Tuesday, June 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమీసేవ కేంద్రాల్లో డిజిటల్ విధానం.!

మీసేవ కేంద్రాల్లో డిజిటల్ విధానం.!

- Advertisement -

కాగితపు రసీదులకు చెల్లుబాటు
నవతెలంగాణ – మల్హర్ రావు

మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చే కాగితపు రశీదులకు కాలం చెల్లింది. పేపర్ లెస్ పాలనలో భాగంగా మీసేవ కేంద్రాల్లో ఈ నెల 19 నుంచి డిజిటల్ రశీదుల విధానం అమల్లోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (మీసేవ) కమిషనర్ ఆదేశాల మేరకు..ఇకపై కాగితపు ప్రింట్లకు బదులుగా దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబరు ఎస్ఎంఎస్ ద్వారా అక్నాలెడ్జ్మెంట్ హైపర్ లింక్ వస్తుంది. పాత పద్ధతిలో ప్రింట్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎస్ఎంఎస్ డిలిటైనా తిరిగి పంపించే సౌకర్యం..
మొబైల్ కు వచ్చిన ఎస్ఎంఎస్ పారపాటున డిలిట్ అయినా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీసేవ ఆప్లికేషన్లో సదరు ఎస్ఎంఎస్ ను తిరిగి పంపించే సౌకర్యాన్ని కల్పించారు. దరఖాస్తుదారులు కోరితే ఆపరేటర్లు మళ్లీ మెసేజ్ పంపేలా సహాయం అందిస్తారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
కొత్త నిబంధనల ప్రకారం మండలంలో మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తు దారుల నుంచి కచ్చితమైన,యాక్టివ్ ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. జూన్ 19 నుంచి ఎలాంటి ఫిజికల్ (కాగితపు) రశీదులను ప్రింట్ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి పాత పద్ధతిలోనే కాగితపు రసీదులు జారిచేస్తే సదరు మీసేవ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ ఉత్తర్వుల్లో హెచ్చరించారు.

మొబైల్, రశీదు లింక్..
కొత్త విధానం ప్రకారం..మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే, దరఖాస్తు దారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో అప్లికేషన్ నంబర్, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్ లింక్ ఉంటుంది. పౌరులు ఆ లింక్పై క్లిక్ చేసి తమ అక్నాలెడ్జ్ మెంట్ రశీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు..లేదా ప్రింట్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్ చేతికి వచ్చే వరకు ఈ ఎస్ఎంఎస్ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల కాగితాలు పోగొట్టుకునే భయం ఉండదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -