అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
నవతెలంగాణ-మిడ్జిల్
జిల్లా నుండి గ్రామపంచాయతీ వరకు అన్ని శాఖల అధికారులు జులై 4న మిడ్జిల్లో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతరత్న బిఆర్ అంబేద్కర్, గోపాల్ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ బహిరంగ సభ విజయవంతం చేయడానికి పనిచేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అదనపు ఎస్ పి రత్నం చెప్పారు. గురువారం మండల కేంద్రంలోముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ నిర్వహణ, డా.బి.ఆర్.అంబేద్కర్, మాజీ జెడ్పీ చైర్మన్ దివంగత ధ్యాస గోపాల్ రెడ్డి విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ప్రతి శాఖ అధికారి చేపట్టాల్సిన బాధ్యతలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ వివరించారు.
ముఖ్యంగా ఆర్ అండ్ బి శాఖ అధికారులు హెలిప్యాడ్ నిర్మాణం, సభ ప్రాంగణంలో బారికేడ్ల ఏర్పాటు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు శాఖ అధికారులు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రెవెన్యూ శాఖ అధికారులు వేదిక (డయాస్), గ్యాలరీలు, వీఐపీ వాహనాల ప్రవేశ మార్గం, ప్రజల రాకపోకలకు సంబంధించిన ఏర్పాటు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని తెలిపారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు విగ్రహాల నిర్మాణ పనులను వేగవంతం చేసి పూరి చేయాలని ఆదేశించారు. పంచాయతీ శాఖ అధికారులు సభా ప్రాంగణంలో ఫ్లెక్సీలు, ఇతర అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. తహశీల్దార్లు, మున్సిపల్ అధికారులు గ్రీన్ రూముల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు సభా ప్రాంగణంలో విద్యుత్ దీపాల ఏర్పాటు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అంబులెన్సులు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆర్టీసీ అధికారులు తగిన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసి, సభకు హాజరయ్యే ప్రజలను నిర్ణీత సమయానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎ. శ్రీనివాసులు, ఆర్డీఓ నవీన్, వివిధ శాఖల జిల్లా అధికారులు , మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



