మార్చి 5, 6, 7 తేదీలలో నిర్వహణ : ప్రకటించిన రిక్రూట్మెంట్ బోర్డ్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో ఖాళీ గా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూలును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మెన్ వివి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. గత నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో మొత్తం 4,664 మంది అభ్యర్థులకు గాను 3,760 మంది హాజరయ్యారని తెలిపారు. అభ్యర్థుల నుంచి సేకరించిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, మెరిట్ మార్కులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేసినట్టు బోర్డు చైర్మెన్ వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన కటాఫ్ మార్కులు, ఎంపికైన వారి వివరాలను బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. షెడ్యూలు ప్రకారం ఈ రాత పరీక్షలు మార్చి 5, 6, 7 తేదీలలో హైదరాబాద్‌లోని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరగనున్నాయనీ ,ప్రతి టెక్నికల్ పేపర్ పరీక్షా సమయం ఒక గంట మాత్రమే ఉంటుందని చెప్పారు. మధ్యలో అభ్యర్థులను బయటకు అనుమతించబోమని బోర్డు చైర్మెన్ స్పష్టం చేశారు. పరీక్షా విధానం పూర్తిగా వివరణాత్మక (డిస్క్రి ప్టివ్) పద్ధతిలో ఉంటుందన్నారు. మొత్తం 10 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో ప్రశ్నకు సుమారు 100 పదాలలో సమాధానం ఇవ్వాల్సి ఉండగా, అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వడం తప్పనిసరి. ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు (ప్రశ్నకు 10 మార్కులు) నిర్వహించి, ఆ మార్కులను నోటిఫికేషన్లో పేర్కొన్న వెయిటేజీ ప్రకారం తుది మెరిట్ లెక్కింపునకు పరిగణనలోకి తీసుకుంటారని బోర్డు చైర్మెన్ తెలిపారు.
మార్చి 5న మూడు సెషన్లలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్/జనరల్ మరియు కంప్యూటర్స్), ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తామనీ, మార్చి 6న కెమికల్ విభాగానికి చెందిన సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు, మార్చి 7న బయాలజీ/సెరోలజీ విభాగాలకు చెందిన వివిధ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయన్నారు. కాగా రాత పరీక్షకు ఎంపిక కాని అభ్యర్థులకు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వెసులుబాటు కల్పించామని తెలియజేశారు. అర్హత విషయంలో ఏవైనా వివరణలు కోరదలిస్తే, ఫిబ్రవరి 18న ఉదయం 8గంటల నుంచి 21న ఉదయం 8 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ఒక్కో పోస్టుకు రూ. 500చొప్పున ఫీజు చెల్లించి వివరణ కోరాల్సి ఉంటుంది. హాల్‌టికెట్ల డౌన్లోడ్ తదితర వివరాలను త్వరలోనే వెబ్సైట్లో వెల్లడిస్తామని బోర్డు చైర్మెన్ వి.వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



