Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైద్యులు మానవత్వంతో పనిచేయాలి

వైద్యులు మానవత్వంతో పనిచేయాలి

- Advertisement -

నల్లగొండ మెడికల్‌ కళాశాలను ఉత్తమ కళాశాలగా తీర్చిదిద్దుతాం : వార్షికోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
డాక్టర్లు తెల్ల కోటుకు పరిమితం కాకుండా, మానవతా దృక్పథంతో పేదలకు వైద్య సేవలందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ‘అద్వితీ -2026’ పేరున నిర్వహించిన నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ వైద్యవృత్తి పవిత్రమైనదని అన్నారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల అన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయబడిందని, వైద్య కళాశాలలో చదివే విద్యార్థులు సబ్జెక్టులతో పాటు, మానవత్వాన్ని కూడా నేర్చుకోవాలని, తెల్ల కోటు బాధ్యతకు ‘సింబల్‌’అని అన్నారు. వైద్య కళాశాల విద్యార్థుల కోసం రెండు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులను పరిశోధన నిమిత్తం తన ఆస్పత్రిలో ప్రతి ఏడాది 45 మంది చొప్పున తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఎంఓయును త్వరలోనే కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దుతామని, 900 కోట్లతో అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో నల్గొండను స్మార్ట్‌ సిటీగా, మోడల్‌ సిటీగా చేస్తామని తెలిపారు. నల్లగొండ మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాలలో పేద ప్రజలకు సేవలు అందించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ డాక్టర్‌ వృత్తి పవిత్రమైందని, రోగులను పలకరించి వారికి వైద్యం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అమీర్‌ ఆశ్రఫ్‌ అలీ, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సత్యనారాయణ ,మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి ,మాజీ జెడ్పీటీసీి గుమ్మల మోహన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -