Monday, June 29, 2026
E-PAPER
Homeజాతీయంపాక్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారం

పాక్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారం

- Advertisement -

తీవ్రంగా ఖండించిన భారత్‌
ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకోవాలని హితవు
​న్యూఢిల్లీ : ‌
పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలను భారత్‌ ‌తీవ్రంగా ఖండించింది. కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆ దేశం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలను భారత్‌ ‌పూర్తిగా తిరస్కరిస్తోందని తెలిపారు. ఇతర దేశాలపై వేలెత్తి చూపడానికి బదులు పాకిస్తాన్‌ తన భూభాగంలో పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన పలు ప్రశ్నలకు స్పందించారు. తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించేందుకు పాకిస్తాన్‌ విశ్వసనీయ చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించే ధోరణిని విడనాడాలని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి కరాచీలోని సింధ్ రేంజర్స్ భిట్టాయ్ వింగ్ ప్రధాన కార్యాలయంపై భారీ ఉగ్రదాడి జరిగింది. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు వాహనాన్ని ప్రధాన గేటుకు ఢీకొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించారు. అనంతరం గ్రెనేడ్లు విసురుతూ కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదుల దాడికి రేంజర్స్ సిబ్బంది వెంటనే ప్రతిదాడి ప్రారంభించారు. అనంతరం స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ (ఎస్‌ఎస్‌యూ), యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ (ఏటీఎఫ్) కమాండోలు రంగంలోకి దిగడంతో సుమారు 90 నిమిషాల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో గాయపడిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -