ఉదయం తినే అల్పాహారం రుచిగా, పర్ఫెక్ట్‌గా రావాలంటే కొన్ని చిన్న చిన్న మెళకువలు పాటించడం చాలా అవసరం. ఇడ్లీలు మృదువుగా, దోశలు క్రిస్పీగా, పూరీలు నూనె పీల్చకుండా రావడానికి చాలా సింపుల్ చిట్కాలు కొన్ని ఉన్నాయి.. అవేంటో చూద్దాం. మృదువైన ఇడ్లీల కోసం…. ఇడ్లీలు రాయిలా గట్టిగా వస్తున్నాయంటే పప్పు, రవ్వ నిష్పత్తిలో లోపం ఉన్నట్లు అర్థం. ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల ఇడ్లీ రవ్వ వాడాలి. పప్పు రుబ్బేటప్పుడు ఐస్ వాటర్ వాడితే పిండి వేడెక్కకుండా ఉంటుంది. పిండి రుబ్బిన తర్వాత కొద్దిగా అన్నం లేదా నానబెట్టిన అటుకులు కలిపితే ఇడ్లీలు మల్లెపూవుల్లా మెత్తగా వస్తాయి. హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ…. దోశ మెత్తగా, పిండి పిండిగా వస్తుంటే ఈ ట్రిక్ ట్రై చేయండి. దోశ పిండి రుబ్బేటప్పుడు అందులో గుప్పెడు శనగపప్పు, స్పూన్ మెంతులు కలిపి నానబెట్టాలి. పెనం పైన దోశ వేసే ముందు పెనం వేడిని సరిచూసుకోవాలి. పెనంపై నీళ్లు చల్లి తుడిచిన తర్వాత పిండి వేస్తే దోశలు ఎర్రగా, కరకరలాడుతూ వస్తాయి. నూనె పీల్చని పూరీలు…. పూరీ బాగా పొంగాలి, అలాగే నూనె ఎక్కువగా పీల్చకూడదు అంటే పిండి కలిపే విధానం మార్చాలి. పూరీ పిండి కలిపేటప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్మా రవ్వ (సూజి), కొద్దిగా నూనె కలపాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పూరీలు వేయించే ముందు నూనె బాగా వేడెక్కిన తర్వాతే వేయాలి. దీనివల్ల పూరీ పొంగుతుంది, నూనె తక్కువగా పీల్చుకుంటుంది. పిండి పులవకుండా … పిండి సరిగ్గా పులియకపోతే అల్పాహారాలు రుచిగా ఉండవు. చలికాలంలో పిండి త్వరగా పులవదు. అటువంటప్పుడు పిండి పాత్రను వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. పిండిలో ముందే ఉప్పు కలపకుండా, వాడే ముందు కలిపితే పిండి మరీ పుల్లగా అవ్వకుండా ఉంటుంది.



