Friday, July 3, 2026
E-PAPER
Homeజాతీయంనిరసనకారులపై ఢిల్లీ పోలీసుల వీరంగం

నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల వీరంగం

- Advertisement -

జోరువానలో కొన‌సాగిన సీజేపీ ఆందోళ‌న
ఏసీపీ అజయ్ శర్మను తక్షణమే సస్పెండ్ చేయాలి : అభిజీత్ దీప్కే
క్షీణిస్తోన్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

‌నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ పేప‌ర్ లీక్‌, ‌సీబీఎస్‌ఈలో అవ‌క‌త‌వ‌క‌లతో పాటు విద్యా రంగ వైఫ‌ల్యాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కొనసాగుతున్న ఆందోళ‌న గురువారం నాటికి 13 రోజుకు చేరుకుంది. ప‌ర్యావ‌ర‌ణ వేత్త సోన‌మ్ వాంగ్‌చుక్ నిర‌వ‌ధిక నిర‌హార‌దీక్ష ఐదో రోజు కొన‌సాగింది. మరోవైపు ఈ ఆందోళ‌నలో పాల్గొన్న విద్యార్థులు, యువ‌త చ‌దువుకునేందుకు వీలుగా లైబ్ర‌రీ నిర్వ‌హిస్తోన్న విద్యార్థుల‌పై ఢిల్లీ పోలీసులు దాడి చేశారు. భ‌గ‌త్ సింగ్‌, ఛ‌త్ర‌ప‌తి శివాజీ పుస్త‌కాలు విసిరేశారు. ఈ ఘటనలో ప‌లువురు విద్యార్థుల‌కు గాయాలయ్యాయి. అంతకుముందు విద్యార్థులు విద్యా వ్యవస్థకు ప్రతీకాత్మక అంత్యక్రియలు (శిక్షా వ్యవస్థ కా శవ్) నిర్వహించారు. భవిష్యత్తును నిర్మించాల్సిన వ్యవస్థే నిరంతర పేపర్ లీక్‌లతో దానిని నాశనం చేస్తుంటే, ఇక ఏమి చేయగలరు? వారు ఎవరి వైపు చూడాలి? అంటూ విద్యా వ్యవస్థకు పాడె కట్టి జోరు వానలోనూ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ​ఈ సందర్భంగా సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ భ‌గ‌త్ సింగ్‌, ఛత్రపతి శివాజీ మహారాజ్లకు సంబంధించిన పుస్తకాలతో సహా ఇతర పుస్తకాలను ఏసీపీ అజయ్ శర్మ, ఆయ‌న‌ బృందం పారవేసి, లైబ్రరీని ఏర్పాటు చేసిన విద్యార్థులపై దారుణంగా దాడి చేసిందన్నారు. భ‌గ‌త్ సింగ్‌, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ల‌ను అవమానించినందుకు ఏసీపీ అజయ్ శర్మను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేప‌డుతున్న ప‌ర్యావ‌ర‌ణ కార్యక‌ర్త సోన‌మ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందన్నారు. ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిజీత్ దీప్కే హెచ్చరించారు. ప్రధాన్ రాజీనామా చేయాలన్న తన డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు. సీజేపీ ఆందోళ‌న‌కు సీపీఐఎంఎల్ లిబ‌రేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దీపాంక‌ర్ భ‌ట్టాచార్య‌, సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డి.రాజా, సామాజిక కార్య‌క‌ర్త యోగేంద్ర యాద‌వ్‌, సుప్రీంకోర్టు న్యాయ‌వాది ప్రశాంత్ భూష‌ణ్‌, స‌మాచార‌హ‌క్కు కార్య‌క‌ర్త అంజ‌లి భ‌ర‌ద్వాజ్‌, టీఎంసీ ఎంపీ సాగ‌రిక ఘోష్ సంఘీభావం తెలిపారు. ఇప్ప‌టికే ఈ ఉద్య‌మానికి సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ, సీనియ‌ర్ నాయ‌కురాలు బృందా క‌ర‌త్ మ‌ద్ద‌తు తెలిపిని విషయం తెలిసిందే. అలాగే విద్యార్థి, రైతు, మ‌హిళా సంఘాలూ మ‌ద్ద‌తు తెలిపాయి. మరోపక్క ‘ఈ ఉద్యమాన్ని మరింత మెరుగ్గా, పెద్దదిగా ఎలా చేయగలవ’’ అనే దానిపై అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యంగా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ‘బొద్దింకలతో చాయ్ పే చర్చ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -