Wednesday, July 1, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్త్వరగా చేసేద్దాం…

త్వరగా చేసేద్దాం…

- Advertisement -

పిల్లలను స్కూల్స్‌కు సిద్ధం చేయడానికి ఇంట్లో రోజూ ఓ యుద్ధమే జరుగుతుంది. మరీ ముఖ్యంగా రోజూ ఉదయాన్నే లేచి టిఫెన్లు, స్నాక్స్‌ ‌వంటివి సిద్ధం చేయాలి. ఇంట్లో ఏం చేసినా పిల్లలు ఓ పట్టాన తినరు. రోజూ ఏదో ఒక వెరైటీ కావాలి. మనకేమో తొందరగా తయారైపోవాలి. మరి అలాంటి స్నాక్స్ ఏమున్నాయో, వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం…

మరమరాల మసాలా మిక్స్‌
కావల్సిన పదార్థాలు:
మరమరాలు – రెండు కప్పులు, ఉల్లి తరుగు – అర కప్పు, సన్నగా తరిగిన టొమాటో – పావు కప్పు, పచ్చిమిర్చి – ఒకటి, వేయించిన పల్లీలు – మూడు టేబుల్‌ స్పూన్లు, పుట్నాల పొడి, కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూన్‌ చొప్పున, నిమ్మరసం – ఒకటిన్నర స్పూన్లు, ఉప్పు – తగినంత, కారం – ముప్పావు స్పూన్, పసుపు – చిటికెడు, ఛాట్‌ మసాలా, ఆవాలు, జీలకర్ర – అర స్పూన్‌ చొప్పున, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – చిటికెడు, నూనె – రెండు స్పూన్లు
తయారు చేసే విధానం: మరమరాల్లో నీళ్లు పోసి వెంటనే వడకట్టాలి. ఎక్కువసేపు నానితే మెత్తగా పిండిలా అయిపోతాయి. ఈ తడిపిన మరమరాలను మిక్సింగ్‌ బౌల్‌లోకి తీయాలి. అందులో ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, పుట్నాల పొడి, పల్లీలు, కారం, ఉప్పు, పసుపు, ఛాట్‌ మసాలా, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి.. ఆవాలు జీలకర్ర, కరివేపాకు, ఇంగువ ఒక్కొక్కటిగా వేయాలి. ఈ తాలింపును మరమరాల మిశ్రమంలో కలిపితే సరిపోతుంది.

రవ్వ దోశ
కావల్సిన పదార్థాలు:
ఉప్మా రవ్వ – కప్పు, బియ్యప్పిండి – అర కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి – రెండు, అల్లం ముద్ద – అర స్పూన్, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, జీలకర్ర – ముప్పావు స్పూన్, మిరియాల పొడి – పావు స్పూన్, ఫ్రూట్‌ సాల్ట్‌ – అర స్పూన్‌ నూనె – దోశలు వేసేందుకు అవసరమైనంత
తయారు చేసే విధానం: వెడల్పాటి పాత్రలో రవ్వ, బియ్యప్పిండి, తగినన్ని నీళ్లు, ఉప్పు, పెరుగు, జీలకర్ర, మిరియాల పొడి వేసి పిండి కలపాలి. అందులో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముద్ద, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఫ్రూట్‌ సాల్ట్‌ జతచేసి మళ్లీ కలపాలి. పెనం వేడిచేసి.. కొద్దిగా నూనె రాయాలి. గరిటెడు పిండితో దోశ వేసి.. అంచుల చుట్టూ కాస్త నూనె వేయాలి. మధ్యస్థమైన సెగ మీద.. బంగారు రంగులోకి మారే వరకూ ఉంచి తీసేయాలి. తిరగేయాల్సిన పని లేదు. తక్కిన పిండితోనూ ఇలాగే దోశలు వేసుకోవాలి. పప్పు నానబెట్టడం, రుబ్బడం లాంటివి లేకుండా క్షణాల్లో దోశలు రెడీ అయిపోతాయి. వీటికి కొబ్బరి, టొమాటో, పుదీనా చట్నీ ఏదైనా బాగుంటుంది. పిండి కొంచెం పల్చగా ఉంటేనే దోశలు ఉల్లిపొరల్లా క్రిస్పీగా ఉంటాయి.

స్ప్రౌట్స్‌ ఛాట్‌
కావల్సిన పదార్థాలు:
మొలకెత్తిన శనగలు, పెసలు, పల్లీలు – ముప్పావు కప్పు చొప్పున, ఉల్లి తరుగు – పావు కప్పు, సన్నగా తరిగిన టొమాటో – గుప్పెడు, పచ్చిమిర్చి – ఒకటి, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం – టేబుల్‌ స్పూన్, ఉప్పు – తగినంత, కారం, ఛాట్‌ మసాలా – అర స్పూన్‌ చొప్పున, జీలకర్ర పొడి – పావు స్పూన్‌
తయారు చేసే విధానం: వెడల్పాటి పాత్రలో మొలకెత్తిన శనగలు, పెసలు, పల్లీలు, ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, ఛాట్‌ మసాలా, కారం, జీలకర్ర పొడి వేసి కలపాలి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర తరుగు జోడించి.. ఎగరేసినట్లు చేస్తే అన్నిటికీ మసాలా పడుతుంది. అంతే.. ‘స్ప్రౌట్స్‌ ఛాట్‌’ సిద్ధమైపోతుంది. ఇది సులువుగా చేసుకునే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌. ఇందులో అధిక ప్రోటీన్లుంటాయి. జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి మరింత మంచిది.

కాజూ పోహా
కావల్సిన పదార్థాలు:
అటుకులు – రెండు కప్పులు, ఉల్లి తరుగు – గుప్పెడు, ఆలూ – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, అల్లం – అంగుళం ముక్క, జీడిపప్పులు – మూడు టేబుల్‌ స్పూన్లు, పల్లీలు – చారెడు, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత, ఆవాలు – అర స్పూన్, శనగపప్పు – స్పూన్, పసుపు – పావు స్పూన్, నిమ్మరసం – స్పూన్, పంచదార – ముప్పావు స్పూన్, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె – రెండున్నర టేబుల్‌ స్పూన్లు
తయారు చేసే విధానం: ఆలూను చెక్కు తీసి ముక్కలు కోయాలి. అల్లం పొట్టు తీసి సన్నగా తరగాలి. అటుకులను కడిగి, వెంటనే నీళ్లు వడకట్టేయాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి.. ఆవాలు, శనగపప్పు, పల్లీలు వేయాలి. అవి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు జతచేయాలి. అందులో అల్లం, ఉల్లి తరుగులను చేర్చాలి. అవి బంగారు రంగులోకి మారాక జీడిపప్పులు, ఆలూ ముక్కలు, పసుపు, ఉప్పు, పంచదార, అటుకులు జోడించాలి. మూత పెట్టి సన్న సెగ మీద రెండు నిమిషాలుంచాలి. నిమ్మరసం జోడించి సెగ తీసేసి కొత్తిమీర తరుగు చల్లాలి. అంతే.. వేడి వేడి ‘కాజూ పోహా’ రుచిని ఆస్వాదించడమే తరువాయి. కొద్దిగా సన్న కారప్పూస చల్లితే.. మరింత టేస్టీగా ఉంటుంది.

వెజిటబుల్‌ ఆమ్లెట్‌
కావల్సిన పదార్థాలు:
శనగపిండి – అర కప్పు, బియ్యప్పిండి – టేబుల్‌ స్పూన్, సన్నగా తరిగిన టొమాటో, క్యారెట్లు – రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున, క్యాబేజీ, క్యాప్సికం తరుగు – టేబుల్‌ స్పూన్‌ చొప్పున, పచ్చిమిర్చి – ఒకటి, కొత్తిమీర తరుగు – గుప్పెడు, అల్లం ముద్ద – స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర, కారం – అర స్పూన్‌ చొప్పున, పసుపు – పావు స్పూన్,
నూనె – మూడు స్పూన్లు
తయారు చేసే విధానం: ఒక పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. అందులో తగినన్ని నీళ్లు, టొమాటో, క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర జతచేసి చిక్కటి దోశల పిండిలా కలపాలి. ఈ మిశ్రమంతో కాలుతున్న పెనం మీద కొంచెం మందంగా ఆమ్లెట్‌లా వేయాలి. లేత గోధుమ రంగులోకి మారాక తిరగేసి అటు కూడా కాలనివ్వాలి. ఇందులోకి టొమాటో సాస్‌ బాగుంటుంది. పుదీనా లేదా కొబ్బరి పచ్చడితోనైనా తినొచ్చు. మరింత క్రిస్పీగా ఉండాలంటే కొద్దిగా రవ్వ కలపవచ్చు. ఇంకొంచెం ప్రత్యేకమైన రుచి రావాలంటే కాస్తంత పెరుగు జోడించవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -