Wednesday, July 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్ర ప్రభుత్వ సీఎస్ గా సంజయ్‌ జాజు

రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ గా సంజయ్‌ జాజు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)‌గా సంజయ్ జాజు మంగళవారం తన బాధ్యతలు స్వీకరించారు. సీఎస్‌గా బాధ్యతలు చేపట్టే ముందు ఆయన ఎంసీహెచ్‌ఆర్‌‌డీలో సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే. రామకృష్ణా రావు మంగళవారం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును సీఎస్‌‌గా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది ఆయనను పుష్పగుచ్ఛాలతో అభినందించారు.

2029 వరకు సర్వీస్‌‌లో…..
మధ్యప్రదేశ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్ర సర్వీసుల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మెకానికల్ ఇంజినీరింగ్​లో ఎంటెక్, ఎంబీఏ ఫైనాన్స్‌ పూర్తి చేశారు. క్షేత్రస్థాయి పోస్టులతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాలనాపరమైన ఉన్నత హోదాల్లో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ గవర్నెన్స్, పరిపాలనలో డిజిటల్ వినియోగంపై సంజయ్‌ జాజుకు పట్టుంది. ‘మీ సేవ’ను అందుబాటులోకి తీసుకురావటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్‌ జాజు 2014 నుంచి 2018 వరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఐదేండ్లపాటు రక్షణ శాఖలో జాయింట్ సెక్రెటరీ, అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. రెండేండ్ల నుంచి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన ఇటీవలే తెలంగాణ కేడర్‌కు తిరిగి వచ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్‌గా, కీలకమైన ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు సీఎంవోలో ఏర్పాటు చేసిన స్పీడ్ విభాగం సీఈవోగా, ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్‌ ప్రత్యేక సీఎస్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -