అధికారుల నియామకం.. ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంపై ఈనెల 27న జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాల వారీగా ఉన్నతాధికారులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 16 నుంచి ఈనెల 12 వరకు 99 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. జరిగిన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు తీరుపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్‌కు జయేష్ రంజన్, మేడ్చల్ మల్కాజిగిరికి వికాస్‌రాజ్, రంగారెడ్డికి సబ్యసాచి ఘోష్, మేదక్‌కు ఏ వాణీప్రసాద్, యాదాద్రి భువనగిరికి బీఎండీ ఎక్కా, వికారాబాద్‌కు నవీన్ మిట్టల్, మహబూబ్‌నగర్‌కు ఎం దానకిశోర్, సిద్ధిపేటకు అహ్మద్‌నదీం, రాజన్న సిరిసిల్లకు శైలజారామయ్యర్, జయశంకర్ భూపాలపల్లికి ఎన్ శ్రీధర్, కరీంనగర్‌కు సందీప్ కుమార్ సుల్తానియాతోపాటు మిగతా జిల్లాలకు ఐఏఎస్ అధికారులను నియమించామని తెలిపారు. పరిశీలించిన అంశాలను సమగ్ర నివేదిక రూపంలో సమర్పించాలని కోరారు.
99 రోజుల కార్యక్రమంపై 27న జిల్లాల వారీగా సమీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



