నవతెలంగాణ-మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
రేపు మహబూబ్ నగర్ లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు డి. జి. నర్సింహా రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్ నగర్ లో జరుగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో అయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికుల స్థితిగతులపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని సంపన్నుల దోపిడీకి వ్యతిరేకంగా, కూలి రేట్ల పెంపు గ్రామీణ పేదలను, ఉపాధి కూలీలను, ఇతర కార్మికుల్ని ఐక్యం చేసి పోరాటాలకు సన్నద్ధమయ్యేలా ఈ మహాసభలు దిశా, నిర్దేశం చేయనున్నాయని పేర్కొన్నారు. కావున రేపు మధ్యాహ్నం 12 గం.లకు మునిసిపల్ టౌన్ హాల్ నుంచి ప్రారంభమయ్యే భారీ ప్రదర్శన, బహిరంగ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ చేరుకున్న త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



