Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంకర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

- Advertisement -

దేవ్‌జీ, బడే చొక్కారావుతో సహా ఐదుగురు మావోయిస్టులు మృతి..?

నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కర్రెగుట్టల దండకారణ్యంలో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్‌జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు.. ఈ విషయాన్ని గమనించి భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగాయి. ఇరువైపులా నుంచి హోరాహోరీగా గంటల వ్యవధి కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో అగ్రనేతలు ఉండవచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ జోన్‌ నుంచి కర్రెగుట్టల్లోకి మావోయిస్టులు ప్రవేశించి తల దాచుకుంటున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

ఈ నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి. మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం రెండు సంవత్సరాల క్రితం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ గడువు ఈ మార్చి 31 వరకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతిచెందగా.. కేంద్ర కమిటీ సభ్యులు కేవలం దేహార్‌ మిశ్రా, దేవ్‌జీ, గణపతి సజీవంగా ఉన్నట్టు సమాచారం. వేలాది మంది వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 15 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. ఆ జాబితాలో రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, మావోయిస్టు కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, పుసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌, ముప్పిడి సాంబయ్య, వార్త శేఖర్‌, జోడే రత్నభాయి, బడే చొక్కారావు కోసం భద్రతా బలగాలు కర్రెగుట్టలపై జల్లెడ పడుతున్నాయి. ఇక ఈ రెండేండ్లలో 588 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -