జపాన్‌లో మరో భూకంపం…

EarthQuakeనవతెలంగాణ – టోక్యో: వారం రోజుల క్రితం భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని మరువక ముందే జపాన్‌ను మరోసారి భూప్రకంపనలు బెంబేలెత్తించాయి. నైగటా, ఇష్క్‌వారా ప్రాంతాల్లోని సముద్ర తీరం వెంబడి దాదాపు రిక్టర్‌ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించినట్లు అక్కడి వాతావరణ సంస్థ వెల్లడించింది. సునామీ ముప్పేం లేదని స్పష్టం చేసింది. తాజా పరిణామంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. జనవరి 1న ప్రకంపనలు సంభవించిన ప్రాంతంలోనే భూమి కంపించడం ఆందోళన కలిగిస్తోంది. న్యూ ఇయర్‌ రోజున 7.6 తీవ్రతతో ఏర్పడిన భూకంపం జపాన్‌ దేశానికి తీవ్ర నష్టం చేకూర్చిన సంగతి తెలిసిందే. దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుజు, వాజిమా నగరాల్లో చాలా మంది బాధితులు ఇళ్ల శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు తెలిపాయి. మరోవైపు అస్తవ్యస్థమైన రహదారులను పునరుద్ధరించేందుకు ఇప్పటికీ అక్కడి సహాయక బృందాలు శ్రమిస్తూనే ఉన్నాయి. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 400 పునరావాస కేంద్రాల్లో 30 వేల మందికిపైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికీ తాగునీరు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించడం సాధ్యపడలేదు.

Spread the love