పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన
కొత్త నాయకుడిని ఎన్నుకోవాలంటూ పార్టీకి విజ్ఞప్తి
పదేండ్లలో ఆరుగురు పీఎంల మార్పు
లండన్ : బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్టార్మర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా దివాలా స్థితిలో ఉందని చెప్పారు. పార్టీలో పాతుకుపోయిన యూదు వ్యతిరేక విష బీజాలను పారద్రోలి, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని స్టార్మర్ వివరించారు. రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్టార్మర్ తెలిపారు. పదవిలో ఉన్నంత కాలం విలువలకు కట్టుబడి పని చేసినట్టు చెప్పారు.
“లేబర్ పార్టీని ముందుకు నడిపించడానికి ఎవరు అత్యంత సమర్థులు అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని నడిపించడానికి నేను సరైన వ్యక్తినా అని పార్టీ ప్రశ్నించింది. నా పార్టీ సహచరుల నుంచి అందుకు సమాధానాన్ని నేను విన్నాను. దానిని అంగీకరిస్తున్నాను. అందుకే నేను లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక నా దేశం పట్ల ఉన్న ప్రేమే ప్రధానంగా నిలిచింది. ఇప్పటికే నా నిర్ణయాన్ని తెలిపేందుకు ఉదయం రాజుతో మాట్లాడాను. సెప్టెంబరులో జరగబోయే తదుపరి పార్లమెంటు సమావేశాలకు ముందే కొత్త నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాలని లేబర్ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ను కోరుతాను. లేబర్ పార్టీకి రెండోసారి అధికారం దక్కేలా చూసేందుకు, మరింత బలమైన బ్రిటన్‌ను వారసత్వంగా స్వీకరించబోతున్న నా వారసుడికి నేను పూర్తి మద్దతు ఇస్తాను. ఇప్పటి వరకు నాకు సహకారం అందించిన సహచరులందరికీ వారి మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని కీర్ స్టార్మర్ తెలిపారు.
‘కొత్త నాయకుడి ఎంపిక కోసం ప్రక్రియను ప్రారంభించాలి’
లేబర్ పార్టీ కొత్త నాయకుడి ఎంపిక కోసం ప్రక్రియను ప్రారంభించాలని స్టార్మర్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని కోరారు. దీని ప్రకారం జూలై 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై జులై 16 నాటికి గడువు ముగుస్తుంది. కొత్త నాయకుడిగా బర్న్‌హామ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 300కు చేరుకుంది. ఇటీవల కాలంలో లేబర్ పార్టీకి ప్రజాదరణ తగ్గుతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రిఫార్మ్ యూకే పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్నట్టు తెలిపాయి. దాదాపు పదేండ్ల కాలంలో బ్రిటన్‌లో ఆరుగురు ప్రధానులు మారారు.
మంత్రులతోపాటు సొంత పార్టీ ఎంపీల నుంచి ఒత్తిడి
2024లో కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి పేలవమైన ఫలితాలు రావడం, మేకర్‌ఫీల్డ్ పార్లమెంటరీ ఉపఎన్నికలో బర్న్‌హామ్ ఘన విజయం సాధించడంతో స్టార్మర్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా ఎప్‌స్టీన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితుడు పీటర్ మాండెల్సన్‌ను అమెరికాకు యూకే రాయబారిగా నియమించాలనే స్టార్మర్ నిర్ణయంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్టార్మర్ ప్రధాని పదవి నుంచి వైదొలగాలని సహచర మంత్రులతోపాటు సొంత పార్టీ ఎంపీల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ తాను పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని చెబుతూ వచ్చిన స్టార్మర్, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



