ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం
వాషింగ్టన్ : ట్రంప్ అనుసరిస్తున్న అత్యంత విధ్వంసకర విధానాల కారణంగా అమెరికా- భారత్ సంబంధాలు గత 30 ఏండ్లలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయని భారతీయ- అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన ‘యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ లీడర్‌షిప్ సమ్మిట్’లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సుంకాల (టారిఫ్) వివాదాలు అహేతుకమైనవని అభివర్ణించారు.
ఇటీవల తాను చైనాలో పర్యటించినప్పుడు, అక్కడి భారత రాయబారి తనకు ఒక విషయాన్ని చెప్పారని ఖన్నా గుర్తు చేశారు. ట్రంప్ విధానాల వల్ల ఒక తరానికి ఏర్పడిన నమ్మకం దెబ్బతిన్నదని ఆ రాయబారి అన్నట్లు తెలిపారు.ట్రంప్ ఏకపక్ష చర్యలు ముఖ్యంగా ఇరాన్ పట్ల అనుసరించిన దూకుడు విధానాలు ప్రపంచ స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలిగించాయని అభిప్రాయపడ్డారు. సంప్రదాయ మిత్రదేశాలతో చర్చించకుండా ఏకపక్ష యుద్ధానికి దిగాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. “ఐరోపా, కెనడా లేదా భారత్‌తో కనీసం సంప్రదించకుండా, మన మిత్రదేశాల ప్రమేయం లేకుండా ఏకపక్ష యుద్ధానికి దిగి ప్రపంచ పరిస్థితులను అస్తవ్యస్తం చేయడం మన విశ్వసనీయతను దెబ్బతీసింది.” అని ఖన్నా అన్నారు. “నేను ఏ విషయాలను దాచకుండా సూటిగా మాట్లాడే వ్యక్తిని. దేనినైనా ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను. గత 30 ఏండ్లలో అమెరికా- భారత్ సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌తో యుద్ధానికి దిగేలా ట్రంప్ అనుసరించిన విధానాలు అత్యంత విధ్వంసకరమైనవి. ఇవి భారత్లో గ్యాస్ ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. నా మాట నమ్మకపోతే భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అడగండి. నేను చైనా పర్యటనలో ఉన్నప్పుడు ట్రంప్ కారణంగా ఒక తరానికి అమెరికాపై నమ్మకం పోయిందని అక్కడి భారత రాయబారి నాతో చెప్పారు. ఈ అధ్యక్షుడు చేసిన నష్టం గురించి మనం నిజం మాట్లాడకపోతే మనం వాస్తవంలో జీవించడం లేదని అర్థం చేసుకోవాలి.”అని రో ఖన్నా వివరించారు. అంతేకాక ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని కూడా ఖన్నా తప్పుబట్టారు.
అమెరికా మరిచిన నైతిక దృక్పథం
ఇరాన్, క్యూబాలను బెదిరించడం, గ్రీన్‌ల్యాండ్ స్వాధీనానికి ప్రయత్నించడం వంటి ట్రంప్ విధానాలనూ ఖన్నా తీవ్రంగా విమర్శించారు. “ప్రస్తుతం అమెరికా అసలు నైతిక దృక్పథాన్ని పూర్తిగా మర్చిపోయింది. ‘బలవంతుడిదే రాజ్యం’ అనే విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. ఇరాన్, క్యూబాలను బెదిరించడం, గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని చూడటం వంటివి చేస్తోంది. అయినా సరే, అంతా సాధారణంగానే ఉన్నట్లుగా మనం ఆనందంగా ఉంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా నాయకత్వాన్ని ట్రంప్ పూర్తిగా నాశనం చేస్తుంటే, ఇక భాగస్వామ్యాల గురించి ఎవరికి పట్టింపు ఉంటుంది? విద్యార్థి వీసాల విషయంలో ఆయన చేసిన విధానాలను, అమెరికాకు వస్తున్న ప్రతిభను రాక్షసులుగా చిత్రీకరించడాన్ని మనం ఇక్కడ కూర్చుని ఖండించకుండా ఎలా ఉండగలం?” అని ఖన్నా అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో అమెరికా అగ్రగామిగా ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలపైనా రో ఖన్నా స్పందించారు. “అగ్రశ్రేణి ఏఐ పరిశోధకుల్లో 38 శాతం మంది చైనా సంతతికి చెందినవారు. 72 శాతం మందికి విదేశీ డిగ్రీలు ఉన్నాయి. మనం ప్రతిభను తిరస్కరించకుండా, దాన్ని ప్రోత్సహించాలనే విషయాన్ని కనీసం అర్థం చేసుకోని అధ్యక్షుడు ట్రంప్.” అని ఖన్నా అన్నారు. ట్రంప్‌ను పేలవ అధ్యక్షుడిగా (‘ల్యామ్ డక్’) అభివర్ణించిన ఖన్నా, రాబోయే మధ్యంతర ఎన్నికలు, 2028 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు నిర్ణయాత్మకంగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
దిగజారిన భారత్-అమెరికా సంబంధాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



