Saturday, June 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగ్రామీణ శ్రామికులను సమీకరిస్తాం

గ్రామీణ శ్రామికులను సమీకరిస్తాం

- Advertisement -

సంపన్నుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం
సంపదను వికేంద్రీకరించి
పేదలకు అందేలా చూడాలి
గ్రామీణ పేదలకు 
లక్ష‍ కోట్లు బాకీ పడ్డ
రేవంత్‌‌రెడ్డి సర్కారు
అభివృద్ధి పేరిట భూ దందా
సుందరయ్య స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం చేస్తాం
వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం కొట్లాడుతాం
నవతెలంగాణ ఇంటర్వ్యూలో అఖిల భారత వ్యవసాయ కార్మిక
సంఘం ప్రధాన కార్యదర్శి
బి వెంకట్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామాల్లోని శ్రామికులను సమీకరించి ధనవంతుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామనీ, దానికోసం బలమైన పోరాటాలను రూపొందిస్తా మని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ‌ప్రకటించారు. దేశంలోని సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి ముసుగులో పాలకవర్గా లు పేదల నుంచి భూములను లాక్కొని కార్పొరేట్లకు పంచిపెడుతూ భూదందా చేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ కార్మికుల హక్కులు, భూ పంపిణీ, సంపద వికేంద్రీకరణ, ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు దేశవ్యాప్తంగా బలమైన పోరాటా లు చేస్తామని ప్రకటించారు. సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామ న్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభల నేపథ్యంలో హైదరాబాద్‌‌కు వచ్చిన ఆయన నవతెలంగాణ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు.

వ్యకాస విశిష్టత ఇలా
తెలుగు రాష్ర్టాల్లో వ్యవసాయ కార్మిక సంఘానికి సుధీర్ఘమైన చరిత్ర ఉంది. గ్రామీణ పేదలకు ప్రత్యేక సంఘం ఉండాలని
గుర్తించి సంఘంపెట్టిన గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని గర్వంగా చెబుతున్నాను. అలాంటి సంఘం ఇప్పుడు 20 రాష్ర్టాలు, 300 జిల్లాలు, 35 వేలకుపైగా గ్రామాలకు విస్తరించింది. 80 లక్ష‍లకుపైగా సభ్యత్వం ఉన్న ఏకైక అతిపెద్ద సంఘం మాది. తెలంగాణలోనూ 31 జిల్లాలు, ఐదు వేల గ్రామాల్లో మా సంఘముంది.

వ్యవసాయ కార్మికులకు ఏటా 55 నుంచి 60 పనిదినాలే
వ్యవసాయంలో వస్తున్న మార్పులు, పాలకవర్గాల విధానాలు, ప్రపంచీకరణ, యాంత్రీకరణ ప్రభావం వల్ల వ్యవసాయ కార్మికులకు ఉపాధి రోజురోజుకీ తగ్గిపోతున్నది. గతంలో ఒక కూలికి సగటున 150 నుంచి 170 రోజుల పనిదినాలు దొరికితే ఇప్పుడు 55 నుంచి 60 రోజులకు పడిపోయాయి. వ్యవసాయ కార్మి కులు ఇప్పుడు మార్జినల్‌ ‌వర్కర్లు గామారారు.

పల్లెల్లో ఉపాధి లేకుంటే కొనుగోలు శక్తి పెరగదు..
వ్యవసాయ కూలీలకు ఉపాధి చూపెట్టడం అంటే గ్రామీణ పేదలను ఆదుకోవడమే. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరినివ్వడమే. గ్రామాల్లో ఉపాధి పెరగకుండా ప్రజల కొనుగోలు శక్తి పెరగదు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదు. దేశంలో సరుకుల కొరత లేదు. కొనుగోళ్ల కొరత ఉంది. వ్యవసాయ పనిదినాలకు తోడు మరికొన్ని రోజులు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కమ్యూనిస్టు పార్టీల ఒత్తిడితో యూపీఏ-1 ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం కోరుకున్న మహాత్మాగాంధీ పేరుమీద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వ్యవసాయ కూలీలకే కాకుండా సన్నచిన్న కారు రైతులకు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇతోధికంగా దోహదపడ్డది. దేశంలో 25 కోట్లమందికిపైగా ఆ చట్టం కింద ఉపాధి కోసం పేర్లు నమోదు చేసుకోగా అందులో 9 నుంచి పది కోట్ల మంది యాక్టివ్‌ ‌వర్కర్లు ఉన్నారు. 4,770 కోట్ల పనిదినాలు కల్పించబడ్డాయి. పదిలక్ష‍ల కోట్ల రూపాయలు ఖర్చుచే యబడ్డాయి. ఎంత మంది అడిగితే అంతమందికి పని చూపె ట్టింది. బడ్జెట్‌‌పరిమితి లేకుండా వచ్చిన ఏకైక చట్టం ఇదే.

‘ఉపాధి’ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసింది. వీబీ గ్రామ్‌‌జీ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి 125 రోజుల పని కల్పిస్తామని చెబుతున్నది. ఇదంతా బూటకం. ఇల్లును కూలదోసి ఇంటికి రంగు వేసినట్టుగా కొత్త పథకం ఉంది. దీనికి బడ్జెట్‌ పరిమితి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను ముందు ఖర్చుపెడితే 60 శాతం నిధులిస్తామని మెలిక పెట్టింది. కేంద్రం నోటిఫై చేసిన పనులను మాత్రమే చేయాలని షరతు విధించింది. నిరుద్యోగభృతిని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని స్పష్టం చేసింది. దీనికి మతాన్ని సూచించేలా పేరు పెట్టింది. కొత్త పథకానికి రూ. 95 వేల కోట్ల రూపాయలకే పరిమితం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ప్రభుత్వ వాటా రూ.10 వేల కోట్లు వస్తాయి. రాష్ట్రాల వాటా మరో 8 వేల కోట్లు. సగటున లెక్కేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు 65 రోజుల పనిదినాలే దక్కుతాయి. అందరికీ పని ఇవ్వాలంటే తెలుగు రాష్ట్రాలు రూ. 24,500 కోట్లు అదనంగా భరించాలి. దేశవ్యా ప్తంగాచూస్తే అన్ని రాష్ట్రాలు 2,25,000 వేల కోట్లు ఖర్చుపెట్టాలి. రాష్ర్టాలు ఇంత మొత్తం భరించడం సాధ్యం కాదు. పైగా, అధికారాలన్నీ స్టీరింగ్‌ ‌కమిటీకి అప్పగించింది. ప్రధానమంత్రి కార్యాలయం, నాగపూర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యాల యం చేతిలో ఉండే స్టీరింగ్‌ ఇది. కౌన్సిల్‌‌ను వేశారు. అందులో వ్యవసాయ కార్మిక సంఘా లను చేర్చారుగానీ వాటికి ఎలాంటి అధికారాలు లేవు.

‘ఉపాధి’పై గ్రామీణ ధనిక వర్గం కంటగింపు
ఉపాధి హామీ చట్టం వచ్చాక గ్రామాల్లో కూలీలకు బేరమాడే, కొనుగోలు శక్తులు పెరిగాయి. అన్ని ఉత్పత్తి తరగతులు ఒకే చోట పనిచేయడంతో సామాజిక సమతుల్యత పెరిగింది. ఇది గ్రామాల్లోని 20 శాతం ధనికవర్గానికి కంటగింపుగా మారింది. కూలీలపై వారికున్న ఆధిపత్యం పోయిందనే కోపం పెరిగింది. కూలీలు ఆత్మగౌరవంతో బతకడం ఆర్‌ఎస్‌ఎస్‌‌కి కూడా ఇష్టం లేదు. గ్రామీణ ధనిక వర్గాన్ని సంతృప్తిపరిచేందుకు, పట్టణాల్లో నిరుద్యోగులను ఎక్కువ తయారు చేసి యజమా నులకు తక్కువ వేతనంతో ఉద్యోగులు, కూలీలను అందించేందుకు ఉపాధి హామీ చట్టాన్ని మోడీ సర్కారు రద్దు చేసింది. కూలీల ను నూతన బానిసలుగా మార్చే కుట్ర దీని వెనుక ఉంది.

భూమి, వ్యవసాయంపై కార్పొరేట్ల కన్ను
మన దేశంలో 40 కోట్ల ఎకరాలకుపైగా సాగు భూమి ఉంది. ప్రపంచంలో మూడో స్థానం. 33 కోట్ల మెట్రిక్‌ ‌టన్నుల ఆహార ధాన్యాల లభ్యత ఉంది. యూరప్‌ ‌దేశాలకు అవసరమయ్యే పంటలను పండించే వాతావరణం, భూములు అనుకూలంగా ఉన్నాయి. దేశంలో 18 శాతం, తెలంగాణలో 27 శాతం, ఏపీలో 35 శాతం జీడీపీ వ్యవసాయం నుంచే వస్తున్నది. దీన్ని కంట్రోల్‌ ‌చేయడానికి కార్పొరేట్లు వస్తున్నారు. ఇప్పటికే మోడీ సర్కారు అదానీలకు గోడౌన్లు, అంబానీలకు మాల్స్‌‌ దక్కేలా చూస్తున్నది. కార్పొరేట్లు భూములను లీజుకు తీసుకుని సాగు చేయిస్తున్నారు. వ్యవసాయాన్ని క్రమంగా తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. బ్రిటీష్‌ ‌పాలకుల మాదిరిగా పరిస్థితి మెల్లగా తయారవుతున్నది.

పెరుగుతున్న భూ కేంద్రీకరణ
గతంలో పేదలకు భూమి పంచాలనే లక్ష్యంతో తెలంగాణ గడ్డ మీద రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటం ద్వారా పది లక్ష‍లకుపైగా ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర ఉంది. ఆ తర్వాతనే ‌ల్యాండ్‌ సీలింగ్‌ ‌చట్టాలొచ్చాయి. ఇప్పుడు సీలింగ్‌ ‌చట్టాలను పాలకులు పక్కనపడేశారు. అభివృద్ధి పేరుతో పేదల నుంచి భూములను లాక్కుంటున్నారు. తెలంగాణలో, దేశంలో 35 శాతం భూమి కేవలం పది శాతం మంది చేతుల్లో ఉంది. పాత తరహా భూస్వామ్య వ్వవస్థ పోయి కొత్తతరహాలో కార్పొరేట్‌ ‌భూకేంద్రీకరణ పద్ధతి పుట్టుకొచ్చింది. పాలకులే పేదల నుంచి భూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అభివృద్ధి పేరుతో పేదల భూములను లాక్కోవడం దుర్మార్గం. తెలంగాణలో గత కేసీఆర్‌ ‌ప్రభుత్వం పార్మాసిటీ పేరుతో 30 నుంచి 40 వేల ఎకరాలను సేకరించింది. నాగార్జున సాగర్‌‌కు రోడ్డుకు పక్కనే ఉంది. రేవంత్‌‌రెడ్డి సర్కారు మరో 30 వేల ఎకరాలను సేకరిస్తామంటున్నది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ కబ్జా ఇది. రైతులకు రూ.10 లక్ష‍ల నుంచి రూ. 15 లక్ష‍లు ఇచ్చి లాక్కొన్ని అదే భూమిని కార్పొరేట్లకు కోటి రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు. పాలకపార్టీల నేతలు కంపెనీలతో కుమ్మక్కయి చేస్తున్న భూ దోపిడీ ఇది.

సామాజిక సమానత్వం సాధించడం ముఖ్య లక్ష్యం
సంపదను వికేంద్రీకరించానీ, భూములు పంచాలనీ గ్రామాల కేంద్రంగా బలమైన ఉద్యమాలను రూపొందిస్తాం. వ్యవసాయ కార్మి కులతో పాటు ఇతర పనులు చేసుకునే కూలీలు, పేదలను సమీకరించి పోరాటం చేస్తాం. గ్రామీణ పేదల కోసం పోరాడే ఒక గొడుగుగా వ్యవసాయ కార్మిక సంఘం నిలవబోతున్నది. మహిళలు, యువత మీద కేంద్రీకరించి పనిచేస్తాం.

రేవంత్‌‌రెడ్డి సర్కారు లక్ష‍ కోట్ల బకాయి
తెలంగాణలో 40 లక్ష‍ల మంది పెన్షనర్‌‌దారులకు రూ.25 వేల కోట్లు, మహిళలకు రూ.75 వేల కోట్లు రేవంత్‌‌రెడ్డి సర్కారు బకాయి పడ్డది. మొత్తం లక్ష‍ కోట్ల రూపాయల బకాయిని ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో దీన్ని ప్రధాన అంశంగా చర్చిస్తాం. వాటిని ఇచ్చేదాకా పోరాడుతాం. పేదలందర్నీ తీసుకుని హైదరాబాద్‌‌ను ముట్టడిస్తాం. స్థలాలున్న వారు 20 లక్ష‍ల మంది ఇండ్లు అడుగు తున్నారు. దాని సంగతేంటి? వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైంది. క్రిస్టియానిటీ తీసుకున్న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరం లేదని సుప్రీం కోర్టు అంటే వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదు. రిజర్వేషన్లను తీసేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేస్తున్న కుట్ర ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -