Wednesday, July 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనా చిన్నారులే లక్ష్యం

పాలస్తీనా చిన్నారులే లక్ష్యం

- Advertisement -

ఇజ్రాయిల్‌ను తప్పుపట్టిన ఐరాస నివేదిక
న్యూయార్క్ : 2023 అక్టోబర్ నుంచి జరుగుతున్న ఘర్షణలో పాలస్తీనా చిన్నారులనే ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకున్నదని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వేలెత్తి చూపింది. ఇజ్రాయిల్ దాడులలో చిన్నారులు పెద్ద సంఖ్యలో బలయ్యారని, మరణాల రేటు అసాధారణంగా ఉన్నదని తెలిపింది. కాగా తూర్పు జెరుసలేం, ఇజ్రాయిల్ సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై ఐరాస స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు కమిషన్ రూపొందించిన ఈ నివేదికను ఇజ్రాయిల్ తోసిపుచ్చింది. గాజా, తూర్పు జెరుసలేంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో 2021 మేలో ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేసినప్పటి నుంచి శిశు మరణాలు సహా చోటుచేసుకున్న అనేక పరిణామాలపై ఈ కమిషన్ అనేక నివేదికలను వెలువరించింది. తాజా నివేదికను కేవలం చిన్నారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. నివేదిక ప్రకారం 2023 అక్టోబర్ నుంచి ఇరవై వేల మందికి పైగా పాలస్తీనా చిన్నారులను ఇజ్రాయిల్ బలితీసుకుంది.

నలభై నాలుగు వేల మంది పిల్లలు క్షతగాత్రులయ్యారు. చనిపోయిన, గాయపడిన పిల్లల సంఖ్య, రేటును గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆధునిక సంఘర్షణలలో ఎన్నడూ లేనంత అధికంగా ఉన్నాయి. గాజా స్ట్రిప్ ‘ప్రపంచంలోని చిన్నారులకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం’ అని యునిసెఫ్ అభివర్ణించింది. తలలు లేదా మొండేలను లక్ష్యంగా చేసుకొని జరిపిన డ్రోన్ కాల్పులలో పిల్లలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు ప్రమాదవశాత్తూ జరిగినవి కావు. ఉద్దేశపూర్వకంగానే జరిగాయి. చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించే సమయంలోనూ, వారు ఆశ్రయం పొందుతున్న వేళ కూడా దాడులు చేశారు. పిల్లల శరీర భాగాలను లక్ష్యంగా చేసుకుంటూ ఇజ్రాయిల్ రక్షణ దళాల సేనలు రాక్షస క్రీడకు పాల్పడ్డారు. పిల్లలకు రక్షణ కల్పిస్తున్న ఆస్పత్రులు, పాఠశాలలు, అనాధాశ్రమాలపై సైతం భీకర దాడులు జరిగాయి. నవజాత శిశువులకు చికిత్స అందిస్తున్న సమయంలోనూ దాడులు చేశారు. పాలస్తీనా చిన్నారులను అకారణంగా నిర్బంధించడం, అక్కడ వారిపై దురుసుగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం వంటి చర్యలకు ఇజ్రాయిల్ సేనలు తెగబడ్డాయని నివేదిక తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -