Sunday, June 28, 2026
E-PAPER
Homeఖమ్మంనేల సంరక్షణే మన ఆరోగ్యం

నేల సంరక్షణే మన ఆరోగ్యం

- Advertisement -

– పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు
– రాయితీపై విత్తనాలు వినియోగించుకోవాలి
– వ్యవసాయ సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట

పంటల దిగుబడి, నాణ్యత పూర్తిగా నేల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ తెలిపారు. నేలలో సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉంటే మొక్కలకు అవసరమైన పోషకాలు సులభంగా అందుబాటులోకి వచ్చి పంటలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం అధికంగా రసాయన ఎరువులు, విచక్షణారహితంగా సస్యరక్షణ మందులు వినియోగించడం వల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ అవశేషాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతుల్లో తిరస్కరణకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.

నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రధాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట పైర్లను సాగు చేయడం అత్యంత ప్రయోజనకరమని వివరించారు. ఈ పంటలను 40 నుంచి 60 రోజుల దశలో నేలలో కలపడం ద్వారా సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం పెరిగి భూసారం మెరుగుపడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. వరి రైతులు జీలుగ, మెట్ట పంటలు సాగు చేసే రైతులు జనుము పంటలను సాగు చేసి భూసారం పెంపునకు కృషి చేయాలని సూచించారు.

పచ్చిరొట్ట సాగు వల్ల కలిగే ప్రయోజనాలు
నేలలో సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం పెరుగుతాయి.
సూక్ష్మజీవుల వృద్ధి వేగవంతమవుతుంది.
పంట వేర్లు పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి.
నేలలో గాలి ప్రసరణ, తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
రసాయన ఎరువుల వినియోగం తగ్గి సాగు ఖర్చులు తగ్గుతాయి.
చీడపీడల ఉధృతి తగ్గి సస్యరక్షణ మందుల అవసరం తగ్గుతుంది.
నాణ్యమైన, సురక్షితమైన వ్యవసాయ ఉత్పత్తులు సాధ్యమవుతాయి.

2025, 2026 వానాకాలాల్లో అశ్వారావుపేట డివిజన్‌లో రైతులు సాగు చేసిన పచ్చిరొట్ట పైర్ల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ఈ విధానాన్ని మరింత మంది రైతులు అవలంబించాలని వ్యవసాయ శాఖ పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -