నీటి సరఫరాలో అంతరాయాల గుర్తింపునకు డ్రైవ్
28వరకు కొనసాగనున్న సమగ్ర సర్వే
నవతెలంగాణ – మల్హర్ రావు
రానున్న వేసవిలో మండలంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. మండల వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు ఉపయోగిస్తున్న పైపులైన్లు, మోటార్లు, చేతి పంపులు, ఓవర్హెడ్ ట్యాంకులు, బావులను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టేలా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో ఈ నెల 18 నుంచి మండల పరిషత్, పంచాయతీ, గ్రేడ్, ఇంట్ర, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నారు. ఈ సర్వే డ్రైవ్ 28 వరకు కొనసాగనుంది.ఇందులో 5 భాగంగా ప్రతీ తాగునీటి పథకాన్ని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నివేదిక సిద్ధం చేయనుండగా.. తక్షణ మరమ్మతుల కోసం నిధులు మంజూరు అవుతాయని చెబుతున్నారు.
10 రోజుల పాటు సర్వే.
మండలంలో అన్ని ఆవాసాల్లో బుధవారం నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్రతీ గ్రామంలో తాగునీటి వనరుల స్థితిగతులు,పనిచేయని పథకాలు,లీకేజీలు,మోటార్ల పరిస్థితి, పైపులైన్ లోపాలను గుర్తిస్తారు. ఆతర్వాత అవసరమైన మరమ్మతులపై ప్రభుత్వా నికి నివేదించనున్నారు.
నాలుగింటిపై ప్రత్యేక దృష్టి..
ప్రస్తుతం తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న నాలుగు ఆవాసాలను ప్రాథమికంగా గుర్తించారు.ఆయా ప్రాంతాల్లో నీటి వనరులకు అత్యవసరంగా మరమ్మతు చేపట్టడమే కాక, అప్పటివరకు ట్యాం కర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించారు. అలాగే 10రోజుల పాటు చేపట్టే ప్రత్యేక డ్రైవ్ లో గుర్తించే లోపాలను సరిచేయడం ద్వారా రానున్న వేసవిలో ఎక్కడ తాగునీటి ఎద్దడి ఎదురు కాకుండా చూస్తామని యంత్రాంగం చెబుతోంది.
సర్వేతో పూర్తి స్థాయి నివేదిక: క్రాంతికుమార్… ఎంపిడిఓ
మండలంలో తాగునీటి సరఫరా,సమస్యలపై పూర్తి స్థాయిలో సర్వే చేపట్టడం ద్వారా లోపాలపై స్పష్టత రానుంది.అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.ఈ సర్వే బుధవారం నుంచే ప్రారంభించాం.28వ తేదీ వరకు కొనసాగుతుంది. వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటాం.



