Saturday, June 20, 2026
E-PAPER
Homeజాతీయంటెలిగ్రామ్‌పై నిషేధం సరైందే

టెలిగ్రామ్‌పై నిషేధం సరైందే

- Advertisement -

పిటిషన్‌ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ:
నీట్‌-యూజీ (2026) రీఎగ్జామ్‌ నేపథ్యంలో మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కేంద్రం ఆంక్షలను సవాల్‌ చేస్తూ టెలిగ్రామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కేంద్రం చర్యలు సరైనవేనని కోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి అసమానతలు కన్పించలేదని న్యాయస్థానం వెల్లడించింది. ‘‘ప్రవేశ పరీక్ష విధానంలో సమగ్రతను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు సమర్థనీయమే. ఇవి అత్యంత తక్కువ ఆంక్షలతో కూడుకున్నవే. టెలిగ్రామ్‌ యాక్సెస్‌ను నిరోధించే అధికారం కేంద్రానికి ఉంది. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వం వివరించిన కారణాలు సహేతుకంగానే ఉన్నందున.. తాత్కాలిక నిషేధం సమంజసమే అని భావిస్తున్నాం’’ అని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం లేపిన నేపథ్యంలో.. జూన్‌ 21న రీటెస్ట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే, ఈ పరీక్షకు సంబంధించిన కొన్ని ముఠాలు టెలిగ్రామ్‌ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఇటీవల దీనిపై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు వార్తల వ్యాప్తిని నివారించేందుకు, మోసపూరిత నెట్‌వర్క్‌లను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. జూన్‌ 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. దీంతో ఈ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ టెలిగ్రామ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరపగా.. ఈ యాప్‌పై కేంద్రం తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్‌ ‘కొత్త డార్క్‌ వెబ్‌’గా మారుతోందని, నేరగాళ్లకు సాధనంగా ఉందని ఆరోపించింది. సైబర్‌ నేరగాళ్లు, అతివాదులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు దీన్ని ఎక్కువగా వాడుతున్నారని దుయ్యబట్టింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిన్న తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా టెలిగ్రామ్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -