– ఉత్తర భారత రాష్ట్రాల్లో జన ఆక్రోశ్ జాతాలు
– కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు
– మోడీ ఇజ్రాయిల్ పర్యటన అభ్యంతరకరం
– అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలను గెలిపించండి
– అమెరికా-భారత్ వాణిజ్యం ఒప్పందం ఆక్షేపణీయం
– క్యూబాకు సంఘీభావం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 24న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రకటించింది. లేబర్‌కోడ్‌ల నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడాన్ని, వీబీ గ్రామ్ జీ అమలును నిరసిస్తూ, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన ఆందోళనలు జరుగుతాయని తెలిపింది. ఉత్తర భారత రాష్ట్రాల్లో ర్యాలీ సన్నాహాల్లో భాగంగా, జన ఆక్రోశ్ జాతాలను నిర్వహిస్తారనీ, వీటిలో పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొంటారని తెలిపింది.
త్వరలో ఎన్నికల షెడ్యూల్
కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, దుర్భర దారిద్య్రాన్ని నిర్మూలించడంపై దృష్టి పెట్టడం ద్వారా అక్కడి ప్రభుత్వం అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిందని పార్టీ తెలిపింది. దేశంలోనే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ రికార్డు నమోదు చేసింది. ప్రజారోగ్యాన్ని, విద్యను మెరుగుపరిచింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా నిత్యావసరాలను క్రమం తప్పకుండా సరఫరా చేస్తూ, కార్మికుల హక్కుల పరిరక్షణకు హామీ కల్పిస్తూ చర్యలు తీసుకుంది. అర్హత కలిగిన వారందరికీ పెన్షన్లు పంపిణీ అయ్యేలా కూడా చర్యలు తీసుకుంది. ఈ అసాధారణమైన ట్రాక్ రికార్డును దృష్టిలో వుంచుకుని, ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగా నిర్ణయాత్మకంగా మరోసారి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ పెద్ద మొత్తంలో నిధులను సమీకరిస్తోంది. తనకు మద్దతుగా వివిధ రకాల మతతత్వ శక్తులను సమీకరిస్తోంది. బీజేపీతో సమన్వయం చేసుకోవడం ద్వారా అసెంబ్లీ లోపల, వెలుపల విధ్వంసకర పాత్ర పోషిస్తోంది. మతోన్మాద ధోరణులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో విస్తరించడానికి బీజేపీ కూడా ప్రయత్నిస్తున్నదనీ, ఈ రెండు శక్తులను ఓడించాల్సి వుందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమికి ఓటు వేయడం ద్వారా నిరంకుశ, మహిళా వ్యతిరేక, పేదల వ్యతిరేక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని, అలాగే మతోన్మాద బిజెపిని ఓడించాలని పొలిట్‌బ్యూరో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మతోన్మాద విషాన్ని చిమ్ముతూ, మత ప్రాతిపదికపై ప్రజల్లో చీలికలు తెచ్చేలా అన్ని అవకాశాలను బీజేపీ వినియోగించుకుంటోందనీ, బీజేపీపై పోరాటం పేరుతో వివిధ రకాలైన ముస్లిం ఛాందసవాద శక్తులు, మతతత్వ శక్తులు కూడా రాష్ట్రంలో చురుకుగా వున్నాయని గుర్తుచేసింది.
తమిళనాడులో బలోపేతమైన డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి రావడానికి ప్రజల దగ్గరకు వెళ్తున్నదనీ, బీజేపీ అన్నాడీఎంకే కూటమి తిరుప్పకుండ్రం చుట్టూ మతోన్మాద రాజకీయాలను పెంచి పోషిస్తున్నదని తెలిపింది. ఈ రాష్ట్రంలో లౌకికవాద సాంప్రదాయాలను బలోపేతం చేసేందుకు డీఎంకే కూటమిని తిరిగి ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మైనారిటీలు, దళితులు, మహిళలపై దాడులు
దేశంలో మైనారిటీలు, దళితులు, మహిళలపై దాడులు అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నాయని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దేశంలో జరిగిన పలు సంఘటనలను పొలిట్‌బ్యూరో ప్రస్తావించింది. అస్సాంలో తీవ్రమైన మతతత్వ, విభజనవాద ప్రచారం ద్వారా ప్రయోజనం పొందాలని బీజేపీి ఆశిస్తున్నదనీ, ప్రజలు ఆపార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
విద్యార్థులపై దాడులు
జెఎన్‌యు వైస్ ఛాన్సలర్‌పై కులతత్వ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసనలు తెలియచేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ విద్యార్ధులపై ఏబీవీపీ గూండాలు దాడులు చేశారని పొలిట్‌బ్యూరో గుర్తుచేసింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు జెండా స్తంభాలను ఆర్‌ఎస్‌ఎస్ ధ్వంసం చేసిందనీ, ఇలాంటి దాడులన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది.
ఉత్తరాఖండ్‌లో..
ఉత్తరాఖండ్‌లోని కొట్ద్వార్‌లో ముస్లిం దుకాణ యజమానులపై విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ులకు చెందిన కార్యకర్తల బృందం చేస్తున్న దాడిని యువకుడైన హిందూ జిమ్ యజమాని ప్రతిఘటించడం చూస్తుంటే, ఇంకా మన సమాజంలో లౌకికవాద ధోరణులు నెలకొన్నాయని ప్రదర్శితమైందని పేర్కొంది. ఇటువంటి మతోన్మాద దాడులను ప్రతిఘటించడం ద్వారా ముస్లింల జీవనోపాధులను కాపాడేందుకు తనను తాను ‘మహ్మద్ దీపక్’ గా చెప్పుకున్న దీపక్ కుమార్ సాహసోపేత వైఖరిని పొలిట్‌బ్యూరో ప్రశంసించింది.
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం
అమెరికాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పార్టీ అభిప్రాయపడింది. కోట్లాదిమంది దేశ రైతులు, కార్మికుల జీవితాలను ఈ వాణిజ్య ఒప్పందం ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది.ఈ మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికాకు భారత ప్రభుత్వం లొంగిపోయిందని అర్ధమవుతున్నదనీ, రష్యన్ చమురు దిగుమతులను కుదించడంపై అమెరికా ఆదేశాలకు మోకరిల్లిందని ఆక్షేపించింది.
కోర్టులు చెప్పినా..
టారిఫ్‌లు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అధికారం లేదని అమెరికా సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో కొత్త పరిస్థితి ఉత్పన్నమైంది. మరో చట్టపరమైన నిబంధనను ఉపయోగిస్తూ అన్ని దేశాలపై 15శాతం టారిఫ్‌లను ట్రంప్ విధించారు. ఈ తీర్పు తర్వాత యురోపియన్ యూనియన్ (ఇయు) వంటి అమెరికా మిత్రపక్షాలు కూడా అమెరికాతో తమ వాణిజ్య ఒప్పందాన్ని సస్పెండ్ చేశాయి. కానీ, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం అసమానతలతో కూడిన వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకునేందుకు సుముఖత చూపడం లేదని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటాలు ఇవ్వడానికి నిరాకరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశామే ఇవ్వట్లేదనీ, అమెరికా, యురోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వివరాలను చర్చ నిమిత్తం పార్లమెంట్ ముందు పెట్టలేదని పొలిట్‌బ్యూరో తెలిపింది. నిరసన తెలుపుతున్న లోక్‌సభ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారని పేర్కొంది. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 12న చేసిన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మిక, కర్షక లోకానికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో అభినందనలు తెలిపింది.
ఎస్‌ఐఆర్ : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పొలిట్‌బ్యూరో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తక్కువ టైంలో ‘సర్’ అమలు వల్ల క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జ్యుడీషియల్ అధికారులను సుప్రీంకోర్టు నియమించిందని గుర్తుచేసింది.
క్యూబాకు సంఘీభావం
క్యూబాపై ఆర్థిక ఆంక్షలను అమెరికా మరింత ఉధృతం చేసింది. ఆదేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల పాల్జేసే ఉద్దేశ్యంతో ఇంధన సరఫరాలను నిలిపివేసేందుకు ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తోంది. ఈ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొంటూనే క్యూబా ప్రజలు సామ్రాజ్యవాద ఒత్తిళ్ళను ప్రతిఘటిస్తున్నారని పొలిట్‌బ్యూరో తెలిపింది. క్యూబాకు తమ సంఘీభావాన్ని పార్టీ పునరుద్ఘాటించింది. క్యూబన్లకు అత్యంత కీలకమైన ఔషధాలు, ఇతర రోజువారీ అవసరాలను తక్షణమే పంపించాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఇరాన్‌పై దాడులు
ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుంటూ పశ్చిమాసియాలో అమెరికా పెద్ద ఎత్తున సాయుధ బలగాలను సమీకరిస్తోంది. ఇరాన్‌పై జరిగే ఏ దాడి అయినా మొత్తంగా ఈ ప్రాంతమంతటికీ విస్తరిస్తుంది. ఈ దాడుల వల్ల కేవలం పశ్చిమాసియాకే కాకుండా మొత్తంగా ప్రపంచ శాంతికి తీవ్ర పర్యవసానాలు, పరిణామాలు తలెత్తుతాయి.
అమెరికా దురాక్రమణను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండించాలి, క్యూబా, వెనిజులా, ఇరాన్‌లకు బాసటగా నిలబడాలని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
ఇజ్రాయిల్‌లో మోడీ పర్యటన
గాజాలో కాల్పుల విరమణను ఇజ్రాయిల్ ఉల్లంఘించి, యుద్ధాన్ని కొనసాగిస్తూ, పశ్చిమాసియాను ఆక్రమిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను పొలిట్‌బ్యూరో తప్పుపట్టింది. ఇజ్రాయిల్ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగించడమన్నది అమెరికా, ఇజ్రాయిల్‌తో భారత విదేశాంగ విధాన ప్రయోజనాల పూర్తి సమన్వయాన్ని ప్రదర్శిస్తోందని ఆక్షేపించింది. పాలస్తీనా ప్రయోజనాలకు మద్దతునిస్తూ, ప్రత్యేక దేశం కావాలన్న పాలస్తీనియన్ల హక్కును పరిరక్షిస్తూ భారత్ దీర్ఘకాలంగా అనుసరిస్తూ వచ్చిన వైఖరి నుండి ఇది పూర్తిగా పక్కకు మళ్లడమేనని చెప్పింది. ఇజ్రాయిల్ ప్రోద్బలం మేరకు ఇరాన్‌పై సైనిక దాడి జరిపేందుకు అమెరికా సమాయత్తమవుతున్న తరుణంలో ఈ పర్యటన జరపడం మరింత అసమంజసమైనదని తెలిపింది. జర్మనీ, ప్రాన్స్ వంటి అమెరికా సన్నిహిత మిత్ర దేశాలు కొన్ని ఈ పీస్ బోర్డ్‌లో చేరేందుకు తిరస్కరించాయి. అటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత దారుణంగా వుందని పొలిట్‌బ్యూరో ఆక్షేపించింది.
24న ఢిల్లీలో మెగా ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



