నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రజాపాలన ప్రారంభమైన డిసెంబర్–2023 నుంచి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అశ్వారావుపేట మండలంలో మొత్తం 639 మంది లబ్ధిదారులకు రూ.6 కోట్ల 39 లక్షల 74 వేల 124 ప్రభుత్వ సహాయం అందించినట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తహశీల్దార్ దాసరి కిశోర్ అధ్యక్షతన నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వాసం రాణి, అశ్వారావుపేట ఫ్యాక్స్ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ కో-ఆప్షన్ కౌన్సిలర్ తగరం నిర్మల, అచ్యుతాపురం, గాండ్లగూడం, వేదాంతపురం సర్పంచ్ లు సరిహద్దులు పోలయ్య, ఆలీ బాబు, తోట వెంకటమ్మ, కాంగ్రెస్ జిల్లా నాయకులు తుమ్మ రాంబాబు, కోలా లక్ష్మీనారాయణ, వేముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



