న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ‘మేడ్ ఇన్ ఇండియా’ గస్తీ నౌకతో పాటు ఆరు అంబులెన్సులు, పది యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ పడవలను సీషెల్స్‌కు అప్పగించారు. సీషెల్ ద్వీప దేశం యొక్క సముద్ర భద్రతకు, అభివృద్ధి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉన్నదని చెప్పారు. సీషెల్‌లో అధికారిక పర్యటన జరుపుతున్న ప్రధాని మోడీ గస్తీ నౌకను, ఇతర సామగ్రిని సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీకి అప్పగించారు. ఆ వివరాలను మోడీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలియజేస్తూ గస్తీ నౌక అప్పగింత రక్షణ, సముద్ర రంగాలలో పెరుగుతున్న ద్వైపాక్షిక భాగస్వామ్యంలో మరో మైలురాయి అని పేర్కొన్నారు. ‘ఒక విశ్వసనీయ భాగస్వామిగా సీషెల్స్‌తో భుజం భుజం కలిపి నిలబడడానికి భారత్ గర్విస్తోంది. శాశ్వత స్నేహాన్ని మరింతగా దృఢతరం చేసుకోవడానికి, ఉమ్మడి సముద్ర సామర్ధ్యాలను బలోపేతం చేసుకోవడానికి కలిసి పనిచేస్తాం’ అని అన్నారు. సీషెల్స్‌లో జరిగే స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు మోడీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. తన పర్యటనలో ఆయన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. సీషెల్స్‌లో మోడీ పర్యటించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ప్రారంభంలో సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ భారత్ లో పర్యటించిన విషయం తెలిసిందే.



