Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

- Advertisement -

యుద్ధ ప్రాతిపదికన హాస్టల్‌ భవనాల మరమ్మతులు
దేశంలోనే మోడల్‌గా అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పరిశీలన
రూ.లక్ష కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందనీ, ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మైనారిటీ సంక్షేమం, బీసీ సంక్షేమం తదితర శాఖల ఫ్రీ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆలోచించి, నిబద్దతతో ప్రాధాన్యతను గుర్తించి, ఆదాయం ఖర్చుపై దృష్టి సారించి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సంక్షేమ శాఖకు సంబంధించి వసతి గృహాలు, గురుకులాల బిల్లులు ఎంత తొందరగా పంపితే అంత తొందరగా క్లియర్‌ చేస్తామనీ, వసతి గృహాల భవనాల మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని ఆయన మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

విద్యార్థులు, టీచింగ్‌ స్టాఫ్‌ కు బయోమెట్రిక్‌ విధానం లేకపోతే వెంటనే అమలులోకి తీసుకురావాలని వాటిని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌ల పైన సోలార్‌ పవర్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులు వసతి గృహాలను సందర్శించి వీలైతే ఒక రోజు రాత్రి అక్కడే బస చేసే ఆదేశాలు ఏ మేరకు అమలవుతున్నాయో జిల్లా కలెక్టర్లతో పర్యవేక్షించాలని కోరారు. హాస్టల్‌ బిల్డింగుల మరమ్మతుల బిల్లులు వచ్చిన వెంటనే క్లియర్‌ చేస్తామని స్పష్టం చేశారు. వరి స్థానంలో పామ్‌ ఆయిల్‌, పప్పు ధాన్యాలు సాగు చేస్తూ, పంట నిల్వల సామర్థ్యాన్ని రాష్ట్రంలో పెంచాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎప్పటికప్పుడు గురుకుల పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టల్‌ అద్దెలు చెల్లిస్తున్నట్టు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సివిల్స్‌, గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఆర్థికంగా, ఇతరత్రా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం వివరించారు. సంక్షేమ వసతి గృహాలు, హాస్టల్లో మోడల్‌ కిచెన్లు ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించాలనీ, ఈ ప్రక్రియను దశలవారీగా ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. రూ.లక్ష కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

హ్యామ్‌, ట్రిపుల్‌ ఆర్‌, హైదరాబాద్‌ -విజయవాడ, ఫ్యూచర్‌ సిటీ నుంచి బందర్‌ పోర్టు, రావిర్యాల నుంచి శ్రీశైలం వరకు రహదారుల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్‌ సమావేశంలో సంతకం చేసి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మైనార్టీ సంక్షేమశాఖమంత్రి మహ్మద్‌ అజహరుద్దీన్‌, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం : డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. మహాత్మా జోతిబాఫూలే ప్రజాభవన్‌లో బుధవారం ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ డైరీని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, అసొసియేన్‌ వ్యవస్థాపకులు, సెక్రెటరీ జనరల్‌ మాతంగి శ్రీనివాస్‌, వర్కింగ్‌ సెక్రెటరీ పీఎం రాజు, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్‌ హక్కుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు. ఆయా వర్గాల హక్కులను కాపాడడం కోసం సంఘాలను నడిపిస్తున్న వారిని అభినందించారు. భవిష్యత్‌లో సంఘాలకు, ఉద్యోగులకు ఎక్కడ ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చినా ప్రజా ప్రభుత్వం వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చిత్తశుద్ధిగా కృషి చేస్తోందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -