Sunday, June 28, 2026
E-PAPER
Homeజోష్అమలిన ప్రేమకథ (ఎపిసోడ్ -3)

అమలిన ప్రేమకథ (ఎపిసోడ్ -3)

- Advertisement -

వీళ్ళ కూరగాయల కొట్టుకు అవసరం లేకున్నా వచ్చి విసిగించేవాడు. “టమాటా ఎంత అని అడుగుతాడు. అవి తెచ్చేలోపే అవి వద్దు బెండకాయ కావాలంటాడు. ఇవి తెచ్చే లోపే వంకాయలు కావాలంటాడు.” విసిగించి విసిగించి ఆమె వైపు అదోలా చూస్తూ ఏదో ఒకటి పట్టుకెళ్ళేవాడు.
అతనొచ్చినప్పుడల్లా ఇబ్బంది పడేది. ఇంట్లో అమ్మకు చెప్పే ధైర్యం లేనిది.ఇలాంటి విషయాలు అమ్మకు తెలిస్తే చదువు మానిపిస్తుంది అని లోలోపలే కుమిలిపోయేది. అతని గురించి ఆలోచించి, ఆలోచించి మనసంతా ఒకటే దిగులు.

కాలేజీలో వందన ఈమె స్నేహితురాలు. నుస్రత్ ను చూసి ”ఏంటే ఈ మూడు, నాలుగు రోజులనుంచి అదోలా ఉన్నావు.ఏమైంది. నాతో చెప్పవే” అనేది.
అడిగి అడిగి నోరు నొప్పెడుతున్నా నుస్రత్ చెప్పకపోయేది.రోజు రోజుకీ బాలకృష్ణ ఆగడాలు మితిమీరిపోయాయి.ఆ  బాధ భరించే శక్తి లేక, ఓపిక లేక బాలకృష్ణ విషయం చెప్పేసింది.

వందన ఆ విషయాన్ని విని
ఇంత చిన్న విషయానికే అంత బాధపడుతున్నావేంటే ఏం లేదు నేను చెప్పినట్టు చెప్పేసెయ్ అంది.
నుస్రత్ కి ఎక్కడలేని ధైర్యమొచ్చింది. ఈ సారి వాడి అంతు చూస్తానే. చూడు వాడిని ఎట్లా ఆడుకుంటానో అని అప్పటిదాకా మూతిముడుచుకొని ఉన్న తను ప్రశాంతమైన నవ్వు నవ్వింది.


          ఆపద సమయంలో ఆదుకునే మిత్రుడొకడుంటే ఎవరం ఎక్కడా ఆగిపోము. మంచి మిత్రుడిని పొందటం ఎంత వరమో.చెడ్డమిత్రున్ని వదులుకోవటం కూడా అంతే వరం. వందన లాంటి మంచి మిత్రురాలు నుస్రత్కు లభించటం ఆమె చేసుకున్న అదృష్టం.

       రోజూలాగే సాయంత్రం కాలేజినుంచి ఇంటికెళ్ళి పనులు చేసుకుంటుంది. మార్కెట్ కు వెళ్ళిన అమ్మ ఇంకా తిరిగి రాలే.ఇవన్నీ గమనించిన బాలకృష్ణ వీళ్ళ ఇంటికి కూరగాయల కోసం వచ్చాడు. ఎవరు లేరని తెలుసు కాబట్టి మళ్ళీ అవితే , ఇవితే అని ఇబ్బంది పెడుతున్నాడు.ఓపికగా తెచ్చి ఇస్తుంది.మళ్ళీ కాదంటే తీసుకుపోతుంది.

    చివరకి విసుగొచ్చి అసలు నీకు కూరగాయలు కావాలా? నేను కావాలా?
ఏంటి నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఇబ్బంది పెడుతున్నావు. ఏదోలే అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నవు. ఇట్లనే నన్ను సతాయించినవనుకో మా బాబాయి అలీసాబ్ కు చెప్పాల్సి వస్తది. తెలుసుగా మా బాబాయి సంగతి అని వార్నింగ్ పెట్టింది.అలీసాబ్ గురించి అతనికి తెలుసు. పైగా ఆ ఊరు కుర్రాడే.

          ఆ మాటలు విన్నడో లేదో అరక్షణంలో అక్కడినుంచి మాయమై పోయిండు.ఈ ఆలోచన ముందు నుస్రత్ కి తట్టలే. ఒత్తిడిలోనో ,బాధలోనో ఉన్నవాళ్ళకి అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం తోచదు.
     “అందుకే మనల్ని అర్థం చేసుకునే స్నేహితులు ఉండాలి. మన బాధను పంచుకొని మనల్ని ఓదార్చే అసలు సిసలు మిత్రులు ఉండాలి.”

“వందన కూడా చేసిందదే.”

     ఈ రోజుల్లో ఎంత అర్థమయ్యేట్టు చెప్పినా ఎవడూ అర్థం చేసుకోడు. వద్దని చెప్పినా వినటం లేదంటే వాడు ఉన్మాదం వైపుగా అడుగులేస్తున్నాడని అర్థం. ప్రేమంటే ఒక్కడిది కాదు.ఒక్కరే కాదు. రెండు మనసుల సంగమం. నో..నో..అని చెప్పినా వినటం లేదు. పైగా ఆసిడ్ దాడులు,అత్యాచారాలు.ప్రేమ ఎప్పుడు బతుకునే కోరుకుంటుంది. అది చావు దాకా వచ్చిందంటే అది ఉన్మాదం. అంతకు మించిన పైశాచికత్వం.

“వద్దు అంటే వద్దనే భావించాలి.
ఇష్టం లేదు అంటే అంతటితో ఆగిపోవాలి.
నీ వలన ఎక్కడ ఇబ్బంది కలిగినా అక్కడిక ఆపేయాలి.”

“ఆగిపోవటం, ఆపేయటం క్రమశిక్షణే.”
బండ్లకే కాదు మనుషులకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి.

                        * * * * * *
                    నుస్రత్ బాబాయి  అలీసాబ్
మామూలువాడు కాదు. పరువు కోసం ప్రాణాలను కూడా లెక్కచేయడు. వాళ్ళ అత్తమ్మ ఒక దళిత కుటుంబానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది.
రవి అనే అబ్బాయిని ప్రేమించానని అతన్నే పెళ్ళి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఇంకోసారి అతని మాట ఎత్తకూడదని, పెళ్ళి గిళ్ళి అంటే మా శవాన్ని చూస్తావు అని ఇంట్లో వాళ్ళు బెదిరించారు.

ఆమెను ప్రేమించినతని పేరు రవి. పెద్దగా చదువుకోలేదు. రోజు కూలీ డ్రైవర్ గా పని చేసేవాడు.
వాళ్ళ ఊరుకి ఆ పక్కనే ఉన్న పట్నానికి జీబు నడిపేవాడు. ఎవరు పట్నానికి వెళ్ళాలన్న రవి జీబే ఎక్కేవారు. రజియా టైలరింగ్ నేర్చుకోవడానికి పట్నం పోయేది. దాదాపుగా రోజూ ఒకరికొకరు ఎదురుపడేవారు. రవి పెద్దగా చదువుకోలేదు కానీ మనిషి ఎంతో మంచివాడు. లేనోళ్ళను గమనించుకొని ఒక్కోసారి పైసలివ్వకున్న వదిలేసేవాడు. ముసలివాళ్ళెవరయినా జీబు ఎక్కితే వాళ్ళను జాగ్రత్తగా దించేవాడు. పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళకేమయినా కొనిచ్చిన ఊకుంచేవాడు. ఎప్పుడూ నవ్వేవాడు. నవ్వించేవాడు.

రజియా వస్తూ పోతున్నప్పుడు ఈ విషయాలు గమనించేది. మాటలు కలిశాయి. మనసులు కలిశాయి. ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎందుకు విడిపోతుందో చెప్పలేము. ఉన్న కొంతకాలమైనా అతనితోనే బతకాలని ఆమె, ఆమె కోసమే నా జీవితమని అతడు పరిచయమైన కొద్ది కాలానికే ఎందుకు అంతలా ఆరాటపడతారో
తెలుసుకోవాలంటే ప్రేమికుడిగా మారిపోవాల్సిందే. ప్రేమ కన్నులను తాకించుకొని ఈ లోకాన్ని చూడాల్సిందే.

ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. “ఇంట్లో చెబుతానని, వాళ్ళు ఒప్పుకుంటారని, నేనంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమని” రజియా రవితో చెప్పింది.రవి ఆనందానికి అవధులు లేవు. రవి కుటుంబాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి అమ్మ,నాన్న ఇతని మాట కాదనరు. ఇంత ధైర్యంగా చెప్పేసరికి ఇంకా నమ్మకం పెరిగింది.

నిజానికి ప్రేమ ఒక స్థాయి వరకే అబ్బాయిల చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయిలే ఆ పడవను ఒడ్డుకు చేర్చాలి. కొన్ని పడవలే ఒడ్డుకు చేరేవి. కొన్ని మధ్యలోనే మునిగిపోతాయి.కొన్నింటిని కులం పేరు, మతం పేర ముంచేసే వాళ్ళు లేకపోలేదు.కానీ రవికెందుకో తన ప్రేమ పడవ ఒడ్డుకు చేరుతుందనే గట్టి నమ్మకం.

రజియా ఇంట్లో వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసింది. కులం వేరు, మతం వేరు అంటూ అన్నయ్య అలీసాబ్ మందలించాడు.మంచి సంబంధం చూశానని ఈ నెలలోనే నిశ్చితార్థం అనుకుంటున్నాని బతిమాలుతాడు.జీవితం గురించి అతడు కన్న కలల గూర్చి ఆమెకు వివరించే ప్రయత్నం చేస్తాడు.

చెల్లెలు గురించి అన్న కనే కల కావచ్చు. అమ్మకనే కల కావచ్చు. తండ్రికనే కల కావచ్చు. అన్ని ఆమెను ముందుకు నడిపించే ఆలోచనలే. కానీ ఆమె హృదయమంతా రవే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -