ట్ర మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిం చుకుంటాం.
పేదల భూముల్ని లాక్కోవడం దుర్మార్గం
అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో పేదల నుంచి భూములు లాక్కోవడం దుర్మార్గం. ధనవంతుల భూములను ఒక్కసారి కూడా లాక్కున్న పరిస్థితి లేదు. అదేందో రోడ్లన్నీ పేదోళ్ల భూముల నుంచే పోతాయి. ఇచ్చే నష్టపరిహారం అంతంతే. ఎంతో కొంత ఇచ్చి సర్కారు చేతులు దులుపుకుంటున్నది. మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరం రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతుంటే ఐదు, పది లక్షల రూపాయల పరిహారమేంటి? అసైన్డ్ భూములకైతే పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి లేదన్నట్టు పాలకులు వ్యవహరిస్తున్నారు. ల్యాండ్ ఫూయిలింగ్ పేరుతో ప్రభుత్వమే అసైన్డ్ భూములను తీసుకోవడం అన్యాయం. పాలకుల విధానాలతో అంతిమంగా నష్టపోతున్నది చిన్నసన్నకారు రైతులే. కేసీఆర్ ప్రభుత్వం మూడెకరాల భూమి పంపిణీని అటకెక్కించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ పంపిణీ మాటే ఎత్తడం లేదు. రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల పోడు భూమి ఉండగా..4 లక్షల ఎకరాలకే గత ప్రభుత్వం హక్కుపత్రాలిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటే ఎత్తడం లేదు.



