పార్టీ కార్యకర్తలకు జిన్‌పింగ్ పిలుపు
బీజింగ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ తాను సాధించిన పురోగతిని కాపాడుకుంటూనే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 105వ వ్యవస్థాపక వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బీజింగ్‌లోని గ్రేట్ వాల్ ఆఫ్ పీపుల్‌లో 40 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. పార్టీ కార్యక్రమాలను అమలు చేస్తూనే మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా నడచుకోవాల్సిన అవసరం ఉన్నదని పార్టీ కార్యకర్తలకు జిన్‌పింగ్ సూచించారు. ‘వ్యూహాత్మక అవకాశాలు, ప్రమాదాలు, సవాళ్లు ఏకకాలంలో కొనసాగుతున్న దశలో మన అభివృద్ధి ఉంది. దేశీయ, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరిం చడానికి పార్టీ తన ప్రయత్నాలను మరింత మెరుగ్గా సమన్వయం చేసుకోవాలి’ అని అన్నారు. పార్టీ పురోగతిని, సైద్ధాంతిక స్వచ్ఛతనను ముందుకు తీసుకొని పోవాలంటే హానికరమైన వాటితో పాటు ఆరోగ్యకరమైన పార్టీని క్షీణింపజేసే అన్ని రకాల వైరస్‌లను నిర్మూలించాలని చెప్పారు. తైవాన్ సమస్య పరిష్కారం కోసం పార్టీ వ్యూహాన్ని పూర్తిగా అమలు చేయాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.
వంద మిలియన్లకు చేరిన సభ్యుల సంఖ్య
1921లో కేవలం కొన్ని డజన్ల మంది స్థాపించిన చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య వంద మిలియన్లకు చేరుకుంది. చైనా జనాభాలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుల సంఖ్య 7.2 శాతంగా ఉంది. ప్రపంచంలోని ‘అతి పెద్ద రాజకీయ పార్టీ’ స్థాయి నుంచి ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీ’గా రూపాంతరం చెందడమే ప్రస్తుతం దాని ఉద్దేశమని అధికార సిన్హువా వార్తా సంస్థ తన తాజా సంపాదకీయంలో తెలిపింది. 2012లో అధికారంలోకి వచ్చిన జిన్‌పింగ్ దేశంలో పార్టీని అజేయ శక్తిగా మలిచారు. పార్టీ శ్రేణులలో క్రమశిక్షణను పెంచారు. ప్రపంచ వేదికపై చైనా ప్రభావాన్ని ఇనుమడింప జేశారు. అవినీతిని సమూలంగా రూపు మాపేందుకు చర్యలు చేపట్టారు. లక్షలాది మంది అధికారులపై విచారణలు జరిపించి అగ్రశ్రేణి జనరల్స్ సహా అవినీతిపరులుగా తేలిన వందలాది మందిని తొలగించారు.
ఉన్నతాధికారులకు శిక్షణ కోర్సు
దేశంలో అన్ని స్థాయిలలోనూ అవినీతిని దాదాపుగా నిర్మూలించిన తర్వాత సీనియర్ అధికారుల కోసం అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏప్రిల్‌లో పది వారాల రాజకీయ శిక్షణ కోర్సును ప్రారంభించారు. పార్టీ పట్ల విశ్వాసంతో ఉండాలని, దాని ఆశయాలకు విధేయులై ఉండాలని వారికి సూచించారు.



