– బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో పాలక పక్షపు అహంకారం బూట్ల కింద రాజ్యాంగ హక్కులు నలిగిపోతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆధిపత్య కుల అహంకారానికి పసికందు బలైందని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో శాంతిభద్రతలు కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత పాలన కొనసాగిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ప్రయివేట్ సైన్యంగా మారిందని ఆరోపించారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు, అధికార పక్షానికి చెందిన భూస్వాముల అడుగులకు మడుగులొత్తుతున్నారని పేర్కొన్నారు. చనిపోయిన పసికందు కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి ఆ కుటుంబంపై ఎదురు కేసులు పెట్టి వేధించడం పరాకాష్ట అని విమర్శించారు. పోలీసులు యూనిఫాం వేసుకున్నారా లేక అధికార పార్టీ కండువాలు కప్పుకున్నారా?అని ప్రశ్నించారు. సొంత జిల్లాలో ఇంత ఘోరం జరిగినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోరు మెదపకపోవడం సరైంది కాదని తెలిపారు. నిందితులపై 103(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం చేసిన పోలీసులపై వేటు వేయాలనీ, బాధితులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. బాధితులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లించాలని తెలిపారు.
ఆధిపత్య అహంకారానికి పసికందు బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



