ముక్కు పిండి మరీ ‘ఎఫ్ పీహెచ్‌ఓ’ల వసూళ్లు .. చందాల పేరుతో దందా
డాక్టర్ల నుంచి చిరుద్యోగుల వరకు అందరూ డబ్బులివ్వాల్సిందే
హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో వింత పోకడ
తల పట్టుకుంటున్న చిరుద్యోగులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ శాఖల్లో అధికారుల బదిలీలు.. కొత్తవారు బాధ్యతలు స్వీకరించడం సర్వసాధారణం. ఈ సమయంలో పార్టీల పేరిట చేస్తున్న హంగామా వివాదాస్పదమ వుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో ఇది వింత పోకడకు దారి తీసింది. పాత సారు బదిలీపై వెళ్తుంటే ఘనంగా వీడ్కోలు పలికి.. కొత్త సారుకు స్వాగతం చెప్పేందుకు కొంతమంది పైస్థాయి ఉద్యోగులు అట్టహాసంగా కార్యక్రమాలు చేపట్టారు. ఆడంబరాలకు, సన్మానాలకు అయ్యే ఖర్చును ఉన్నతాధి కారులు భరిందకుండా.. క్షేత్ర స్థాయిలో పని చేసే చిరు ఉద్యోగులైన వైద్యులు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్ల నుంచి వసూలు చేయడం వివాదాస్సదంగా మారింది. అసలే అరకొర వేతనాలు.. అది కూడా రెండు, మూడు నెలల కోసారి కానీ, ఉన్నతాధికారులు ఇదేమీ పట్టించు కోకుండా చందా ఇవ్వాలని ఆదేశించడాన్ని చిరుద్యోగులు తప్పు పడుతున్నారు.
ఆదివారం ‘గ్రాండ్’ విందు.. హాజరు తప్పనిసరి..?
హైదరాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పని చేసి బదిలీపై వెళ్లిన డీఎంఅండ్‌హెచ్‌ఓలోని ముఖ్యమైన ఒకరికి వీడ్కోలు పలుకుతూ.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెడికల్ ఆఫీసర్లతోపాటు యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల సిబ్బంది హాజరు కావాలని వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు పంపారు. అయితే, ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చుల కోసం ఉద్యోగుల హోదాలను బట్టి చందాలు ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో పని చేసే వైద్యుడి నుంచి రూ.2వేలు, సూపర్‌వైజర్ నుంచి రూ.వెయ్యి, ఏఎన్‌ఎం నుంచి రూ.300, స్టాఫ్ నర్సు నుంచి రూ.వెయ్యి వసూలు చేశారు.
గతంలో ఫెయిల్.. ఇప్పుడు సక్సెస్..!
15 రోజుల కిందటే ఇరువురు డీఎంఅండ్‌హెచ్‌లకు ‘గ్రాండ్’ పార్టీ ఇచ్చేందుకు యూపీహెచ్‌సీ నుంచి రూ.5వేలు, బస్తీ దవాఖానా నుంచి రూ.3వేలు వసూలు చేశారు. ఇవ్వకుంటే బెదిరించి మరీ చందా వసూలు చేసిన విషయం బయటికి వచ్చింది. దీనిని పైస్థాయి అధికారులు సీరియస్‌గా తీసుకోవడంతో కొందరికి డబ్బులు వెనక్కు ఇచ్చినట్టు తెలిసింది. ఇది జరిగి 10 రోజులు గడవక ముందే మరోసారి డబ్బులు వసూలు చేయడం చర్చనీయాంశమైంది. వందలాది మంది నుంచి రూ.లక్షలు వసూలు చేయడమేంటని పలువురు అంటున్నారు.
ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చందాలు ఇవ్వాలని చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి సాహసం చేయలేకపోతున్నారు. ఇష్టపైతే తీసుకోవాలి తప్ప అందరూ ఇవ్వాలని అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన శాఖలో అధికారుల స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల కోసం ఉద్యోగుల నుంచి చందాలు సేకరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించి కారకులపై చర్యలు తీసుకోవాలని కింది స్థాయి సిబ్బంది కోరుతున్నారు.
పెద్దసార్ల పార్టీలకు.. పెద్ద మొత్తంలో వసూళ్లు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



