Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వం దిగిరాకపోతే రిలే నిరాహారదీక్షలు

ప్రభుత్వం దిగిరాకపోతే రిలే నిరాహారదీక్షలు

- Advertisement -

టాప్ర మహాధర్నాలో మాజీ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పెన్షనర్లు, పదవీ విరమణ పొందిన వారి డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం దిగిరాకపోతే రిలే నిరాహారదీక్షలకు వెళ్లాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌ (ఇందిరాపార్క్‌ వద్ద)లో తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ (టాప్ర) పలు డిమాండ్లతో రాష్ట్రస్థాయిలో మహాధర్నా నిర్వహించింది. ఈ మహాధర్నాను ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి ప్రారంభించారు.

పెన్షనర్ల పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలనీ, బకాయిల విడుదలకు నెలకు కనీసం రూ.1,000 కోట్లు విడుదల చేయాలనీ, ట్రెజరీకి మొదట వచ్చిన బిల్లులను మొదట చెల్లించాలనీ, ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వమే వహించాలనీ, సమగ్ర ఆరోగ్య పథకాన్ని రూపొందించి అమలు చేయాలనీ, ఉద్యోగులు పెన్షనర్లను మూడు క్యాటగిరీలుగా విభజించి వారి నుంచి 0.5, 0.75, 1 శాతం కాంట్రిబ్యూషన్‌ మాత్రమే తీసుకోవాలనీ, అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. అదే విధంగా మొదటి వేతన సవరణ కమిషన్‌ సిఫారసుల ప్రకారం 20 సంవత్సరాల సర్వీసుకు పూర్తి పెన్షన్‌ చెల్లించాలనీ, నెలకు రూ.398తో చేసిన సర్వీస్‌కు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షనరీ బెనిఫిట్స్‌కు వర్తింప జేయాలని కూడా మహాధర్నా డిమాండ్‌ చేసింది.

చావ రవి మాట్లాడుతూ పెన్షనర్లు మహాధర్నా పట్టుదలతో చేస్తున్నారని అభినందించారు. ఈ విషయంలో ఉద్యోగులకు కనువిప్పు కలిగించాలని చెప్పారు. అవసరమైతే అప్పు చేసైనా సరే… పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హెల్త్‌ స్కీంకు 1 శాతం కాంట్రిబ్యూషన్‌ సరి పోతుందని చావ రవి తెలిపారు. టీజీఈజేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ నెల నుంచి మరో 7 వందల కోట్ల రూపాయల బడ్జెట్‌ కేవలం పెన్షనర్ల బకాయిల చెల్లింపులకే కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నట్టు తెలిపారు. టీజీఈజేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను తమ సమస్యలుగా పరిగణించి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.

హెల్త్‌ స్కీంకు సంబంధించి ప్రస్తుతం 1.5 శాతం కాంట్రిబ్యూషన్‌ అనేది శాశ్వతం కాదని చెప్పారు. ప్రతి నెల ట్రస్టు సభ్యులు సమీక్షించి అవసరమైతేనే 1.5 శాతం కొనసాగుతుందనీ, లేదంటే 1 శాతానికి కావాలంటే 0.75 శాతానికి కూడా తగ్గించే వీలు ఉందని స్పష్టం చేశారు. మహాధర్నాలో ఆల్‌ ఇండియా ఈపీయస్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్స్‌ చైర్మెన్‌ ఎం.ఎన్‌ రెడ్డి, మెడికల్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అధ్యక్షులు భరత్‌ సత్య నారాయణ, రేవా ప్రతినిధులు సి.జయరాం, ఆర్‌ఇఏటి కన్వీనర్‌ కె.చంద్రమౌళి, టాప్ర అధ్యక్షులు పోతుల నారాయణ రెడ్డి ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, ఆర్థిక కార్యదర్శి జి.అశోక్‌, కన్వీనర్‌ డాక్టర్‌ బి.స్వరాజ్‌ కుమార్‌, మీడియా విభాగం నాయకులు కె.బలరాం, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం నాగేశ్వర్‌, సీతారాం, డాక్టర్‌ ఎల్‌.అరుణ, లక్ష్మినారాయణ, పి.శ్యాంసుందర్‌, కె.రాందాస్‌, ఎం.క్రిష్ణారావు, జిల్లాల ప్రతినిధులు, సభ్యులు, ఇతరులు దాదాపు 800 మంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -