Monday, June 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచల్లారని యుద్ధ జ్వాలలు

చల్లారని యుద్ధ జ్వాలలు

- Advertisement -

పరస్పర ఆరోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్న ఇరాన్‌, అమెరికా
దాడులు-ప్రతిదాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా

నవతెలంగాణ – జనరల్‌ డెస్క్‌
పశ్చిమాసియాలో రగిలిన యుద్ధ జ్వాలలు చల్లారే సూచనలు కన్పించడం లేదు. ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా సేనలు దాడులకు తెగబడగా వాటికి ప్రతిగా కువైట్‌, బహెరైన్‌ సహా పొరుగు దేశాలలోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. హార్ముజ్‌లో ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్‌ శనివారం దాడులు చేయడం తో దానికి ప్రతిగా ఇరాన్‌ సైనిక నిఘా సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, గగనతల రక్షణ సామర్థ్యాలు, డ్రోన్‌ నిల్వ కేంద్రాలు, మందుపాతరలు అమర్చే పడవలపై దాడులు చేశామని ఆదివారం తెల్లవారుజామున అమెరికా సైనిక కమాండ్‌ ప్రకటించింది. కాగా కువైట్‌లోని అల్‌ అసద్‌ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని రివల్యూ షనరీ గార్డులు తెలిపారు. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియలన్నీ నిలిచిపోతాయని శత్రువు తెలుసుకోవాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు లెబనాన్‌లో కూడా ఇజ్రాయిల్‌ సైన్యం, హిజ్బల్లా మధ్య పోరు కొనసాగుతోంది. హిజ్బల్లా ఉగ్రవాదులను హతమార్చామని, రాకెట్‌ లాంఛర్‌ను ధ్వంసం చేశామని ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది.

సైనిక చర్య జరిపితే ఇరాన్‌ అనేదే ఉండదు : ట్రంప్‌
హార్ముజ్‌ జలసంధి చుట్టూ ఉన్న ఇరాన్‌ స్థావరాలపై అమెరికా మరిన్ని దాడులు చేసింది. ఇరాన్‌ డ్రోన్‌ ప్రయోగం, కార్గో ఓడపై ఆ దేశం జరిపిన దాడికి ప్రతిగానే తానూ దాడులు చేశానని చెప్పింది. దాడులు-ప్రతి దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందంపై నీలినీడలు అలముకున్నాయి. ఇరాన్‌ దాడులు కొనసాగితే తీవ్ర ప్రతిఘటన తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. తాజా దాడులతో తామే పైచేయి సాధించామని చెప్పారు. ‘మేము ఇకపై సంయమనంతో వ్యవహరించే పరిస్థితి రాకపోవచ్చు. అప్పుడు మేము ఎంతో విజయవంతంగా ప్రారంభించిన పనిని సైనిక చర్య ద్వారా పూర్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడవచ్చు’ అని అన్నారు. ఒకవేళ అదే జరిగితే ఇరాన్‌ అనేదే ఉండదని తెలిపారు. ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఈ మేరకు పోస్ట్‌ పెట్టిన గంట తర్వాత ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఎదుర్కొంటున్నాయని కువైట్‌ సైన్యం ప్రకటించింది. బహెరైన్‌లో కూడా సైరన్లను మోగించారు.

హిజ్బొల్లాపై దాడులు చేయండి : 
సిరియాకు ట్రంప్‌ సూచన
ఇరాన్‌ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బల్లాపై దాడులు చేయాలంటూ సిరియాకు ట్రంప్‌ సూచించారు. ఆయన వ్యాఖ్య మధ్యప్రాచ్యంలో పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం విషయంలో అధ్యక్షభవనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్య చేశారు. సిరియా నియంతృత్వ అధ్యక్షుడు బషర్‌ అసద్‌ను పదవీచ్యుతుడిని చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తిరుగుబాటుదారులే హిజ్బల్లా భరతం పట్టగలరని, ఇజ్రాయిల్‌ సేనల కంటే వారు దృఢంగా పోరాడగలరని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అయితే సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షరా మాత్రం తాము ఆ పని చేయబోమని తేల్చి చెప్పారు. కాగా ట్రంప్‌ ప్రకటన ఇజ్రాయిల్‌లో కూడా ఆందోళన రేపుతోంది. అల్‌-షరా అధికారం చేపట్టిన నాటి నుంచే ఇజ్రాయిల్‌ ప్రభుత్వాన్ని అనుమానంగా చూస్తు న్నారు. అల్‌-షరా ప్రభుత్వానికి మద్దతుదారైన తుర్కియేకు, ఇజ్రాయిల్‌కు మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వీటికి సిరియా కూడా వేదికగా మారింది.

హార్ముజ్‌లో అమెరికా జోక్యమే ఉద్రిక్తతలకు కారణం : అరాగ్చీ
అమెరికా దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ ఆరోపించింది. దౌత్య ప్రక్రియలన్నీ పూర్తిగా నిలిచిపోయా యని, అందుకే దాడులు జరుగుతున్నాయని ఐఆర్‌జీసీ తెలిపింది. హార్ముజ్‌ సమీపంలో అమెరికా జరుపుతున్న దాడులకు స్పందనగా పొరుగు దేశాలలోని వాషింగ్టన్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోందని వివరిం చింది. కీలక హార్ముజ్‌ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యం చేసుకోవడమే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తెలిపారు. అవరోధాలు తొలగిపోతే ఇరాన్‌ నిర్వహణ కింద హార్ముజ్‌ను 30 రోజులలోనే యుద్ధానికి ముందున్న స్థితికి తీసుకొస్తామని చెప్పారు. లెబనాన్‌లో సహా అన్ని ప్రాంతాలలోనూ పోరు ఆగిపోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులను ఆపి కాల్పుల విరమణను అమలు చేయాల్సిన బాధ్యత అమెరికాదేనని అన్నారు. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్‌ సేనలు వైదొలిగేలా చూడాల్సింది కూడా అమెరికాయేనని తెలిపారు.

గల్ఫ్‌ దేశాల ఆగ్రహం
హార్ముజ్‌ నిర్వహణపై ఆధిపత్యం కోసం ఇరాన్‌, అమెరికా తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ పట్టాలు తప్పుతోంది. గత మూడు రోజులుగా ఇరాన్‌, అమెరికా సేనలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తమపై ఇరాన్‌ జరుపుతున్న తాజా దాడులను బహెరైన్‌, కువైట్‌ సహా ప్రాంతీయ దేశాలు ఖండించాయి. ఇరాన్‌ తమపై అనేక క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిందని, ఇది ప్రమాదకరమై దురాక్రమణ అని బహెరైన్‌ ఆరోపించింది. ఇరాన్‌ దాడిలో ఓ జనావాస భవనం బాగా దెబ్బతిన్నదని తెలిపింది. తమ సార్వభౌమత్వాన్ని ఇరాన్‌ ఉల్లంఘిస్తోందని, పదేపదే దాడులు చేస్తోందని కువైట్‌ మండిపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -