జుట్టుపోలుగాడు : హా.. హా.. పో.. సాధించాం.. సాధించాం. ప్రపంచ శాంతిని సాధించాం… ఆపేశా. ఆపేశా.. గల్ఫ్ యుద్ధాన్ని ఆపేశా.. మొనగాళ్ళకు మొనగాడు ఈ ట్రంప్ గాడు. శాంతి ఒప్పందం కుదిర్చేసాడు. హా.. హా.. హా..
కేతిగాడు: నోర్ముయ్యహె. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు పట్టుకునే రకం నీది. ఈ ఇసయం మా ఇరానోళ్లకే కాదు, మొత్తం పెపంచకానికే అర్థమయింది. మనిద్దరి మద్య కుదిరింది శాంతి ఒప్పందం కాదు. ఎం.ఒ.యు. మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్.
జుట్టుపోలుగాడు : ఆ.. 107 రోజుల యుద్దానికి మంగళం పాడితే నీవు గడ్డిపరకలా తీసిపారేస్తావేంటి?
కేతిగాడు : మా బాబే… మా బాబే… ఎంత నటన.. ఎంతనటన.. మా సంగతి వదిలేరు. మా జాగ్రత్తల్లో మేం ఉంటాం. 112 బిలియన్ డాలర్లు అమెరికా సొమ్ము ఈ యుద్ధం వల్ల నష్టపోయిందని మీ అమెరికా ప్రజలు గగ్గోలు పెడున్నారు కాబట్టి నీవు సంధికి వచ్చావ్.
జుట్టుపోలుగాడు : నా జిగ్నీ దోస్త్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూహాను కాదని సంధికొచ్చినా నీవలా తేలిగ్గా మాట్లాడటం నాకేం నచ్చలేదు.
కేతిగాడు : నచ్చితే ఏంటి? నచ్చకపోతే ఏంటి? కుండబద్దలు కొట్టినట్టు చెప్పటం మా పని. మా అవసరం. అవును. ఎలాంటి దోస్తునైనా బండ బూతులతో లంగించుకునే ‘గొప్ప’ సంస్కారం నీది.
అల్లాటప్పగాడు: య్యారు. నాకు పిచ్చిలేస్తుంది. మీ ఇద్దరి సంసారం చెడగొట్టకపోతే నేను రంకు మొగుడ్నే కాను. నేనే నెతన్యూహాను. అల్లాటప్పగాడ్ని కాదు. ఇజ్రాయిల్ ప్రధానిని. ది గ్రేటర్ ఇజ్రాయిల్‌కు కాబోయే అధిపతిని.. నన్నే కాదని మీరు అగ్రిమెంట్ చేసుకుంటారా..? అదీ చూస్తా..
కేతిగాడు : ఏంటి చూసేది వంకారు. ముందు మీ నాటకాలు కట్టిపెట్టండెహె. నీయవ్వ. ఎవడికి వాడే అధిపతులు, అధినేతలు. మీసాల్లేకపోయినా మీసాలు మెలేసేవాళ్ళే. మీ పెద్దరికం. మీ డాంబికం మీ దేశాల వరకే. అదీ మీ దేశ ప్రజలు ఆమోదించే వరకే. ఇతర దేశాల్లో జోక్యం చేసుకుని యుద్ధాలు చేస్తామంటే ఎవడూరుకుంటాడు. స్వాభిమానం వున్నవాడు చావనైనా చస్తాడుగానీ ఎవడికీ లొంగడు. తెల్సా. జుట్టుపోలుగాడు : ఒరే అల్లాటప్పగా.. అదే నెతన్యూహా గాడిదా.. నీతో ఇదే వచ్చింది తంతు.. చీటికి మాటికి మద్యలో దూరతావు. దగ్గరదాకా వచ్చినదాన్ని చెడగొడ్తావ్. ఎప్పుడూ దాడులు చేస్తూ కొంప ముంచుతావ్! అసలు నేనే లేకపోతే నువ్వూ ఉండేవాడివి కావు. నీ ఇజ్రాయిల్ ఉండేది కాదు. ఇజ్రాయిల్ కోసం నేను చేసినంత ఏ అమెరికా, అమెరికా అధ్యక్షడూ చేయలేదు. గుర్తుంచుకోర్రోరు.
కేతిగాడు : ఆపెహె నీ సొంతడబ్బా.. మీ ఎదవ నాటకలు మీరు ప్రైవేటుగా చూస్కోండి. ఇప్పుడే చెప్తున్నా.. లెబనాన్ నుండి ఇజ్రాయిల్ దళాలు వైదొలగితేనే ఈ అగ్రిమెంట్. ఏమాత్రం తేడా వచ్చినా యుద్ధం ముగిసినట్టుకాదు అండర్‌స్టాండ్.
బంగారక్క: (చప్పట్లు కొడుతు) శహభాష్.. అవును యుద్ధం ఆగిందంటే ఎవరికీ నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్షణక్షణం మాట మారుస్తుంటాడు. వేయి నాల్కల విషనాగు. భాషా సంస్కారమే కాదు, ఏ సంస్కారం లేని కుసంస్కారి. అగ్రనేత ఎలా అయ్యాడా అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇక నెతన్యాహు జాత్యాహంకారి. ఇద్దరూ ఈ కాలం నాటి నరహంతకులు. మానవ ప్రాణాలకు వీసమెత్తు విలువివ్వరు. అందుకే వారి మాటలను ఎవ్వరూ నమ్మరు. చివరికిప్పుడు ఇరాన్ దవీకరించాకనే ట్రంప్ మాటలు నమ్మటం ప్రారంభంచారు. ఈ యుద్ధం మొదలయ్యి మూడున్నర నెలలయింది. చాలా ప్రాణాలు నిష్కారణంగా గాలిలో కలసిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలం అయింది. వీరిద్దరూ ఇప్పడు అవిభక్త ‘యుద్ధోన్మాద వికత కవలలు’. ప్రపంచానికి పట్టిన పీడకులు. వీరి యుద్ధ చర్యల వలనే ప్రస్తుత హార్మోజ్ జలసంధి వద్ద 800 నౌకలు నిలిచిపోయాయి. ఇరవైవేలమంది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కు మంటున్నారు. అందుకే మనవాళి పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరూ.. శాంతి వీచిక వీచిందని, యుద్ధ జ్వాలలు చల్లారాయని, కొంతలో కొంత ఉపశమనం లభించిందని సంబరపడుతున్నారు. స్వాగతిస్తున్నారు. అయితే అదే సందర్భంలో ఈ వికత కవలల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం పొంచుకు వస్తుందోనని భయపడుతున్నారు కూడా. యుద్ధోన్మాదుల పీచమణచడానికి శాంతి ఉద్యమం అన్ని వైపులనుండీ పురుడు పోసుకోవాల్సిందే.
– కె.శాంతారావు, 9959745723



