Tuesday, June 23, 2026
E-PAPER
Homeజిల్లాలుకాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: మాజీ మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: మాజీ మంత్రి హరీష్ రావు

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలికాడని, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అవుతున్నా.. రైతు రుణమాఫీ చేయడం లేదని, రైతులను తీవ్రంగా మోసం చేశాడని భారత రాష్ట్ర సమితి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం అచ్చంపేట పట్టణంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఇంట్లో ఆడ పిల్ల పెళ్లి జరిగితే తులం బంగారం ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎకరాకు రూ.15,000 రైతుబంధు ఇస్తామని, రూ.29,300 కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఫీజు రీఎంబర్స్మెంట్స్,  కాంట్రాక్టర్లకు బకాయిలు తీవ్రంగా పేరుకుపోయాయని గుర్తు చేశారు.

కరోనా సమయంలో రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు ఇబ్బందులు పడకూడదని, 11 విడతలలో రూ.73,000 కోట్లు రైతుబంధు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేసులు పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మాపై ఎలాంటి కేసులు పెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం కానీ భయపడేది లేదని అన్నారు.

అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ,  కెసిఆర్ పై అభిమానంతో ఓ నాయకునికి  ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొస్తే.. ఆయన పార్టీ మారడం సిగ్గుచేటు అన్నారు. అయినప్పటికీ పార్టీపై నమ్మకంతో అభిమానంతో కార్యకర్తలు పార్టీలో  కొనసాగుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కార్యకర్తలు మాత్రం కేసీఆర్ వెంట, పార్టీవెంటే ఉన్నారని అన్నారు. కార్యకర్తలకు ఉన్న ఇంకిత జ్ఞానం కూడా పార్టీ మారిన నాయకులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను, పార్టీ నాయకులను ఆయన అభినందించారు.

బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రెండు మూడుసార్లు కరెంటు పోయిందనీ, దీనిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. కెసిఆర్ ప్రభుత్వంలో రెప్పపాటు సమయంలో కూడా కరెంటు పోలేదని మరోసారి గుర్తుచేశారు. వచ్చే 2028 ఎన్నికలలో కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడిస్తామని, బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని, అధికారంలోకి భారత రాష్ట్ర సమితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే మర్రి  జనార్దన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -