- Advertisement -
లక్నో : అయోధ్యలోని రామ మందిరానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల కేసులో నిందితుల తరఫున వాదించటానికి అయోధ్య బార్ అసోసియేషన్ నిరాకరించింది. నిందితులకు అండగా నిలిచే ఏ న్యాయవాదికైనా రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాళికా ప్రసాద్ మిశ్రా హెచ్చరించారు.ఈ కేసులో ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా వారందరినీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రాసిక్యూషన్ కేసును నిర్వహించడానికి 15 నుంచి 20 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు కాళికా ప్రసాద్ మిశ్రా తెలిపారని ఏఎన్ఐ నివేదించింది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పరిశీలించాలని డిమాండ్లు వస్తున్నాయని కూడా ఆయన పేర్కొన్నారని తెలిపింది. "ఐదుగురు వ్యక్తుల బృందం దేవునికి సమర్పించిన కానుకలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నప్పుడు, వాటిని సమర్పించడంలో అర్థం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు," అని మిశ్రా అన్నట్టు ఏఎన్ఐ పేర్కొంది. "ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులపై అధికారికంగా అభియోగాలు మోపినప్పటికీ, ఇంకా చాలా ఎక్కువ బాధ్యత వహించాల్సిన ఇతరులు కూడా ఇందులో చిక్కుకున్నారు" అని వారు వాదిస్తున్నారని తెలిపింది. రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా , ఆలయ నిర్మాణ ఇన్‌చార్జి గోపాల్ రావులకు తెలియకుండా ఈ ఆరోపిత దుర్వినియోగం జరిగి ఉండదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. రాయ్ , అనిల్ మిశ్రా జూన్ 26న "నైతిక కారణాల"పై తమ పదవులకు రాజీనామా చేశారు. ఆలయాన్ని నిర్వహిస్తున్న రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది గుమస్తా లేదా సేవకుని ద్వారా జరిగే దొంగతనం, నేరపూరిత విశ్వాస భంగం, దొంగిలించబడిన ఆస్తి , నేరపూరిత కుట్రకు సంబంధించిన భారతీయ న్యాయ సంహితలోని నిబంధనలను ప్రస్తావించింది.
- Advertisement -



