Monday, June 29, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్య రామాలయ నిధుల అవినీతిపై నోరెత్తరేం

అయోధ్య రామాలయ నిధుల అవినీతిపై నోరెత్తరేం

- Advertisement -

టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మౌనంపై
సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
​అవినీతిపై బీజేపీని ప్రశ్నించాలి
​ఉపాధి హామీ పాత చట్టాన్ని పునరుద్ధరించాలి
రాజ్యహింసను ఆమోదిస్తే
పౌరహక్కులు ఉండవు సర్ తో మోడీ కుట్ర : యు.వాసుకి
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి
యూఎస్ ట్రేడ్ డీల్ తో రైతులకు తీవ్ర నష్టం

అమరావతి : అయోధ్య రామాలయానికి దాతలిచ్చిన నిధులలో జరిగిన అవినీతిపై రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు నోరెత్తడం లేదని, హిందూ ధర్మం గురించి పదే పదే చెబుతున్న నాయకులు ఇప్పుడు రామమందిర అవినీతిపై బీజేపీని ప్రశ్నించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు యు.వాసుకి, కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవితో కలిసి ఆయన మాట్లాడారు. అయోధ్య రామమందిర విరాళాల అవినీతి విషయంలో ఇప్పటికే ట్రస్టు కార్యదర్శి రాజీనామా చేశారని, మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంలో దిగువస్థాయిలో ఉన్న ఎనిమిది మందిని నిందితులుగా చూపించడం ద్వారా అసలు నిందితులను కాపాడే కుట్ర జరుగుతోందని, సిట్ విచారణ కూడా ఇదే పద్ధతిలో ఉందని అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. లేనిపక్షంలో కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా కేంద్రం ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి చిన్న విషయంపై మన్‌కీబాత్‌లో మాట్లాడే ప్రధాని మోడీ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేవాలయం విషయంలో ముఖ్యపాత్ర పోషించిన మోడీ దీనికి సమాధానం చెప్పాలని కోరారు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన కూడా దీనిపై నోరెత్తడం లేదని విమర్శించారు. సనాతన ధర్మం, హిందూధర్మ పరిరక్షణ అంటూ ప్రకటనలు చేసే నాయకులకు ఇప్పుడు అయోధ్య దేవాలయంలో అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహానాడులోనూ ధర్మ పరిరక్షణ అని మాట్లాడిన చంద్రబాబునాయుడు దీనిపై ఎన్డీఏలో బీజేపీని నిలదీయాలని అన్నారు. అక్కడ రామాలయం గురించి మాట్లాడితే ఇక్కడ దేవాలయాల్లో జరిగే అవినీతి అంశాలు బయటకు వస్తాయనే భయం ఉందనే అనుమానం కలుగుతోందని తెలిపారు. అలాగే వైసీపీ కూడా అయోధ్య రామమందిర అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఉపాధిహామీ చట్టంపై ఆందోళనలకు మద్దతు
వీబీ గ్రామ్‌ ‌జీ స్థానంలో పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని బి.వి. రాఘవులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయని, వాటిల్లో రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని వివరించారు. కేంద్రం ప్రతిపాదించిన విధంగా 60: 40 నిష్పత్తిలో నిధులు ఇస్తే ఈ పథకం అమలు సాధ్యం కాదని తెలిపారు. ఇచ్చే నిధులనూ కేంద్రం పూర్తిగా తగ్గించిందని, దీనివల్ల పనిదినాలు తగ్గిపోతాయని, రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పారు. గతంలో మాదిరిగా 90శాతం నిధులను కేంద్రం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. 25 రోజుల పనిదినాలు కల్పించలేమని చెప్పారని, ఇలాంటి అంశాలతో 13 రాష్ట్రాలు కేంద్రానికి ఉత్తరాలు కూడా రాశాయని, అయినా కేంద్రం పట్టించు కోవడం లేదని విమర్శించారు. 60 రోజుల సెలవు దినాలు అంటే ఉపాధిహామీ చట్టంలో కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. రాష్ట్రాల హక్కులు నాశనం అవుతుంటే ఎన్డీఏ లో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ కూటమి కూడా దీనిపై నోరు మెదపకపోవడం అన్యా యమని పేర్కొన్నారు. దీనిపై వ్యవసాయ కార్మిక సంఘం జాతీయస్థాయిలో ఆందోళ నకు పిలుపునిచ్చిందని, దీనికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తోందని చెప్పారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళనలకూ సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించడంతోపాటు పార్టీ శ్రేణులు కూడా ఆందోళనలో పాల్గొంటాయని తెలిపారు.
సర్ పేరుతో రాజకీయ కుట్ర : యు.వాసుకి
ఓటర్ల ప్రత్యేక సవరణ పేరుతో(ఎస్‌ఐఆర్‌) చేపడుతున్న కార్యక్రమం రాజకీయ కుట్ర పూరితమైందని, ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి ఏజెంటుగా తయారైందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు యు.వాసుకి అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుగా ఉన్న ఓటును తొలగించడం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. బీహార్‌‌లో ఐదు లక్షల మందికి ఓటు లేదనే పేరుతో రేషన్‌కార్డులు రద్దు చేశారని అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగించారని, అక్కడ పార్టీల గెలుపోటముల్లో ఇది కీలకంగా పనిచేసిందని తెలిపారు. ఈవీఎంలను కూడా బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుం టోందని అన్నారు. ఇన్ని జరుగుతున్నా ఎన్నికల కమిషన్ ఏమీ పట్టనట్లు వ్యవహ రిస్తోందని, తన స్వతంత్రతను కోల్పోతోందని విమర్శించారు. ఒకవైపు సర్‌ పేరుతో ఓట్లను తొలగించడంతోపాటు రెండోవైపు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ఎం‌పీలను బీజేపీ కొనుగోలు చేస్తోందని వివరించారు. టీఎంసీ నుంచి 20 మంది, శివసేన బాల్‌థాకరే వర్గం నుంచి ఆరుగురు ఎంపీలను కొన్నారని, తరువాత సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేలు టార్గెట్‌‌గా ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కూడా మార్చి హిందూ రాజ్యాంగంగా మార్చే ప్రయత్నం చేస్తోందని, దీనికి అవసరమైన సంఖ్యా బలాన్ని పార్లమెంటులో బీజేపీ తయారు చేసుకుంటోందని అన్నారు.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి
పార్లమెంటులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని, డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని వాసుకి డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) తొలి నుంచీ ఇదే డిమాండ్‌ చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే కోరుతున్నాయని తెలిపారు. లౌకిక పార్టీలు కూడా కలిసి ఐక్యంగా మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం పోరాడాలని అన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయడం ఇష్టం లేకనే బీజేపీ వేర్వేరు అంశాలతో ముడిపెడుతోందని పేర్కొన్నారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో తీవ్ర నష్టం
అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో రైతులకు తీవ్ర నష్టం కలిగించే అంశాలు ఉన్నాయని, రైతులు, కూలీలు కూడా నష్టపోతారని వాసుకి అన్నారు. ఇప్పటికే రైతులు కనీస గిట్టుబాటు ధరలు లేక, అప్పుల పాలయ్యే విధంగా అనేక ప్రమాదకర అంశాలను పెట్టారని తెలిపారు. ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, అదే సమయంలో రైతులకు పెద్దఎత్తున సబ్సిడీలు ఇచ్చే అమెరికాతో ఒప్పందం చేసుకుని అక్కడి ఉత్పత్తులను ఇక్కడకు తీసుకొచ్చి అమ్మితే భారత రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.

రాజ్యహింస అత్యంత ప్రమాదకరం
రాజ్య హింస అనేది అత్యంత ప్రమాదకరమని, రౌడీషీటర్లయినంత మాత్రాన కొట్టి చంపాలనేది ఏమీ లేదని, వారికి కోర్టుల ద్వారా చట్టపరిధిలో శిక్షలు వేయాలని బి.వి.రాఘవులు అన్నారు. విజయవాడలో సాయికృష్ణ హత్య రాజ్యవ్యవస్థ చేసిన అత్యంత దుర్మార్గమైన వ్యవహారమని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పోలీస్‌ స్టేష‌న్‌ ‌లోనే ఒక వ్యక్తిని కొట్టి చంపడం, శవం కూడా కనబడకుండా మాయం చేయడం అనేది పూర్తిగా రాజ్యహింస కిందకు వస్తుందని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమని, ప్రశ్నించ కపోతే మానవ హక్కులు అనేవి ఉండవని అన్నారు. ఒకసారి రాజ్యహింసను అంగీకరిస్తే పౌర హక్కులు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తుడు అయినంత మాత్రాన ఒక వ్యక్తిని చంపే హక్కు పోలీసులకు రాజ్యాంగం ఇచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ విషయం జరిగినా దానికి కులాన్ని అంటగట్టడం అనేది రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా మారిందని, ఈ పద్ధతి మారాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -