కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ నిరసనలు
3న కేరళంలోని 14 జిల్లా కేంద్రాల్లో మార్చ్‌లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ అవకతవకలకు బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని తొలగించాలని కోరుతూ చేస్తున్న ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా 100 నిరసనా ర్యాలీలు నిర్వహించనుంది. ‘విద్యార్థుల ప్రాణాలు అమూల్యమైనవి.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’ అనే నినాదంతో ఈ ర్యాలీలను నిర్వహించనున్నారు. నీట్ పేపర్ లీకేజీ , సీబీఎస్ఈ పరీక్షలో అవకతవకలు బయటపడిన తరువాత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న విషయం విదితమే. ఈ ఆందోళనలు దేశ వ్యతిరేకమనీ, నిరసనకారులు ఉగ్రవాదులని మంత్రి ఆరోపించారు. మరోపక్క బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని చీల్చే వైరస్ అంటూ ఆరోపించారు. వీటికి దేశంలోని విద్యార్థులు, యువత గట్టి సమాధానం ఇస్తున్నారు. అయితే అవకతవకల కారణంగా నీట్ పరీక్షను రద్దు చేస్తారన్న ఒత్తిడితో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న నిజాన్ని దాచిపెడుతూ, విద్యాశాఖ మంత్రి ఇలాంటి హాస్యాస్పద ప్రకటనలు చేసి తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నాప్రతాల లీక్ రాకెట్లు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఇప్పటికే అనేక నిరసనలు చేపట్టింది. మే 3న విద్యా మంత్రిత్వ శాఖ వరకు జరిగిన మార్చ్‌పై పోలీసులు దారుణంగా దాడి చేశారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ నిర్వహించారు. 22 రాష్ట్రాల్లోని 643 కేంద్రాల్లో జరిగిన ఆందోళనల్లో 823 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరిలో 16 మంది జైలులో ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలను కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ నిర్ణయించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 100 నిరసన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ప్రదర్శనలు
- Advertisement -
- Advertisement -



