Tuesday, June 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలు సానుకూలం

చర్చలు సానుకూలం

- Advertisement -

ముగిసిన ఉన్నత స్థాయి సమావేశం
తుది ఒప్పందం కోసం కార్యాచరణ ప్రణాళిక
లెబనాన్‌లో ఘర్షణల నివారణకు సెల్‌ ఏర్పాటు
సాంకేతిక అంశాలపై సంప్రదింపులు ప్రారంభం

నవ తెలంగాణ-జనరల్‌ డెస్క్‌
మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్‌ మధ్య స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో ఆదివారం ప్రారంభమైన ఉన్నత స్థాయి చర్చలు సోమవారం ఉదయం ముగిశాయి. ఈ వారంలో సాంకేతిక స్థాయి చర్చలను కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. లెబనాన్‌లో జరుగుతున్న పోరును నివారించడానికి ఓ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం కుదిరింది. ఈ మేరకు మధ్యవర్తిత్వ దేశాలైన పాకిస్తాన్‌, ఖతార్‌ విదేశాంగ శాఖలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. అరవై రోజులలో తుది ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలుగా ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని ఆ ప్రకటన తెలియజేసింది. సంప్రదింపులు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని వివరించింది. చర్చలలో ఇరాన్‌, అమెరికా ప్రతినిధి బృందాలతో పాటు పాకిస్తాన్‌, ఖతార్‌ నేతలు కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం ఆయా దేశాల ప్రతినిధి బృందాలు స్విట్జర్లాండ్‌ నుంచి తిరుగుముఖం పట్టాయి. సాంకేతిక, నిపుణుల స్థాయి బృందాలు చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.

కీలక పరిణామాలు ఇవే
ఆదివారం జరిగిన చర్చలలో చోటుచేసుకున్న కీలక పరిణామం ఏమిటంటే రాజకీయ పర్యవేక్షణతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం. ఇరాన్‌ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలు, వివాదాల పరిష్కారం వంటి అంశాలపై తదుపరి సాంకేతిక చర్చలను తక్షణమే ప్రారంభించడానికి ఈ కమిటీ పునాది వేస్తుంది. లెబనాన్‌లో ఘర్షణల నివారణ కోసం ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా కీలకమైనదే. లెబనాన్‌లో ఘర్షణలను నివారించే విషయంలో ఈ సమావేశం మంచి పురోగతి సాధించిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలియజేశారు. ఇరాన్‌ చమురుపై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసిందని, స్తంభింపజేసిన కొన్ని ఆస్తులను విడుదల చేసిందని చెప్పారు. ఇరాన్‌ పునర్నిర్మాణం-అభివృద్ధి ప్రణాళిక కూడా మొదలైందని అన్నారు. కాగా హార్ముజ్‌ జలసంధి కోసం ‘లైన్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌’ను ఏర్పాటు చేయడం జరిగిందని మధ్యవర్తులు తెలిపారు. రానున్న చర్చలలో భాగంగా దక్షిణ లెబనాన్‌లోని చిన్న చిన్న ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలిగే విషయంపై ప్రకటన చేయాలని ఇజ్రాయిల్‌ భావిస్తోందని తెలుస్తోంది.

చర్చల సరళిపై లెబనాన్‌ అధ్యక్షుడి ఆరా
స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చలపై లెబనాన్‌ అధ్యక్షుడు జోసఫ్‌ ఔన్‌ ఆరా తీశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఖతార్‌ ప్రధాని మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌రహమాన్‌ అల్‌-థానీలతో ఆయన మాట్లాడారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఇజ్రాయిల్‌ సైనిక చర్యల నిలిపివేత వంటి అంశాలతో పాటు ఘర్షణల నివారణ కోసం ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కూడా వారితో చర్చించారు. చర్చలలో అమెరికా పక్షాన పాల్గొన్న ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌కు కూడా ఔన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. కాగా లెబనాన్‌, అమెరికా ప్రతినిధుల మధ్య ఈ వారంలో వాషింగ్టన్‌ డీసీలో తాజాగా చర్చలు జరుగుతాయి.

ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ నిరసన
కొద్ది రోజుల క్రితం కుదిరిన శాంతి ఒప్పందానికి విఘాతం కలిగించేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన బెదిరింపులపై ఇరాన్‌ ప్రతినిధి బృందం తన నిరసనను వ్యక్తం చేసిందని, ట్రంప్‌ మౌఖిక హెచ్చరికలపై ఏ విధంగా స్పందించాలన్న విషయాన్ని పరిశీలిస్తోందని తస్నిమ్‌ వార్తా సంస్థ తెలిపింది. బెదిరింపు ఏ రూపంలో చేసినా అది ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లుగానే భావిస్తామని ఇరాన్‌ అధికారులు స్పష్టం చేశారు. ట్రంప్‌ ఆదివారం తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ హిజ్బొల్లాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘దండిగా డబ్బు తీసుకొని లెబనాన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాక్సీలను ఇరాన్‌ ఆపని పక్షంలో ఆ దేశంపై గత వారం చేసినట్లుగానే…ఈసారి మరింత తీవ్రంగా దాడులు చేస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇరాన్‌పై మండిపడ్డారు. హార్ముజ్‌ను ఇరాన్‌ మూసివేస్తే ఆ దేశాన్ని అమెరికా తునాతునకలు చేస్తుందని బెదిరించారు. హార్ముజ్‌ను మూసివేస్తే ఇరాన్‌ అనే దేశమే ఉండబోదని చెప్పారు. టెహ్రాన్‌లో ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ మాట్లాడుతూ యురేనియం శుద్ధిని కొనసాగిస్తామని తెలిపారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ ‘ఆయన నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆయన దారికి రాకపోతే మేము ఆ దేశంలోని మిగిలిన భాగాన్ని స్వాధీనం చేసుకుంటాం’ అని అన్నారు. వేర్వేరు సందర్భాలలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు, బెదిరింపులపై ఇరాన్‌ ప్రతినిధి బృందం తీవ్రంగా స్పందించి అమెరికాకు తన నిరసన తెలియజేసింది.

ఉద్రిక్తతల ఉద్రిక్తతల మధ్యే…
తుది ఒప్పందంపై ఉద్రిక్తతల నడుమ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ట్రంప్‌ బెదిరింపులపై ఇరాన్‌ వైపు నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే మంచిదని ఇరాన్‌ చర్చల ప్రతినిధి మహమ్మద్‌ బాఘర్‌ ఖలీబఫ్‌చురక వేశారు. తగిన విధంగా స్పందించేందుకు తమ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని అంటూ ‘వారు మాటలు చెబుతూనే ఉంటారు…మేము చేతలలో చూపుతాం’ అని అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ఇరాన్‌ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడిన అనంతరం అబ్బాస్‌ అరాగ్చీ తన సహచర ప్రతినిధులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. ఇరాన్‌ ప్రతినిధుల చర్యకు షరీఫ్‌ నివ్వెరపోయారు. ఇదంతా చూస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పాకిస్తాన్‌ ప్రతినిధి బృందం వద్దకు వెళ్లి ఏదో మాట్లాడారు. చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఏర్పాటు చేసిన పశ్చిమ దేశాల పాత్రికేయుల సమావేశానికి కూడా ఇరాన్‌ ప్రతినిధులు హాజరు కాలేదు. చర్చల ప్రారంభానికి ముందే ఉద్రిక్త వాతావరణం కన్పించిందని ఇరాన్‌ మీడియా తెలిపింది. అమెరికా ప్రతినిధులతో కలిసి ఫొటో దిగేందుకు ఇరాన్‌ నేతలు నిరాకరించారు. అదంతా ‘అమెరికా మీడియా షో’ అని ఎద్దేవా చేశారు. అయితే ఆ తర్వాత 80 నిమిషాల పాటు చర్చలు కొనసాగాయని ఇరాన్‌ అధికారులు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -