నవతెలంగాణ-ఆలేరు టౌన్
యోగా చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని, శ్రీ రామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్, యోగా శిక్షకులు బండి రాజుల శంకర్ అన్నారు. ఆలేరు పట్టణంలో గౌడ సంఘం ఫంక్షన్ హాలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, 19,20, 21వ తేదీలలో మూడు రోజులపాటు యోగా శిక్షణా తరగతులు నిర్వహించారు. ముగింపు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళికి శాంతిని చేకూర్చే దివ్యౌషధం యోగా మాత్రమే అని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అదేవిధంగా ప్రపంచమంతా యుద్ధాలతో, పరస్పర దాడులతో భయానక వాతావరణంలో, భయం గుప్పిట్లో సతమతమవుతోందని చెప్పారు. నేడు ప్రపంచమంతా యోగ సాధనకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రపంచానికంతటికి మన దేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భారతీయులమైన మనం తప్పనిసరి యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మానవునికి శారీరకమైన, మానసికమైన పరిపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్య ప్రదాయిని యోగా అని , యోగ శిక్షణ,ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం పట్ల అవగాహన కల్పించారు. వ్యక్తిగత ఆరోగ్యం బాగుంటేనే సామాజిక ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని
తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని హార్ట్ ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు ఉపేందర్, నరసింహచారి అన్నారు. 80 మంది శిక్షార్థులు ఈ మూడు రోజుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. వివేకానంద యోగ శిక్షణా కేంద్రం, అంతర్జాతీయ ధ్యాన సంస్థ హార్ట్ ఫుల్నేస్ సంస్థ ఆధ్వర్యంలో యోగ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా యోగ శిక్షకులు బండిరాజుల శంకర్ ను శిక్షార్థులు ఘనంగా శాలువాలతో సత్కరించారు.



